సామాన్య ప్రజల కోసమే పోరాడాను

– నాకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు
– ప్రజలకు సేవకుడినని భావిస్తున్నా
– 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చాం
– 25 వేల రైతు కుటుంబాలకు రూ.20,616 కోట్ల రుణ మాఫీ
– కేంద్రం పట్టించుకోకున్నా అన్ని పంటలు కొనుగోళ్లు
– హైదరాబాద్‌ను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజన- 
– 12 వరుసల రహదారితో మచిలీపట్నం ఓడరేవు అనుసంధానం
– విద్యా వ్యవస్థ మార్పుపై దృష్టిపెట్టాం
– హిందూ గ్రూప్ డైరెక్టర్ రామ్‌తో సీఎం రేవంత్

బెంగళూరు, ప్రజాతంత్ర, జూన్ 6 : నేను రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండా, ఎవరి మద్దతు లేకుండా రాజకీయాల్లోకి వచ్చాను.. పదేళ్లు చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగు దేశంలో పనిచేశాను.. రాష్ట్ర విభజన, స్థానిక కారణాలతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి, ఆ పార్టీకి రాజీనామా చేశా.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన పోరాటం కావాలని ప్రజలు భావించినందున కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా.. ఈ జూలైతో నా రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తవుతాయి అని సీఎం రేవంత్‌రెడ్డి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రజాపాలన చేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం.. రాష్ట్రానికి సంబంధించి సమగ్రమైన ప్రణాళిక ఉందంటూ ద హిందూ హడిల్‌లో బై, ఫర్ అండ్ ఆఫ్ ద పీపుల్- గుడ్ గవర్నెన్స్ ఫర్ తెలంగాణ అంశాలపై హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్.రామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి పలు అంశాలు పంచుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి : విద్యార్థి పరిషత్‌లో పని చేశా.. తర్వాత వ్యాపారం చేశా.. 2006 జులైలో ఇండిపెండెంట్‌గా జెడ్పీటీసీ సభ్యునిగా గెలిచా.. 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా.. తర్వాత టీడీపీలో చేరి పదేళ్లు చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశా. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రాష్ట్ర విభజన, స్థానిక కారణాలతో, కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన పోరాటం కావాలని ప్రజలు భావించడంతో టీడీపీకి రాజీనామా చేశా.. ఆ సమయంలో నా ఎదుట ఎన్నో మార్గాలున్నాయి.. కానీ నేను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను.. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ నెరవేర్చారు.. 2018 డిసెంబరు ఎన్నికల్లో ఓడిపోయా.. మూడు నెలల తర్వాత దేశంలోనే అతి పెద్దదయిన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచా.. తర్వాత నేను పీసీసీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని అయ్యాను. 2026 జులైతో నా ప్రజా జీవితం 20 ఏళ్లు పూర్తవుతుంది. నా రాజకీయ జీవితమంతా ప్రజలు, సామాన్యుల కోసం పోరాడా.. నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు.. ఎటువంటి మద్దతు లేదు.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా.. నా తండ్రి పోలీస్ పటేల్.. మాది వ్యవసాయ కుటుంబం.. కష్టించే పనితత్వం.. రాఫ్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చా.
సీఎం రేవంత్ రెడ్డి: గతంలో రాష్ట్రాన్ని పాలించే అవకాశం వచ్చిన వారు పాలకులుగా భావించారు.. నేను సేవ చేయడానికి వచ్చిన ప్రజా ప్రతినిధిగా భావించా.. సామాన్యుల సమస్యలు ఏమిటో అర్ధం చేసుకున్నాను. ప్రత్యేకించి యువత, రైతు కూలీలు, మహిళల సమస్యలు తెలుసుకున్నా. 1969 మొదటి దశ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగింది.. 2009లోనూ ఉద్యమం అందుకే వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వరంగంలో 2 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదు.. పీసీసీ అధ్యక్షునిగా ప్రతి నియోజకవర్గంలో పర్యటించా.. పాదయాత్ర చేశా.. యువత సమస్యను, వాళ్ల ఆవేదనను అర్ధం చేసుకున్నా. గతంలో ఒక ఆర్‌ఎంపీ డాక్టర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన గ్రూప్-1 అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తాడు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునరావాస కేంద్రంగా ఉండకూడదనే నేను యూపీఎస్సీ చైర్మన్, ఇతర సభ్యులను కలిసి చర్చించా. యూపీఎస్సీ ఎలా పని చేస్తుందో, వివాదాలు లేకుండా నియామక ప్రక్రియ ఎలా చేపడతారో తెలుసుకున్నా.. దాన్ని టీజీపీఎస్సీలో అమలు చేశా.. 15 నెలల్లో మేం 67,760 ఉద్యోగాలు ఇచ్చాం.. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చాం.. రెండు వారాల క్రితం నోటిఫికేషన్లు ఇచ్చాం.. త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం.. మా యువత ఇప్పుడు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు.

రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణ

గతంలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఎక్కువ సంఖ్యలో రైతు ఆత్మహత్యలు జరిగేవి.. కారణం అప్పులు. నేను అధికారంలోకి వచ్చాక 25,035 రైతు కుటుంబాలకు చెందిన రూ.20,616 కోట్ల రుణాలను మాఫీ చేశా.. ఇది దేశంలోనే అత్యధిక రుణ మాఫీ.. 2024-25లో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వ ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పటివరకు కనీస మద్దతు ధర (ఎమ్మార్పీ) కోసం పోరాడారు.. నేను ఎమ్మార్పీ ఇవ్వడంతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చాను. ఎమ్మార్పీ ప్రకటించి కేందం చ్రేతులు దులుపుకుంటోంది.. పంట ఉత్పత్తుల సేకరణను పట్టించుకోవడం లేదు.. ధాన్యం, మొక్కజొన్నతోపాటు ఇతర పంటలు మేం సేకరిస్తున్నాం.. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నాం. వాటిని రైతులు ఎరువులు, పెట్టుబడికి ఉపయోగించుకుంటున్నారు.

మహిళా సాధికారతకు కృషి

మహిళా సాధికారితకు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షలు మంది మహిళలున్నారు. 0 వడ్డీతో రూ.60 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు.. ఆ వడ్డీలను మేం కడుతున్నాం. మహిళా సంఘాలు వెయ్యి బస్సులు కొనుగోలు చేశాయి.. పునరుత్పాదక ఇంధన రంగంలోకి ఆ సంఘాలు వచ్చాయి. వాళ్లకు పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు ఇచ్చాం. ప్రతి ప్రభుత్వ సంస్థ వద్ద మా మహిళా సంఘాల సభ్యులు క్యాంటీన్లు నడుపుతున్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన మహిళా సంఘాలకు అప్పగించాం. వాళ్లు సంతోషంగా ఉన్నారు.
ఎన్.రామ్: దేశంలోనే అత్యంత వృద్ధి ఉన్న రాష్ట్రం తెలంగాణ. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రైజింగ్‌లో లక్ష్యంగా పెట్టుకున్నారు.. అది ఎలా సాధ్యం?
సీఎం రేవంత్ రెడ్డి: తెలంగాణకు సంబంధించి మాకు సమగ్రమైన ప్రణాళిక ఉంది. 160 కి.మీ ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని నగర ప్రాంతాన్ని క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ), ఓఆరఆర్-ఆరఆరఆర్ మధ్య ప్రాంతాన్ని ప్యూర్ (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ), ఆరఆరఆర్ వెలుపల ప్రాంతాన్ని రేర్ (రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ)గా పెట్టుకున్నాం. గతేడాది డిసెంబరులో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం.. పాలసీ డాక్యుమెంట్ విడుదల చేశాం. క్యూర్‌లో సర్వీస్, ప్యూర్‌లో మాన్యుఫ్యాక్చర్, రేర్‌లో అగ్రికల్చర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. క్యూర్‌ను నెట్ జీరో సిటీగా మార్చనున్నాం. మెట్రో విస్తరణ చేపడుతున్నాం. చెరువుల ఆక్రమణలు తొలగించి వాటి పునరుద్ధరణ చేపడుతున్నాం. వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం.. ప్యూర్ పరిధిలో మ్యాన్యుఫాక్చర్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం.. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం.. ఇక్కడ ఫార్చ్యున్ 500 కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానిస్తున్నాం.. మాది భూపరివేష్టిత రాష్ట్రం (ల్యాండ్ లాక్డ్ స్టేట్).. మాకు ఓడ రేవు లేదు.. అందుకే ప్రధానమంత్రి మోదీ, పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు&డుతో చర్చించి 12 వరుసల రహదారితో మచిలీపట్నం ఓడరేవును అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నాం. రోడ్డు, రైలు, ఓడరేవు, విమానాశ్రయంతో అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నా.. అవే మా వృద్ధికి కారణాలవుతాయి.

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం

మా దగ్గర ఐఎస్‌బీ, ట్రిఫుల్ ఐటీ, నల్సార్ యూనివర్సిటీ ఉన్నాయి.. మేం విద్యా సంస్థలపై దృష్టిపెట్టాం. మానవ వనరుల ప్రాధాన్యాన్ని గుర్తించాం. ఏఐతో వైట్ కాలర్ జాబ్‌లు పోతున్నాయి.. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ఇది ప్రభుత్వ-ప్రైవేటు సంస్థ. ఆనంద్ మహీంద్రా ఈ యూనివర్సిటీ చైర్మన్, శ్రీని రాజు వైస్ చైర్మన్. అన్ని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు డైరెక్టర్లు.. వాళ్లే సిలబస్ రూపొందిస్తారు.. వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు.. వాళ్లే ఉద్యోగాలు ఇస్తారు.. ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్. మనం 1950ల్లో ఐటీఐలు ఏర్పాటు చేశాం.. అందులో కాలం చెల్లిన కోర్సులు అంబాసిడర్ కారు రిపేర్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఆడీ, బీఎండబ్ల్యూ కార్లు.. ఒకే ఒక్క కారు తెలంగాణలో కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంది. వాళ్ల ఎన్నికల గుర్తు అంబాసిడర్ కారు.. ఎవరైనా అంబాసిడర్ కారు రిపేర్ చేయాలంటే ఫాంహౌస్‌కు వెళ్లాలి.. మేం ప్రస్తుత అవసరాలకు తగినట్లు టాటా కంపెనీతో ఒప్పందం చేసుకొని మా ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం.. ఇందుకు రూ.2,400 కోట్ల వ్యయం అవుతోంది. అందులో 86 శాతం టాటా కంపెనీ పెడుతోంది.. మేం బ్లూ కాలర్ జాబ్‌లు సృష్టిస్తున్నాం.. అందుకే నేను ఎక్కువగా జర్మన్, జపాన్, సౌత్ కొరియా పర్యటించా.. వైట్ కాలర్ జాబ్‌ల స్థానంలో బ్లూ కాలర్ జాబ్‌లు ఉన్నాయి.. ఇప్పుడు ఐటీ ఇంజినీర్ కన్నా బ్లూ కాలర్ జాబ్ చేసే వాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఆయా దేశాల్లో పనిచేసేలా జర్మన్, జపాన్, కొరియన్ భాషలు నేర్పిస్తున్నాం. వైట్ కాలర్ జాబ్‌లకు ప్రత్యామ్నాయం బ్లూ కాలర్ జాబ్స్. ఏఐ బ్లూ కాలర్ జాబ్స్‌కు ప్రత్యామ్నాయం సృష్టించలేదు. ఏఐ అన్నీ క్రియేట్ చేయొచ్చు.. కానీ రాజకీయ నాయకుడిని సృష్టించలేదు.. నాకు ఏఐ భయం లేదు.. మన యువతరం ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టాలి.. మన స్కిల్స్ పెంచుకోవాలి.
ఎన్.రామ్ : పెట్టుబడుల సాధనలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. అదే సమయంలో మహారాష్ట్ర, గుజరాత్ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి?
 సీఎం రేవంత్ రెడ్డి: గుజరాత్ పెట్టుబడులను ఆకర్షించడం లేదు. బలవంతంగా గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారు. గత 20 ఏళ్ల నుంచి ఒకే ఒక్క బ్రాండ్ అంబాసిడర్ అక్కడ పని చేస్తున్నారు.
ఎన్.రామ్: పెట్టుబడుల సాధనకు రాష్ట్రాలు ఉచితంగా భూములు ఇవ్వడంతోపాటు అనేక రాయితీలు ఇవ్వడంలో పోటీపడుతున్నాయి. మీ పొరుగు రాష్ట్రం ఏపీ కూడా అందులో ఒకటి. మీరు ఎలా చూస్తారు దీనిని?
 సీఎం రేవంత్ రెడ్డి: పొరుగు రాష్ట్రాలతో ఎందుకు పోటీ పడాలి.. మేం చైనా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీతో పోటీపడుతున్నాం. నేను 15 ఏళ్ల క్రితమే చైనా వెళ్లా.. నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇబ్బందిపడను.. సాగునీటి ప్రాజెక్టు దగ్గరకు వెళితే అసిస్టెంట్ ఇంజినీర్ దగ్గర నుంచి తెలుసుకోవడానికి మోహమాటపడను. ఎందుకంటే ఆయనకే అసలైన సమస్య తెలుసు.. దాన్ని ఎలా పరిష్కరించాలో తెలుసు. హార్వర్డ్‌లో పది రోజులు కోర్సు చేశా. త్వరలోనే చైనా సందర్శించి ఉత్తమమైన పద్ధతులను తెలుసుకుంటా.
ఎన్.రామ్: మీ సివిల్ సర్వెంట్లు, మాజీ సివిల్ సర్వెంట్లు.. సీనియర్ సిటిజన్స్ నుంచి నిర్ణయాలు తీసుకుంటారా? సొంతంగా తీసుకుంటారా?
 సీఎం రేవంత్ రెడ్డి: మిక్స్‌డ్.. బ్యూరోక్రాట్లు తెలివైనవారు.. ఏం అడిగినా ఎస్ అంటారు.. ఎందుకు ఎస్.. ఏమిటి ఎస్ అనేది అర్దం చేసుకోవాలి. ఏదైనా పత్రికలో కథనం చూస్తే దాని పరిష్కారం తెలుసుకుంటాను. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుంటా.. వాటిని రాసుకుంటా.. చివరకు నా అభిప్రాయం చెబుతా. ముందే నేను నా అభిప్రాయం చెబితే దానికి అనుగుణంగా వారు చెబుతారు.. 2006 నుంచి 2023 వరకు 17 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎంతో తెలుసుకున్నా. ప్రజా సమస్యలపై పోరాడా.. అందుకే నన్ను తప్పుదోవ పట్టించలేరు. చిన్న రైతు, నిరక్షరాస్యులు సైతం తమ దగ్గర ఉన్న సమాచారంతో తన కామన్‌సెన్స్‌తో పరిష్కారం చూపుతారు.. కామన్‌సెన్స్ ఉపయోగించి సమస్యను అర్ధం చేసుకుంటే సగం సమస్య పరిష్కారమవుతుంది. మిగతాది తగిన నిర్ణయంతో పూర్తవుతుంది. నేను ప్రతి బ్యూరోక్రాట్ మైండ్‌సెట్‌ను అర్ధం చేసుకోగలను..
సీఎం రేవంత్ రెడ్డి: ప్రతి పది రోజులకు ప్రెస్‌మీట్ నిర్వహిస్తా.. వాళ్లు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబిస్తా.. కేసీఆర్ మీడియా పర్సన్స్‌నూ అనుమతిస్తా.. ప్రజలతో అనుసంధానమైతేనే ఏదైనా అర్ధమవుతుంది.. ప్రజలతో అనుసంధానం కావడమే ప్రజా జీవితంలో నిజమైన బలం.
 ఎన్.రామ్: వ్యతిరేక వార్తలపై ఎలా స్పందిస్తారు?
 సీఎం రేవంత్ రెడ్డి: నేను దూషించను.. వ్యంగ్యంగా మాట్లాడతా. జర్నలిస్టులతో వాదించను. వాళ్లు వ్యతిరేకంగా రాసినా పట్టించుకోను. అందులో విషయం ఉంటే అధికారులతో మాట్లాడతా.. మీడియాను బ్యాక్ ఆఫీస్ సమాచారంగా చూస్తా.
సీఎం రేవంత్ రెడ్డి: చెరువులు, నాలాలను పేదలు ఆక్రమించుకుంటే అర్ధం చేసుకోగలం.. కానీ పెద్దవాళ్లు జల వనరులను చెరబడుతున్నారు. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశా. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా జల వనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి. విద్యార్థులు డ్రగ్స్ బారినపడుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు  ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. మా ఈగల్ ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమమైనది. కులతత్వాన్ని నిర్మూలించాలని చెబుతూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్స్‌ను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. దీంతో కులతత్వాన్ని నిర్మూలించేందుకు ఎలాంటి అంతరాలు లేకుండా అంతా కలిసి ఉంచేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం.

ఎస్సీ వర్గీకరణ చేపట్టాం

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మేం చేపట్టాం. గుజరాత్ కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేదు. 1931 తర్వాత దేశంలో కుల గణన చేపట్టలేదు. మా రాష్ట్రంలో కుల గణన చేపట్టాం.. కుల గణన లేకుండా ఎలా బీసీలకు మీరు పథకాలు ఇవ్వగలరు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లలోనూ పలు ఉప కులాల నుంచి ఒక్క డాక్టర్ లేరు.. విద్యాపరంగా వెనుకబడడమే ఇందుకు కారణం. ఉద్యోగులు, ఉన్నత వర్గాల పిల్లలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీకి వెళుతున్నారు.. ప్రభుత్వ పాఠశాల్లలో ఒకటో తరగతి నుంచి మొదలుపెడుతున్నారు.. దీన్ని మార్చేందుకు మేం ప్రీ స్కూల్స్‌ను ప్రవేశపెడుతున్నాం.. మా దగ్గర 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 18 లక్షలు మంది పిల్లలు ఉన్నారు.. 12 వేల ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 35 లక్షల మంది పిల్లలున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అత్యుత్తమ అర్హతలు ఉన్నవారు.. ఎంఏ, పీహెచ్‌డీ చేసిన వాళ్లు.. అయినా ప్రీ స్కూల్ లేకపోవడంతో పిల్లలు రావడం లేదు. ప్రైవేటు స్కూళ్లకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం ఉంది. మేం కూడా ట్రాన్స్‌పోర్ట్ ఇవ్వడంతోపాటు పిల్లలకు టిఫిన్, మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం.. మా టీచర్లను సింగపూర్‌తోపాటు ఇతర దేశాల అధ్యయనానికి పంపించాను.

అప్పులను పునర్వ్యవస్థీకరిస్తున్నాం

11-11.50 శాతం వడ్డీ రేటుతో స్వల్ప కాలానికి గతంలో అప్పులు తెచ్చారు. మేం ఇప్పుడు వాటిని 7 నుంచి 8 శాతం వడ్డీ రేటుతో పునర్వ్యవస్థీకరిస్తున్నాం.. వాటిని దీర్ఘకాల రుణాలుగా మారుస్తున్నాం. రూ.2 లక్షల కోట్ల అప్పులను పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్నాం.. జీఎస్టీలో ఉన్న లోపాలపై కేంద్ర, రాష్ట్రాలు దృష్టిపెట్టడం లేదు. అరవింద్ సుబ్రహ్మణ్యాన్ని జీఎస్టీ సలహాదారుగా నియమించుకున్నాం. గత 7-8 ఏళ్లలో నెలకు రూ.3,500 కోట్ల మించి జీఎస్టీ రాబడి లేదు.. ఆరు నెలలుగా రూ.4 వేల కోట్లను దాటుతున్నాం.. ఆరు నెలల్లోనే అదనంగా రూ.5 వేల కోట్లు వచ్చింది. పన్నులు పెంచకుండా అవినీతిని, లీకేజీలను అరికట్టడంతో సాధ్యమైంది.
 ప్రతిపక్షంగా పోరాడతాం..
కేంద్ర ప్రభుత్వ వివక్షపై పోరాడతా.. మా దగ్గర పెట్టుబడులకు అనుమతులు ఇచ్చే విషయంలో వాళ్లు గుజరాత్ వెళ్లి పెట్టుబడులు పెట్టమంటున్నారు.. ఇది మేం ఎదుర్కొంటున్నాం..
ప్రశ్నలకు జవాబులు
పెట్టుబడుల సాధన విషయంలో పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక మ్యాచ్ ఆడతాం. భారతీయ సంస్కృతి మతం గురించి అన్నీ నేర్పుతుంది. హైడ్రా మోడల్ అందరికీ అవసరం అని నేను అనుకోను.. ఎం6 మోడల్ అవసరం.. మహా నగరాలైన దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూర్ ఆరు మహా నగరాలు.. ఆయా నగరాల్లో ఆక్రమణలకు సంబంధించి వాటి సొంత మోడల్‌ను అనుసరించాలి.. పర్యావరణం, నీటి కొరత, ఫ్లాష్ ఫ్లడ్స్‌పై సొంత మోడళ్లను అనుసరించాలి.

మహిళా రిజర్వేషన్ల రచయితలం మేమే

ఇందిరాగాంధీ ఉక్కు మహిళ.. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్థాన్‌ను ఓడించారు. పాకిస్థాన్‌ను విడదీసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ నాయకత్వంలోనే ఎన్నో అవకాశాలు వచ్చాయి. రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను చేశారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారు. సోనియా గాంధీ నాయకత్వంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ఆమోదించాం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ గిమ్మిక్కులు చేస్తున్నారు.. పార్లమెంట్ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం.. అలా పార్లమెంట్ సీట్లు పెంచితే కేరళలో లోక్‌సభ సీట్లు 20 నుంచి 30కి పెరిగితే ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి120 సీట్లకు పెరుగుతాయి.. ఇది సరైంది కాదు.. దీన్నే వ్యతిరేకిస్తున్నాం.. పనిచేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కోరుతున్నాం. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ. తీసుకునేది తక్కువ.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి అంతా ఉత్తరాది రాష్ట్రాలవారే.. మేం పన్నులు కట్టి దిల్లీకి సలాం కొట్టాలా? 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయి.. మీకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయండి.. ఉత్తరాది, దక్షిణాది అంతరాలు పెంచొద్దు. అని రేవంత్ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *