కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ గుర్తింపు తెస్తుంది

– మ‌న ప్ర‌తి పంట‌ను పండించాలి
– కందుకూరు టొమాటా కోసం సాస్ ఫ్యాక్ట‌రీ తెస్తాం
– పండ్ల మార్కెట్‌ను అడ్డుకోవ‌డానికి కొంద‌రు దుష్ట‌య‌త్నాలు
– కాలుష్యం నుంచి ర‌క్ష‌ణ‌కే ఫార్మా సిటీ ఏర్పాటు
– కోహెడ్ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

కోహెడ‌, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 6: రంగారెడ్డి జిల్లా రైతులు కష్టపడి హైదరాబాద్ ప్రజలకు పండ్లు, కూరగాయలు, పాలు అందించేవారు. రియల్ ఎస్టేట్ పెరిగి ఇప్పుడు వ్యవసాయం కుంటుపడింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కోహెడ‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించ‌నున్న ఇంటెగ్రేటెడ్‌ ఫ్రూట్ మార్కెట్‌కు శ‌నివారం శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ హైదరాబాద్ లోపల కోటీ ముప్పై లక్షల జనాభా నివసిస్తోంది. అంతర్జాతీయ నగరంగా మారింది. ఇప్పుడు నగర ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాం. గతంలో తాత్కాలికంగా రేకులతో షెడులు వేసి మార్కెట్ నిర్మిస్తే గాలివానకు కూలి అనేక మంది రైతుల కాళ్లు, చేతులు పోయాయి. గాయపడిన రైతులను ఆ రోజు నేను కలిసి పరామర్శించా. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటెగ్రేటెడ్‌ ఫ్రూట్ మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని ఆ నాడే హామీ ఇచ్చా. పాలు, పండ్లు, కూరగాయలు ఏమైనా ఇక్కడికి వస్తే అందరికి అందుబాటులో ఉండేలా 240 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ ను నిర్మించుకుంటున్నాం. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు తర్వాత కోహెడ ఫ్రూట్ మార్కెట్ మనకు మరింత గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాం. కొత్తిమీర లాంటివి కూడా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.  వరి, మొక్క జొన్న, పత్తి, మిర్చి లాంటి పంటలను మాత్రమే మన రైతులు పండిస్తున్నారు.  మన ప్రాంతంలో ప్రతి పండు ను పండించాలి. కందుకూరు ప్రాంతంలో పండించే టమోటా కోసం సాస్ ఫ్యాక్టరీ ని తీసుకువస్తాం. ఫ్రూట్ మార్కెట్ ను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మా పరిశ్రమల వల్ల కాలుష్యం తో స్థానికులకు నష్టం జరుగుతుందని అక్కడ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన 500 కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీకి తీసుకువస్తాం. బీఆర్‌ఎస్ నాయకులు భారత్ ఫ్యూచర్ సిటీ ని రద్దు చేస్తామంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డు, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు,  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వద్దంటున్నారు. తుమ్మిడిహట్టిని నిర్మించ వద్దని అంటున్నారు. అష్టదరిద్రులు ఏ అభివృద్ధి చేస్తామన్నా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.  ఇలాగే వ్యవహారిస్తే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కాదా.. కారు ను తోయడానికి కూడా ఎవరూ దొరకరు. డిసెంబర్ నుంచే ఫ్రూట్ మార్కెట్ లో కార్యకలాపాలు ప్రారంభం కావాలి. రెండేళ్లలో ఫ్రూట్ మార్కెట్. నిర్మాణం పూర్తి కావాలి. ఫ్రూట్ మార్కెట్ కోసం నిధులను గ్రీన్ ఛానల్ లో ఇస్తాం. కేసీఆర్ కుర్చీ వేసుకుని పాలమూరు రంగారెడ్డి కడతానని అన్నారు..కాని మందు వేసుకుని ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం తుమ్మల, శ్రీధర్ బాబు ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చోవాలి. కోట్లాది రూపాయల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవు. ప్రతి యేడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఇంత ఆదాయం ఇచ్చే వాళ్ల కోసం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.  అవుటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను 12 క్లస్టర్లు గా విభజించి ఇంట్రిగ్రేటేడ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తున్నాం. కాళ్లలో కట్టె పెట్టినా, శాపనార్థాలు పెట్టినా, పెడబొబ్బలు పెట్టినా, మూసిలో పడి దొర్లినా అభివృద్ధి చేసుకునేదే. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం, ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తాం,రీజనల్ రింగ్ నిర్మిస్తాం. కడుపులో మంట ఉన్నవాళ్లకు అజీర్తి ఉంటూనే ఉంటుంది. వ్యవసాయాన్ని దండుగ అంటే పండుగ చేశాం. వరి వేసుకుంటే ఉరే అంటే ఇప్పుడు వరికి రూ.500 బోనస్ ఇస్తున్నాం. లక్షా నలభై వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేశాం. ఏ ఊళ్లో వడ్లు పండినా కాళేశ్వరం నీళ్లు చెప్పుకుంటు తిరిగేవాడు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకుండానే రికార్డు స్థాయిలో వరి పండించాం. కాళేశ్వరం కూలేశ్వరం అయి లక్ష కోట్లు గోదావరి లో కొట్టుకుపోయాయి. అదే గోదావరి లో వాళ్లకు త‌ద్దినం పెట్టాలా లేదా? గునీటి ప్రాజెక్టుల పైన హరీష్ రావు మాకు సలహాలు ఇస్తున్నాడు. మీ సలహాలు తీసుకుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయింది. హరీష్ రావు.. నువ్వు దిక్కుమాలిన సలహాలు మీ మామకు ఇస్తే నడుం ఇరిగి ఫామ్ హౌజ్లో పడ్డాడు. 2024 నుంచి 2034 వరకు ప్రజా పాలన ఉంటుంది. అభివృద్ధి చేయడమే కాదు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. త్వరలోనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. అసూయ, పగ,ద్వేషం మాపైన చూపించాలి. తెలంగాణ ప్రజలపై 8 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికి విశ్వాసంతో రోజుకు 18 గంటలు కష్టపడి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న. నిలబడి కొట్లాడి సమస్యలను పరిష్కారం చేసుకుంటున్నాం.కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అల్లాటప్పగా రాలేదు కిషన్ రెడ్డి నేను.. తొక్కుకుంటు అధికారంలోకి వచ్చా. 15వ తేదీ తర్వాత 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్న తర్వాత కేంద్రం సంగతి చూస్తా.. కేంద్రంలో ప్రభుత్వం ఉందని భయపెట్టాలని చూస్తే భయపడమ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *