– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : భావితరాల భవిష్యత్తును, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పచ్చదనాన్ని(గ్రీనరీ డెవలప్‌మెంట్) తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రస్తుతం జనాభా పెరుగుదల, కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల పచ్చదనం క్రమంగా తగ్గిపోతోందని, పెరుగుతున్న ప్రజల అవసరాలను తీర్చేందుకు, మౌలిక వసతుల కల్పన కోసం కొన్ని ప్రాంతాల్లో పచ్చదనం దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి ‘ఏక్ పేడ్ మా కే నామ’ (అమ్మ పేరిట ఒక మొక్క) అనే గొప్ప పిలుపునిచ్చారంటూ దీని ప్రకారం ప్రతి ఒక్కరూ తమ కన్నతల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని సూచించారు. శుక్రవారం జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుండి ప్రారంభమైన ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. గ్రామ పంచాయతీల్లోని యువత, వార్డు మెంబర్ల నుండి మొదలుకుని దేశ రాష్ట్రపతి వరకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు ఇలా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, అడవులు లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ అందుబాటులో ఉన్న ప్రతి చోటా మొక్కలు నాటాలన్నారు. ఈ ఏడాది చివరి వారంలో ఈ ప్రతిష్టాత్మక ఎయిమ్స్ హాస్పిటల్‌ను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయాలనే ఆలోచనతో ఉన్నామన్నారు. ఈ హాస్పిటల్ పనులు జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ కూడా పచ్చదనాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఒక మొక్కను నాటడానికి ఈరోజు తాను ఇక్కడికి వచ్చినట్లు కిషన్‌రెడ్డి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





