– కమిటీ చైర్మన్ కేశవరావు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: తెలంగాణ ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆ గుర్తింపు కమిటీ చైర్మన్ కె.కేశవరావు వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ 16 రోజులు వివిధ సంఘాలతో చర్చించామని వివరించారు. ఉద్యమకారులను ఎలా ఎంపిక చేయాలి? ఎలా గౌరవించాలి అనే దానిపై అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయని తెలిపారు. సంఘాల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తామని స్పష్టం చేశారు. ఈ చర్చలకు 13 వేల మంది హాజరయ్యారని, దాదాపు వెయ్యి మంది సూచనలు చేశారని చెప్పారు. అయితే ఈ సమావేశాలు ముగియలేదన్నారు. వీటిపై ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు కూడా తీసుకుంటామని తెలిపారు. అందుకు సంబంధించిన తేదీలు ప్రకటించి ఉద్యమకారులు, సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కేలా ఈ కమిటీ పనిచేస్తుందని కేశవరావు వివరించారు. త్వరలో వివిధ జిల్లాల్లో పర్యటించి.. ఉద్యమకారులు, సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను గౌరవిస్తామని తెలిపారు. ఆయనను కూడా ఈ చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌లోపే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ దయాకర్ వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు