– యూనిఫాంల నాణ్యతపై రాజీ పడేది లేదు
– పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
– త్వరగా సరఫరా చేసేలా సంస్థలపై ఒత్తిడి పెంచాలి
– యూనిఫాం సరఫరాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు ఇతర అంశాలపై ప్రతీ విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ (ఫీడ్ బ్యాక్) తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. దాని ఆధారంగా వచ్చే ఏడాది పంపిణీ, వాటి రంగులు ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులకు యూనిఫాంల అందజేతపై ఎంసీఆర్హెచఆర్డీలో గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు అందజేసే యూనిఫాంల నాణ్యతలో రాజీపడమని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి పిల్లలందరికీ యూనిఫాం అందజేయాల్సినదేనని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించనని హెచ్చరించారు. మహిళా సంఘాలు కుట్టు పని వేగవంతం చేసేలా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్యకు సీఎం సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫాంల అందజేతలో అడ్డగోలుగా వ్యవహరించారని సీఎం అన్నారు. తాము వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, నాణ్యమైన యూనిఫాంలు అందిస్తామని తెలిపారు. పేద పిల్లల కోసం పని చేస్తున్నామనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వచ్చే సంవత్సరం జూన్ 2నాటికే విద్యార్థులకు యూనిఫాం అందేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారులు బాల మాయాదేవి, షఫీ ఉల్లా, విజయేంద్ర బోయి, దివ్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





