ప్ర‌భుత్వానివి త‌ప్పుడు లెక్క‌లు

– రైతులను మోసం చేస్తున్న రేవంత్ స‌ర్కార్‌
– బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తూ రైతులను ఘోరంగా మోసం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ చేపట్టిన రైతు గోస – బీజేపీ భరోసా యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌తోపాటు వడపర్తి ఐకేపీ కేంద్రాన్ని బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల వద్దే పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలేటి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 80 శాతం పంట కొనుగోలు పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఆయన చెబుతున్నవన్నీ అబద్ధపు మాటలు, తప్పుడు లెక్కలని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తాను చూపే కొనుగోలు కేంద్రాలకు రావాలని, నెల రోజులుగా రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూడాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వరితో పాటు జొన్నలు, పొద్దుతిరుగుడు పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, శనగల కొనుగోలు ప్రక్రియ అసలు ప్రారంభమే కాలేదని ఆయన ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఐకేపీ సెంటర్లు, ఏఎంసీ మార్కెట్లలో రైతులు నెల రోజులుగా ధాన్యం కుప్పల వద్దే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గంపలు, సంచులు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందని, మరో నాలుగు రోజుల్లో రుతుపవనాలు ప్రారంభం కానున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము వస్తున్నామనే భయంతోనే అప్పటికప్పుడు లారీలను పంపుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్న గజ్వేల్‌కు బీజేపీ బృందం వెళ్లడంతో కలెక్టర్ వచ్చి 30 లారీలు ఏర్పాటు చేశారని, ఇవాళ భువనగిరికి వస్తున్నామని తెలియగానే ఇప్పుడిప్పుడే లారీలు వస్తున్నాయని చెప్పారు. తమ రాకతోనే లారీలు వస్తాయంటే ప్రతి గ్రామాన్ని సందర్శించడానికి, రైతుల పక్షాన నిలబడడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఏలేటి అన్నారు. ఈ యాత్రలో ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, రామారావు పటేల్, వెంకట రమణా రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *