– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 14 : తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి టెండర్ విధానంలో కాకుండా నామినేషన్ విధానంలో కేటాయించడం చరిత్రాత్మక నిర్ణయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ కేటాయింపుతో సింగరేణికి దీర్ఘకాలంలో భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రూ.వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. భూపాలపల్లిలో రెండోరోజు సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో ఇంక్లైన్ గేట్ మీటింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ సింగరేణికి ఇంత పెద్ద కోల్ బ్లాక్‌ను తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం కేటాయించడం సింగరేణి కార్మికుల విజయంగా భావించాలని, కార్మికుల సంక్షేమం, వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయంగా దీనిని గుర్తుంచుకోవాలని అన్నారు. గతంలోనే సింగరేణి ప్రాంతంలో పర్యటించి సంస్థ పరిస్థితులు, కార్మిక సంఘాల పరిస్థితిని పరిశీలించానని, ప్రస్తుతం సింగరేణి ప్రాధాన్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగిందని చెప్పారు. తాడిచర్ల కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించే ప్రక్రియలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఆయన సింగరేణి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, కార్మికుల సమస్యలను తెలుసుకుని వారి ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేశారుని గుర్తు చేశారు. బీజేపీ ఎప్పుడూ సింగరేణిని నిర్లక్ష్యం చేయలేదని, సింగరేణి లాభాల బాటలో పయనిస్తూ, సంస్థ అభివృద్ధి చెందాలని, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ జరగాలని కృషి చేసిందని చెప్పారు. తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో తాడిచర్ల కోల్ బ్లాక్‌ను నామినేషన్ విధానంలో సింగరేణికి కేటాయించారని తెలిపారు. ఇది సింగరేణి పరిరక్షణకు, సంస్థ భవిష్యత్తుకు ఎంతో కీలకమైన నిర్ణయమన్నారు. ఈ అంశంపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఈ కేటాయింపు జరగనప్పటికీ ఇప్పుడు తామే సాధించామని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. మరి అప్పుడే ప్రయత్నాలు జరిగితే ఇప్పటివరకు ఎందుకు కేటాయించలేకపోయినట్లు అని ప్రశ్నించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సింగరేణికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, కిషన్ రెడ్డి నిరంతర కృషి, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం ఫలితంగానే తాడిచర్ల, నైని కోల్ బ్లాక్‌లు సింగరేణికి లభించాయని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




