– బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశంపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ఆగస్టు 4, 5 తేదీల్లో నిర్వహించనున్న ఈ సమావేశానికి ఏర్పాట్లను సంజయ్ జాజు సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు భారత ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశానికి బ్రిక్స్‌లోని 11 సభ్య దేశాల నుంచి సుమారు 40మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. అదనంగా, భారత ప్రభుత్వానికి చెందిన సుమారు 40మంది సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో చర్చల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీవోపీటీ) సంయుక్త కార్యదర్శి సుశీల్ కుమార్ పటేల్ సమావేశ నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశం సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాన్ని వివరిస్తూ భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, వైద్య, అత్యవసర వైద్య సేవలు, రవాణా, ప్రొటోకాల్, వసతి, సమావేశ వేదిక నిర్వహణతోపాటు ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లలో సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందజేస్తామని సీఎస్ సంజయ్ జాజు హామీ ఇచ్చారు. సమావేశంలో యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, జీఏడీ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఏడీజీపీ(శాంతిభద్రతలు) మహేష్ భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, ప్రొటోకాల్ డైరెక్టర్ శివ లింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





