నా”బూతే” నా భవిష్యత్!?

“కోటి దేవుళ్ళ బొమ్మలతో కోటి ఫేక్  అకౌంట్స్ తెరిచేశారు.తద్వారా ప్రత్యార్థులపై సహనం లోపించిన సమయంలో పచ్చి బూతులు ప్రయోగించిన ట్రోలింగ్లకు పాల్పడడం, తద్వారా బూతులే  సోషల్ మీడియా అధికార భాషగా చెలామణిలోకి తెచ్చారు.తద్వారా దేశమంతా సోషల్ మీడియా ఆ అనుకరణ తోనే ఇవాళ బూతుల భాష స్థిరీకరణ ఖ్యాతిని సోషల్ మీడియా మూట గట్టుకొని పతనం అంచులకు చేరింది..”

ఎన్.తిర్మల్  సీనియర్ జర్నలిస్టు ,రచయిత ,సామాజిక కార్యకర్త సెల్:9441864514, ఇమెయిల్: thirmal.1960@gmail.com

 ‘ నభూతో న భవిష్యత్ ,అనబడే ఓమంచి వాక్యం నా”బూతే”నా భవిష్యత్!గా మారింది.ఇప్పుడు ఈమాట తెలుగు రాష్ట్రలలో ఓ వ్యూహాత్మక రాజకీయ కళగా మారింది.బూతులు అంతరంగిక ఓ మార్మిక కళ! ఎవరికి వారి అంతరంగాంతం వరకు పర్వాలేదు.బహిరంగమైతేనే సభ్యత,సంస్కారం అనే రెండు పదాలు అడ్డువస్తాయి.గతంలో రాజకీయాల్లో నిర్మాణాత్మక విమర్శలకు చప్పట్లుమోగేవి.ఇప్పుడు అలాలేదు.నిర్మాణంలేదు,దానికి ఆత్మాలేదు.బూతులు మాట్లాడితేనే పోలింగ్ బూత్లలో వోట్ల డబ్బాలు నిండుతున్నాయి.బహిరంగ సభల్లో చప్పట్లు మోగుతున్నాయి.అందుకే రాజకీయ నేతలు నా”బూతే”నా భవిష్యత్తు అంటూ బూతుల్లోనే తమ గొంతులు సవరించుకుంటున్నారు.ఇదొక రాజకీయ మార్మిక అరవై అయిదో లలిత కళగా మారింది.

నేత మాట్లాడితే చప్పట్లు మోగాలి.అవతలివాడి దుప్పట్లు తడవాలి. ఈ చప్పట్ల కోసం రాజకీయ నాయకులు అడ్డదిడ్డంగా నాలికమడతేసి మాట్లాడుతున్నారు.గతంలో విధానపరమైన విషయాలపై విమర్శలు తప్ప వ్యక్తిగతమైన విమర్శలు ఉండేదికాదు..ఉండవని కాదు,కానీ చాలా తక్కువ స్థాయిలో ఉండేవి.ఏదైనా పదం ఆవేశంలోనో, అనాలోచితంగానో దొర్లిన సందర్భంలో నాలిక కరుచుకొని సంబోధిత  తప్పుకు క్షమాపణ  సైతం కోరేవారు.అసెంబ్లీ, పార్లమెంటు మాదిరిగానే అనుచిత పదాలు దొర్లినప్పుడు అన్ పార్లమెంటరీ భాషగా  నిర్ధారించే వారు.అంటే మన రాజ్యాంగం కూడా మాట్లాడే భాష పరిధులు  దాటకూడదనే నిబంధన విధించిందని అర్థం.మంత్రులైనా,సభ్యులైనా సభ్యత తక్కువ పదాలు వాడినప్పుడు పదాలు చట్టసభల రికార్డుల నుండి ఉపసంహరించుకోవడం,లేదా తొలగించడం మన సభా సాంప్రదాయంగా వస్తుంది.అంతవరకు పర్వాలేదు.కాని బహిరంగ సభల వరకు వచ్చేసరికే రాజకీయ నేతలు భాష  మారుతుంది.తిట్లూ,శాపనార్థాలు స్థాయి దాటి వాగ్ధాటి బూతుల పంచాంగాలు యదేచ్చగా విప్పుతున్నారు.అదే పదునైన విమర్శలకు రాజకీయ భాషా  పర్యాయపదంగా భావిస్తుంది.పరిధులు  దాటి మాట్లాడిన భాష  పర్యాయం ఎలా అవుతుంది? ఎందుకిలా రాజకీయ పామరులు భాషా  బూతుల మయం అయ్యింది? ఇత్యాది ప్రశ్నలు ఇవాళ కొందరికి తప్ప అందరికీ,ముఖ్యంగా మద్దతుదారులు కర్ణోపేతంగానే ఉంటుంది.

ఒక్కసారి తెలుగు రాష్ట్ర రాజకీయ మూలాల్లో కెళితే! వాస్తవానికి భాషా,శైలి అనేది సామాజిక మూలాలను నుండే ఉద్భవించింది.ఒకప్పుడు చదువుకునే అవకాశం ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు గ్రాంథిక భాష నే మాట్లాడే వారు.అదే పాలనా భాషగా సైతం స్థిరీకరించ బడింది.చాతుర్వర్ణ వ్యవస్థ లో వృత్తి దారులుగా జీవించిన శూద్రులు మాతృభాషను వ్యావహారికంలో శిష్ఠ వాడుక భాషను వినియోగించేవారు.దానికి పరిధి, పరిమితి లేదు .లిపి లేదు కనుక పరిమితి లేదు.కనుక అలా వాడుకభాషలో కొన్ని మార్మిక పదాలుదొర్లేవి.అవి జీవన విధానం లో అంతర్భాగమైన,కష్టాలనుండి ఉద్భవించిన పదాలే భాష  నైనప్పటికీ.వాటినే అగ్రవర్ణాలు బూతులుగా నిర్థారించి స్థిరీకరించారు.విద్యావ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇక భాష అనేది నిర్దిష్ట స్థిరీకరణ జరిగింది.దీనితో గ్రాంధికం తోపాటు, అభ్యంతరం లేని వ్యావహారిక భాష కూడా ముందుకు వచ్చింది.

ఇక రాజకీయాల లోకొస్తే తెలంగాణ మలిదశ ఉద్యమం సమయం లో రాజకీయాల్లో ఈ భాషయాసపై చర్చ జరిగింది.1970 దశకంలో జలగం వెంగళరావు లాంటి ముఖ్యమంత్రి “కమ్యూనిస్టు లకు వోటేస్తే కుడితితొట్లో వేసినట్లే!”లాంటి తీవ్ర విమర్శలు చేసేవారు.అప్పటికదే పరుష లేదా కటువైన పదజాలం.కానీ,“1980 దశకంలో ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య ఉండగా ఆయన అచ్చ తెలంగాణా యాసలో మాట్లాడేవారు.దాన్ని ఆనాటి ఆంధ్ర మూలాలనుండి పుట్టిన దినపత్రికలు రోజుకో హెడ్డింగ్ తో ఆయన భాషను ,యాసను అపహాస్యం చేశారు.”గోదారి బేసిన్ లో’ తేలు ‘పడింది”లాంటి హెడ్డింగ్ లతో భాషాపరమైన వివక్షకు తెరలేపారు.తెలంగాణా భాషా ,యాసను అలా చులకన భావం తో చూడడం మోదలైంది.అక్కడ నుండి తెలుగు సినిమాలో తెలంగాణా భాషను,యాసను హాస్యానికి వాడుకొని అపహాస్యం చేశారు.వీటన్నింటి సాంస్కృతిక మూలాల్లోకి తెలంగాణా ఉద్యమం వెళ్ళింది.ఆ సమయంలోనే తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ కూడా ఉద్యమంతో పాటు, ప్రజల్లో మమేకత,ప్రత్యేకత కోసం తెలంగాణా భాష ,యాస బహిరంగ వేదికలపై మాట్లాడారు.తమ భాషా  పరిభాష ను ఆయన ఉద్యమ నేపథ్యం నుండి సవరించుకున్నాడు.సోయి”సన్నాసులు”,”దరిద్రులు”లాంటిపరుష పదాలు ఎక్కువగా వినియోగించారు.ఆయన ఒకటి రెండు సార్లు తెలంగాణా సామెతలు,పదాలు గట్టిగా వాడినప్పుడు విమర్శలు వెల్లువెత్తేవి.ఇదే ప్రాంతీయ భేదాలను,వివక్షతలను బహిర్గతం చేసేందుకు తెలివిగా ఉద్దేశ్య పూర్వకంగానే మాట్లాడే వారు.

ఇదే సమయంలో 2014లో జరిగిన రెండు రాజకీయ పరిణామాలు ఈ సందర్భంగా మనం గమనంలో కి తీసుకోవాలి.1) కేంద్రం లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు 2) తెలుగు రాష్ట్ర ల విభజన.మెదటి పరిణామం మూలంగా బిజెపి పార్టీ కేంద్రంలో స్థిరపడడానికి ముందుగా మీడియా ను వ్యూహాత్మకంగా తమవైపు తిప్పుకుంది.దానితో అలాంటి మీడియా జీర్ణం కాని జర్నలిస్టులు సోషల్ మీడియా పెట్టుకున్నారు.ఇక బీజేపీ మరో అడుగు ముందుకు వేసి రాజకీయ భావజాలం తో పాటు, హిందూ ఇజం వ్యాప్తి కొరకు అందుబాటులోకి వచ్చిన వాట్సాప్, ఫేస్బుక్ సాంకేతికత అందిపుచ్చుకొని పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా సెల్ లను ఏర్పాటు చేసింది.కోటి దేవుళ్ళ బొమ్మలతో కోటి ఫేక్  అకౌంట్స్ తెరిచేశారు.తద్వారా ప్రత్యార్థులపై సహనం లోపించిన సమయంలో పచ్చి బూతులు ప్రయోగించిన ట్రోలింగ్లకు పాల్పడడం, తద్వారా బూతులే  సోషల్ మీడియా అధికార భాషగా చెలామణిలోకి తెచ్చారు.తద్వారా దేశమంతా సోషల్ మీడియా ఆ అనుకరణ తోనే ఇవాళ బూతుల భాష స్థిరీకరణ ఖ్యాతిని సోషల్ మీడియా మూట గట్టుకొని పతనం అంచులకు చేరింది.

తెలంగాణా ఏర్పాటు తర్వాత పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ పాత్రికేయుల సమావేశాలు, బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో కాస్తా తెలంగాణా భాషా ,యాస స్వరం పెంచి, కొన్ని సందర్భాల్లో విమర్శ స్థాయి దాటి కూడా మాట్లాడారు.దానితో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి అదే శైలిని ఎంచుకొని దూకుడు పెంచారు.అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భాష మారకపోగా మరింత లోతుగా “నరుకుతా,కొరుకతా” అనే వరకు శైలి తీసుకెళ్ళారు.ఇక ప్రతిపక్ష నాయకుడు కావాలంటే అదే భాష  బాగుంటుంది అనుకున్నారో !ఏమో?కానీ, కేటీఆర్ సైతం పరిధులు  దాటి పరుష పదాల,మాటలు ప్రయోగం చేస్తున్నారు.అదే బాటలో వారివారి అనుచరగణం ఉదయం లేస్తూనే రాత్రి వరకు సభలు,సోషల్ మీడియా లో అదే బూతు పురాణాలు వినిపిస్తున్నారు.ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాజీముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈరకమైన విమర్శలు చేసినా,విపక్షనేత గా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మాట్లాడినా అది సరైన విధానం కానేకాదు. ఎందుకంటే వారిప్పుడు వ్యక్తి గత ప్రాధాన్యత దాటి అధికార హోదాలు,ప్రజల అంగీకారం కలిగిన వారిగా గుర్తించాల్సి ఉంది.వ్యక్తులుగా కాకపోయినా హోదాకైనా గౌరవమర్యాదలు ఇవ్వడం అవసరం. ఇది తెలంగాణా ప్రజల మర్యాద కూడా!కనుక రాజకీయ నేతలు పద్దతులు మార్చుకోవాల్సి ఉంది.

ఉద్దర తెచ్చుకున్న పరుష పదజాలంతో వ్యక్తిత్వాలు ఎన్నడూ నిలబడవు.సహనం కోల్పాయిన వారు మాత్రమే పదాలు సరిహద్దులు దాటడం అనేది తెలంగాణా రాష్ట్రం లోఉన్న ఒక అలవాటు.కనుక రాజకీయ నాయకులు ఎవరైనా ఇకనైనా మాటలకు సరిహద్దు రేఖలు గీచుకోవడం అవసరం. ఉపన్యాసాలకు పరిమితం గా నైనా కంచెలు అవసరమే!నాలికల నరాలు కాస్తా అదుపులో ఉంచుకోవడం అవసరం.ఇప్పటికైనా,ఎప్పటికైనా ఏవ్యక్తి కైనా,నేతకైనా అదే అనుసరణీయం,ఔదార్యం!ఆభరణం!! భూషణం…!!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *