చాగంటి తులసి కథా విశ్లేషణ – 1

“యాష్ ట్రే వంటి మంచి కథలు రాసిన రచయిత, అనువాదం, విమర్శ, నాటకం, పరిశోధన రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్య ఉద్యమశీలి- చాగంటి తులసి తొంభయ్యవ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా తిరునగరి దేవకీదేవి రాసిన విమర్శనాత్మక వ్యాసాన్ని నాలుగు వారాల పాటు శోభ పాఠకుల కోసం ప్రచురిస్తున్నాము.”

– శోభ టీమ్  

చాగంటి తులసి చాగంటి సోమయాజులు కూతురు. ఒరిస్సా ప్రభుత్వ విద్యాశాఖలో రీడర్ గా దక్షిణ కొరియా సియోల్లోని కుంకుక్ యూనివర్సిటీలో గెస్ట్ ప్రొఫెసర్ గా పని చేసారు. ఈమె కథకురాలే కాదు అనువాదకురాలు కూడా. 1937 లో పుట్టిన ఈమె తొమ్మిదో ఏటనే రచనా వ్యాసంగాన్ని బాలల పత్రికలో ప్రారంభించారు. తులసి కథలు (కథా సంపుటి), యాత్ర (నవలిక), సాహితీ తులసి (వ్యాస సంపుటి), తగవు (నాటిక) తులసి స్వంత రచనలు. అనువాదాల విషయానికొస్తే హిందీలో రాహుల్ సాంకృత్యాయన్ ‘‘ఓల్గా నుంచి గంగవరకు‘‘ సప్దర్ అస్మి ‘‘హల్లా బోల్”లతో పాటు అంబేద్కర్ జీవితచరిత్రను అనువదించారు. ఒరియాలో సచ్చిరౌత్యాయ్ గోపీనాథ్ మహంతి,  బ్రతుకు తెరువు కథలను ఇంగ్లీష్ లో సరళాదాస్ ‘‘కాజీ నస్రూల్ ఇస్లాం మొనాగ్రాఫ్” (కేంద్ర సాహిత్య అకాడమీ కోసం) తెలుగునుంచి హిందీకి ఆరుద్ర ‘‘రాముడికి సీత ఏమవుతుంది”ని  ‘‘సీత రామ్ కి క్యా లగ్తీ హై” గా అనువదించారు. ఆమె పిహెచ్ డి సిద్ధాంత గ్రంథం ‘‘మహాదేవికి కవిత్ మే సౌందర్య భావన్”.

తులసి కథల కథాసంపుటి విషయానికి వస్తే ఇందులో 14 కథలు ఉన్నాయి.  మొదటికథ వలయం మధ్యతరగతి కుటుంబాల సమస్యలతో పాటు విద్యావిధానాన్ని కూడా దృష్టికి తెచ్చింది. వలయం కథలో కుటుంబసభ్యులు మొత్తంగా 10మంది. దంపతులిద్దరు, వాళ్ళతల్లి, వాళ్ళపిల్లలు ఏడుగురు. సంప్రదాయం ప్రకారం వయసు రాగానే కొడుకు పెళ్ళి చేయాలనుకున్నారే తప్ప జీవితంలో స్థిరపడలేదనే విషయాన్ని పట్టించుకోనేలేదు. యజమాని బొటాబొటి జీతం, కొడుకు కోడలు రిసెర్చ్ స్కాలర్షిప్ లో వచ్చే సగండబ్బుతో కుటుంబం జరుగుబాటులో పాటు, బియస్సీ చదువుతున్న మరిది కాలేజీ ఫీజు, టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మలు, ఉషాల చదువుల భారం, స్కూల్ మెయింటెనెన్స్ లో బట్టాబాతల ఖర్చు, నిరుద్యోగైన మరిది, ఉష మెట్రిక్ లేషన్ పాసైనా ఇటు పెళ్ళిచేయక అటు కాలేజీకి పంపించలేని దుస్థితి ఆ కుటుంబానికి. ఇంతమంది పిల్లల్ని కన్న తల్లిదండ్రుల అందరిదీ ఇదేసమస్య. వాళ్లదృష్టి ఎప్పుడూ పెద్దవాడైన కొడుకు మీదనే. ఈ కథలో కోడలు మీద కూడా. ఇట్లా అధికసంతానం ఉన్న తల్లిదండ్రుల కుటుంబాలు బాధపడి నైరాశ్యంలోకి పోయి చితికిపోయిన సందర్భాలు చాలానే ఉన్నై.

మరిది చిట్టీ కాలేజీలో లెక్చరర్లు సరిగా చెప్పడం లేదని ట్యూషన్ పోవాలని ఆరాటపడటంలో ప్రైవెటేజేషన్ పుంజుకొని పోతున్న కథాకాలమది,  ప్రైవేట్ కాలేజీలో పంతుళ్ళు ఇండ్లలో బాచీలు బాచీలుగా ట్యూషన్లు చెప్పుతూ పోర్షన్లు పూర్తిచేస్తూ తాము పనిచేస్తున్న కాలేజీలను నిర్లక్ష్యం చేయడం కనపడుతుంది. దాంతో ఇష్టం లేకపోయినా ట్యూషన్ చదువుకోవాలనే అనివార్య పరిస్థితి విద్యార్థులది. కానీ చిట్టికి ట్యూషన్ చెప్పించుకునే ఆర్థికస్థోమత లేదు, అందుకే వదినను పాఠాలు అర్థంచేయించమని బతిమాలుకుంటాడు. పెళ్ళైన పెద్దకొడుకు రాజు ఆయన భార్య నాలుగేండ్లుగా పరిశోధన చేస్తున్నా మార్గదర్శకులైన ప్రొఫెసర్లు సహకరించపోవడం వంటి విషయంతో పాటు ఆ మార్గదర్శకులు తమ పత్రసమర్ప ణలు, ఇంక్రిమెంట్సు, లావాదేవీలు, ఆర్థిక ఎదుగల చూసుకోవడాన్ని రచయిత్రి ప్రస్తావించిన్రు. యూనివర్సిటీలలో వీళ్ళ బాధితులైన స్కాలర్స్ ను అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. ప్రొఫెసర్లు తమ భావాలకు అనుగుణంగా లేని స్కాలర్స్ ను ముందుకు సాగనివ్వకపోవడం రాజు విషయంలో కనపడుతుంది. ఎందుకంటే రాజు అభ్యుదయభావాలు కలిగి ముక్కుసూటిగా మాట్లాడేమనిషి.

రచయిత్రి బ్రాహ్మణ కుటుంబానికి చెందినది. ఈమె అంబేడ్కర్ జీవితచరిత్రను అనువదించినప్పటికీ అంతరాంతరాలలో రిజర్వేషన్ వల్ల బ్రాహ్మణులు నష్టపోతున్నారనే భావన ఉందేమో లేదా బ్రాహ్మణులకు ఆ ఆలోచన ఉండే అవకాశం ఉంటుందని చెప్పదలచుకొని ఉండొచ్చు. ఆ భావనలో  ‘‘కనీసం నేను బ్రాహ్మణపిల్లను కాకుండా ఉన్నా ఈపాటికి రీసెర్చ్ పూర్తి అయిపోయేది” అని ఆ యింటికోడలితో అనిపిస్తుంది రచయిత్రి. ఒకవైపు సమస్యలతో సతమతమవుతున్న కుటుంబం, రాజకీయ సామాజిక పరిస్థితులు, విద్యావిధానాన్ని గమనిస్తున్న యువత మార్పును ఆశిస్తూ ఆలోచించడం మరోమరిది కృష్ణుడు పాత్రద్వారా చూపించింది. చివరిగా చెప్పొచ్చే విషయం తనకు భర్తకు ఇబ్బంది ఔతున్నా అత్తవారింట్లో సమస్యలు ఆమెను తలమునకలు చేయడం, పరిష్కారం చేయలేని నిస్సహాయతను ఓ కోడలు ద్వారా ఉత్తమపురుషగా చెప్పించడం ఈ కథ ప్రత్యేకత.

చిన్నదేవేరి కథ కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందినదే. ఈ కథలో కుటుంబాలలో ఆడపిల్లల పట్ల ఉండే వివక్ష స్పష్టం. కథానాయకి చిన్నదేవేరి మెట్రిక్యులేషన్లో ఊరంతటిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినా ఉన్నతచదువులకు పంపించకుండా ఇంట్లో కూర్చోబెట్టారు తల్లిదండ్రులు. మాఘమాసాలు ఎన్నో గడిచిపోయాయి. ఐనా ఆమెపెళ్ళి జరుగలేదు అని రచయిత్రి చెప్పడంలో ఆర్థికపరిస్థితులు సహకరించకపోవడం ఒక కారణమైనా కుటుంబ పెద్దల ఉదాసీనత లేకపోలేదు. ప్రకృతిలో స్త్రీపురుష సంబంధం చాలా సహజమైంది. ఈడొచ్చిన పిల్లను పక్కనపెట్టి అన్నపెళ్ళి చేస్తే ఆ స్త్రీకి కలిగే భావోద్వేగాలను కుటుంబపెద్దలు ఆలోచించనేలేదు. పట్టించుకోలేదు కూడా. పైగా వాళ్ళ గంపెడు బలగం కుటుంబానికి భారమే. ఇంట్లో ఊరికే కూచుంటే ఏంలాభమనే హేతుబధ్ధత మాత్రం పనిచేసి టైపు షార్ట్ హ్యాండ్ నేర్పించి ఉద్యోగానికి పంపించిన్రు. నెలనెలా సంపాదన తెస్తున్న ఆమెకు తగిన ఏ వరుడో దొరికే అవకాశం లేకపోలేదు. ఆ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. సంప్రదాయరీత్యా ఆడపిల్ల సంపాదన తింటున్నాం అన్న ధ్యాసా లేనేలేదు. తమ కుటుంబానికి అనుకూలంగా ఆమె జీవితాన్ని మలిచే ప్రయత్నం చేసిన్రు. ఆమెలో సంసారిక భావాలు రాకుండా ఉండటానికి కాలక్షేపంకన్నట్లు భజనకు పంపించడం ఒక ఎత్తుగడే.

ఆధ్యాత్మికం ముసుగులో ఎన్నెన్నో అపసవ్య కార్యక్రమాలు మనం రోజువారి వింటున్నవే. ఈ కథలో మాత్రం చిన్నదేవేరి తనలా శ్రావ్యంగా పాడగల్గిన ఎనిమిదిమంది పిల్లలు గల వ్యక్తితో సాన్ని హిత్యం ఏర్పడి ఏకంగా పెళ్లికి సిధ్ధమైంది. ఇది కుటుంబానికి అభ్యంతరమైంది. ఆ అభ్యంతరమల్లా ఎనిమిదిమంది పిల్లల తండ్రిని చేసుకోవడం, అందులో సుఖముండదని, ఆమె సంపాదనంతా ఆ కుటుంబానికి ధారపోయాల్సి వస్తుందని, సవతిగా పోవడం మంచిదికాదని, మరో స్త్రీని ఇబ్బంది పెట్టడమని పైకి చెప్పే, విమర్శించే కారణాలు ఇవే ఐనా అసలు బాధల్లా సంపాదన తమకు కాకుండా పోతుందనే. ఏదో అఘాయిత్యం జరిగిపోయినట్లు పైకి అఘోరిస్తున్నా ఆమె సంపాదన, చాకిరీ సౌకర్యం పోయిందనేది అసలు బాధ అనే విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేస్తుంది. ఆ విషయాన్నే ఆమె విడమరిచి మొదటి భార్యకు సమస్యగా సవతిగా పోవడంవల్ల మరో ఆడది కష్టాలపాలౌతుందని చెప్పడాన్ని నిలదీస్తూ పరాయి ఆడదాని మీద ఉన్న దయాదాక్షిణ్యాలు మీ చెల్లెలునైన నా మీద ఎందుకు లేకపోయిందని ప్రశ్నిస్తుంది, రెండోపెళ్లి వలన జీతాన్నంతా వాళ్ళకు ధారపోయడమేకాక ఊడిగం చేయాల్సి వస్తుందనే వాదనను ముందుకు తెస్తూ మీరు నా సంపాదన తేరగా తినగలిగినప్పు డు వాళ్ళు తింటే ఏంటంట అని నిలదీసింది. ఆమె మొదటిభార్య పట్టమహిషని, తాను చిన్న దేవేరిని అనడంలో కాబోయే సవతికి ఈమెకు సయోధ్య కుదిరి రెండోభార్యగా అంగీకరించినట్లు కనపడుతుంది. ఆలోచిస్తే ఉద్యోగం చేసే భార్య సవతిగా రావడం వల్ల ఎనిమిది పిల్లల పోషణ గట్టెక్కగలదని మొదటిభార్య ఆలోచించి ఉండవచ్చు.

(ఇంకా ఉంది) 

-తిరునగరి దేవకీదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *