‘ఒక పేద కుటుంబానికి రేషన్ బియ్యం, వృద్ధుడికి పెన్షన్, రైతుకు పంట రుణమాఫీ, విద్యార్థికి స్కాలర్‌షిప్, మహిళకు ఆర్థిక సహాయం’ అనే వాటిని ఆయన ‘ఖర్చు గా చూస్తారు. ‘ఖజానా ఖాలీ గా’ చూస్తారు. దాన్ని సమాజంలో కనీస ‘జీవన భద్రత’ కల్పించే ఒక ‘ప్రభుత్వ బాధ్యత’ గా ఆయన చూడరు. ఇదొక ప్రజా వ్యతిరేక దృక్పథం..”
వెంకయ్య నాయుడు గారిది ఒక ప్రత్యేక వాణి. అలాగే ఒక ప్రత్యేక బాణి కూడా. ఇప్పుడంటే ఆయన మాజీ కావచ్చును గానీ, రాజకీయ పదవుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన రాజీ లేకుండా మాట్లాడగలరు. భాష గురించి, సాహిత్యం గురించి, సంస్కృతీ సంప్రదాయాల గురించీ అలాగే కట్టూ, బొట్టూ గురించి, ఇంకా ఇలా అనేక వాటి గురించి అలా అలవోకగా మాట్లాడే వాళ్ళల్లో ఆయన ప్రథములు. ఆయన్ని అనేక విషయాల్లో వ్యతిరేకించే వారికి కూడా ఇంత వరకూ అభ్యంతరం ఉండక పోవచ్చును. కాని, ‘ఉచితాలూ – సంక్షేమాలూ’ అనే వాటి విషయంలో మాత్రం ఆయన్ని ఆక్షేపించ కుండా ఉండలేము. ఎందుకంటే- మొట్ట మొదటి నించీ ఆయన వాటికి వ్యతిరేకే కాబట్టి.
తాను బాగా ఇష్టపడే ఎన్టీఆర్ దగ్గర నించీ, ఇప్పటి ఆప్త మిత్రుడు చంద్రబాబు దాకా, ఎమర్జెన్సీ కాలంలో తనని అరెస్ట్ చేసి 18 నెలలు జైల్లో పెట్టించిన ఇందిరా గాంధీ దగ్గర నించీ, తనని రాజకీయాల్లో నించి తప్పించి, ఉపరాష్ట్రపతి పదవితో విశ్రాంతి నిచ్చిన మోదీ దాకా పరిపాలనలో ఎవరు ఉన్నా సరే, సంక్షేమాల్ని నిరభ్యంతరంగా వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు మాత్రమే. భారత రాజ్యాంగం ‘సంక్షేమ రాజ్యం (వెల్ఫేర్ స్టేట్)’ గురించి చెప్పింది. ‘ఉచిత పథకాలు ఇవ్వాలి’ అని నేరుగా ఎక్కడా అనకపోయినప్పటికీ ‘ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయాల’ ని మాత్రం స్పష్టంగా చెప్పింది.
‘సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఆధారంగా ప్రజల సంక్షేమాన్ని పెంపొందించే సామాజిక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని, అసమానతలను తగ్గించడానికి కృషి చేయాలి’ అని ఆర్టికల్ 38 చెబుతుంది. ‘నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం, వికలాంగత వంటి పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి’ అని ఆర్టికల్ 41 చెబుతుంది. ‘ప్రజల పోషకాహారం, జీవన ప్రమాణాలు, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత’ అని, ఆర్టికల్ 47 చెబుతుంది. అంటే- ఈపాటి విషయాలు ఆయనకి తెలియక కాదు. ఆయనకు బాగా తెలుసు. రాజ్యాంగం గురించి ఇంకా బాగా తెలుసు. పైగా, నిన్నమొన్నటి దాకా, ఆయన రాజ్యాంగ పదవిలో నే ఉన్నారు. కాబట్టి, ఇది ‘తెలియక పోవడం’ అనే సమస్య కాదు; ‘సంక్షేమం’ పట్ల ఆయనకున్న ‘తేలికపాటి భావం’ అని అర్థం చేసుకోవాలి.
‘ఒక పేద కుటుంబానికి రేషన్ బియ్యం, వృద్ధుడికి పెన్షన్, రైతుకు పంట రుణమాఫీ, విద్యార్థికి స్కాలర్‌షిప్, మహిళకు ఆర్థిక సహాయం’ అనే వాటిని ఆయన ‘ఖర్చు గా చూస్తారు. ‘ఖజానా ఖాలీ గా’ చూస్తారు. దాన్ని సమాజంలో కనీస ‘జీవన భద్రత’ కల్పించే ఒక ‘ప్రభుత్వ బాధ్యత’ గా ఆయన చూడరు. ఇదొక ప్రజా వ్యతిరేక దృక్పథం. ఆ దృక్పథం నించే ఇప్పుడు ఆయన తమిళనాడు ముఖ్య మంత్రి విజయ్ ని కూడా విమర్శించారు. ‘స్టాలిన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని ఒక పక్కన చెబుతూ, మరొక పక్కన కోపరేటివ్ రుణాల్ని రద్దు చేస్తాననడం లో విజయ్ ఉద్దేశ్యం ఏమిటి?’ అంటూ ఆయన విజయ్ ని ప్రశ్నించారు.
అవును. విజయ్ ఎన్నికల హామీలో “కోఆపరేటివ్ పంట రుణాలను మాఫీ చేస్తాం” అని ప్రకటించారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు 100% మాఫీ, ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు 50% మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మొదటి దశలో: 14.22 లక్షల మంది రైతులకు 2,044 కోట్ల ‘కో-ఆపరేటివ్ పంట రుణ మాఫీని’ ప్రకటించింది.ఆ తర్వాత పథకాన్ని విస్తరించి:14.43 లక్షల మంది రైతులకు సుమారుగా 5,932 కోట్ల రుణమాఫీని ప్రకటించింది. ఇవి ఉచితాల లిస్టు లోకి రావు. ఇవి ‘రాజ్య సంక్షేమ బాధ్యత’ కిందకే వస్తాయి.
‘అప్పుల భారం, పంట నష్టం, నీటి కొరత, వాతావరణ సమస్యలు, దిగుబడికి తగిన ధరలు లేకపోవడం’ అనే కారణాల చేత ఒక్క తమిళనాడులోనే- 2021–2023 మధ్య మొత్తం సుమారు గా 1,968 మందిరైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయంటూ ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ నే చెప్పింది. రైతుల ఈ సమస్యలను చూసిన విజయ్ ఎన్ని కల సమయంలో వారి వోట్ల కోసం వారి ‘రుణాలను రద్దు చేస్తానని’ హామీ ఇచ్చాడు.
రైతుల రుణ భారాన్ని తగ్గించి, వాళ్లకు కొంత ఉపశమనంగా ఉండే ప్రయత్నాన్ని ఇంతగా తప్పుబట్టే వెంకయ్యనాయుడు గారు తాను ఏనాడైనా బ్యాంకులకు డబ్బు ఎగగొట్టిన ‘విల్ ఫుల్ డిఫాల్టర్ల’ గురించి మాట్లాడిన సందర్భం ఉందా ? అలాంటి దాఖలలైతే ఇంత వరకూ లేనే లేవు. ‘విల్‌ఫుల్ డిఫాల్టర్ అంటే అప్పు తీర్చే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా బ్యాంకుకు రుణం చెల్లించని వ్యక్తి లేదా సంస్థ’ అని అర్థం.
దేశవ్యాప్తంగా 2025 నాటికి విల్ ఫుల్ డిఫాల్టర్ బకాయిలు సుమారు 3.83 లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. దేశం సంగతి పక్కనపెడదాం. వెంకయ్య నాయుడు గారు తమిళనాడు గురించే మాట్లాడారు కాబట్టి, ఒక్క తమిళనాడునే తీసుకుంటే : ఎయిర్ సెల్ వ్యవస్థాపకుదైన శివశంకరన్ వివిధ బ్యాంకులల్లో వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాడు. ఒక్క కెనరా బ్యాంకు లోనే సుమారు 4,508 కోట్లు బకాయి ఉన్నట్లు వెల్లడైంది. సురనా కార్పొరేషన్ లిమిటెడ్ కి కూడా వందల కోట్ల అప్పు ఉంది . ఆర్.ఈ.ఐ ఆగ్రో లిమిటెడ్ కి కొన్ని వేల కోట్ల బ్యాంకు బకాయిలు ఉన్నాయి. ఇంకా కె. ఎస్. ఆయిల్స్, కొన్ని టెక్స్టైల్, ఇంజినీరింగ్ సంస్థలపై కూడా బ్యాంకు మోసం, రుణ ఎగవేత కేసులు నమోదయ్యాయి.
అయినా తమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పు అంతా ‘పబ్లిక్ వెల్ఫేర్’ కోసం మాత్రమే చేసింది కాదు; ‘కార్పొరేట్ వెల్ఫేర్’ కోసం కూడా చేసింది. ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు, భూమి రాయితీలు, విద్యుత్ సబ్సిడీలు, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలు పెట్టుబడిదారులకు ఇస్తున్నాయి. వీటిని “పెట్టుబడుల ఆకర్షణ” పేరుతో సమర్థిస్తారు. కానీ ఆ రాయితీలకు తగిన ఉద్యోగాలు ఏనాడైనా వచ్చాయా? వీటి వలన ప్రభుత్వానికి తిరిగి ఎంత ఆదాయం వచ్చింది? అనే ప్రశ్న ను మాజీ ఉపరాష్ట్రపతి ఎన్నడూ అడగరు. ప్రభుత్వ అప్పులు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి ఆయనకు తెలియనివి కావు. వాటన్నిటినీ వొదిలేసి, ‘సంక్షేమాలు, ఉచితాలే కారణం’ అనడం వాస్తవాన్ని వక్రీకరించడమే.
‘వెల్ఫేర్ అనేది ప్రభుత్వాల బాధ్యత’ అనే భావనకు మొట్ట మొదటి సారిగా సిద్ధాంతపరమైన పునాది వేసిన వాడు ‘సర్ విలియమ్ హెన్రీ బెవరిడ్జ్’ అనే బ్రిటీష్ ఆర్థికవేత్త. ‘పేదరికం, వ్యాధులు, అజ్ఞానం దయనీయ జీవన పరిస్థితులు, నిరుద్యోగం’ అనే ఐదు సమస్యల్ని గుర్తించి 1942 లో ఒక రిపోర్ట్ ని ప్రపంచం ముందు పెట్టాడు. దాన్ని ‘బ్రెవరిడ్జ్ రిపోర్ట్’ అని అంటారు. ఇంక అప్పటి నించీ ‘సంక్షేమం అనేది ప్రభుత్వాల బాధ్యత’ అనే భావన ప్రపంచం ముందుకు వచ్చేసింది. ఉద్యోగ నిమిత్తం తల్లి తండ్రులు ఇండియాకి వచ్చినప్పుడు బెవరిడ్జ్ బెంగాల్లో పుట్టాడు. ఇండియాతో అతనికి ఉన్న సంబంధం అంత వరకే. కానీ వెంకయ్యనాయుడు గారు ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. ఇక్కడే చదువుకున్నారు. కార్యకర్త స్థాయినించి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రజలే ఆయన్ని పెంచారు. అలాంటి ప్రజలకు ఒక చిన్న ఊరట గా అందే సంక్షేమాల గురించి ఆయన అలా ఆలోచించ వచ్చునా?
‘సంక్షేమం అనేది దానం కాదు అని, అదొక రాజ్యాంగబద్ధమైన సామాజిక బాధ్యత అని, ప్రజల పన్నులతో ఏర్పడిన ‘ప్రభుత్వ ఖజానా’ ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడాలి’ అనే విషయాల్ని వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు గుర్తిస్తారు?
-నన్నూరి వేణుగోపాల్
98494 49012





