కన్న పేగును క్షోభ పెడుతున్నారు

– నా కుటుంబానికి నిప్పంటించారు
– ఆ నిప్పు వాళ్లనే దహించి వేయబోతోంది
– తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు
– తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే
– కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం
– కరీంనగర్ హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి

కరీంనగర్, ప్రజాతంత్ర, మే 12 : ‘ఏ తప్పూ చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు.. నిజానిజాలు కోర్టులు తేలుస్తాయి. తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే.. చట్టం ముందు అందరూ సమానమే.. కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం.. చట్టానికి కట్టుబడి ఉన్నా’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సమాజమే తన కుటుంబమని భావించి జీవితమంతా సమాజం కోసమే పనిచేసిన.. ఏ ఇంట్లో కష్టమొచ్చినా పెద్ద కొడుకునై అండగా ఉన్నా.. కానీ కొడుకుకు టైమివ్వలేకపోయా.. జరుగుతున్న పరిణామాలకు తప్పు నాదే. క్షమించండి అని సమాజానికి విజ్ఞప్తి చేశారు. తŠన బాటలోనే నడిచిన తన భార్య కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా చేతనైనంత సాయం చేసిందని, ఈరోజు ఆ కన్న పేగునే క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను భయపడేది లేదంటూ ‘నన్ను కెలికారు.. నా కుటుంబానికి నిప్పంటించారు.. ఆ నిప్పుతోనే అవినీతి, కుట్రలు చేసే వాళ్ల సామ్రాజ్యాన్ని దహించి వేస్తా.. అవినీతి గడీలను బద్దలు కొడతా అని అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంత్రి సంజయ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లోని వైశ్య భవన్ నుండి‘హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ఏక్తా యాత్రకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలాదిమంది ఈ యాత్రకు తరలివచ్చారు. కాషాయ శ్రేణులతో కరీంనగర్ జన సంద్రమైంది. ఈ సందర్భంగా బండి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘ఈ లైట్ల ఫోకస్‌కు కళ్లల్లో నీళ్లు వస్తే ఏడుస్తున్నానని అనుకునేరు.. నేను భయపడ.. సంజయ్ కంట తడిపెట్టే రకం కాదు.. టవర్ సర్కిల్‌పై కాషాయ జెండాను ఎగరేశాం.. హిందువుల ఐక్యతను చాటేందుకే 16 ఏళ్లుగా హిందూ ఏక్తా యాత్ర చేస్తున్నా.. జై శ్రీరాం అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది.. హిందూ సమాజానికి ఆపదొస్తే జై శ్రీరాం నినాదంతో తెగించి కొట్లాడతాం.. కరీంనగర్ గడ్డ రక్తం నాలో ప్రవహిస్తున్నది.. గల్లీగల్లీలో ప్రజా సమస్యలపై కొట్లాడిన.. బాధలను చూసి భయపడి పారిపోయేటోడ్ని కాను.. మీరే నా కుటుంబం. సమాజమే నా ఇల్లు అనుకున్న.. హార్ట్‌లో స్టంట్ ఉన్నా హార్ట్‌ఫుల్‌గా 1600 కి.మీలు నడిచిన.. రాష్ట్ర ప్రజల కష్టాలను పంచుకున్న.. నాటి పాలకులు నాపై రాళ్ల దాడి చేసినా, 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలే.. మీ ఇంట్లో పెద్ద కొడుకునైన.. నా టైమంతా సమాజానికే ఇచ్చిన.. నా కొడుకుకు టైమియ్యలేకపోయిన.. కొడుకుకు టైమివ్వకుండా నేను తప్పు చేసిన.. క్షమించండి.. నా కొడుకును క్రిమినల్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారు.. నన్ను, నా కుటుంబాన్ని, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అని బండి సంజjáYT అన్నారు. నా కొడుకు సంఘటన మమ్మల్ని ఇబ్బందిపెడుతుంటే 29మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబాలు పడుతున్న క్షోభ గుర్తుకొస్తోంది అని అన్నారు. శ్రీరామ చంద్రుడికే కష్టాలు తప్పలేదు.. ఆయనే నాకు ఆదర్శం.. కష్టాలు భరిస్తా.. ఆనాడు రాక్షసులు ఆంజనేయస్వామికి నిప్పంటిస్తే ఏమైంది.. లంక దహనమైంది అని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *