– పార్టీ పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చ
– కీలక నేతల సమీకరణతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
– ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు కార్యాచరణ
– ఎర్రవెల్లిలో కేసీఆర్ వ్యూహాత్మక సమావేశం
సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 12: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెంచే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం కీలక సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి నుంచి మళ్లీ పటిష్టం చేయాలనే దిశగా కేసీఆర్ దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టడం, ప్రతి నియోజకవర్గానికి ఇన్‌చార్జిలను నియమించడం ద్వారా పార్టీ కేడర్‌ను మళ్లీ యాక్టివ్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడు పెంచే అవకాశం
రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లే వ్యూహంపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రైతు సమస్యలపై బీఆర్ఎస్ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు ఉద్యమాలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేసీఆర్ మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లోకి..
-కొంతకాలంగా ప్రజల్లో ప్రత్యక్ష కార్యక్రమాలను తగ్గించిన కేసీఆర్ ఇప్పుడు పార్టీ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఎర్రవెల్లి సమావేశం ద్వారా పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడంతోపాటు, భవిష్యత్తు రాజకీయ పోరాటాలకు కేసీఆర్ సిద్ధమవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకా ఈ సమావేశంలో అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు తన్నీరు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్, వి.గంగాధర్ గౌడ్, జోగినపల్లి సంతోష్ కుమార్, నారదాసు లక్ష్మణరావు, ఆర్.శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, టి.జీవన్ రెడ్డి, సోమా భరత్ కుమార్ గుప్తా, సత్యవతి రాథోడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి, మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియతోపాటు, ఓటరు లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుగుతున్నందున పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్దతిలో జరపాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదరర్శుల సమావేశం అభిప్రాయపడింది. అధినేత కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ఈ సమావేశం ఆరు గంటలపాటు సుదీర్ఘంగా జరగగా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని, ప్రతీ మండýం, మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి సభ్యత్వ సమన్వయ కమిటీలను రెండుమూడు రోజుల్లొ నియమించాలని నిర్ణయించారు. డిజిటల్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లలో బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఈ సందర్భంగా డిజిటల్ మెంబర్‌షిప్ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలపై శిక్షణ ఇవ్వాలని సమావేశం అభిప్రాయపడింది.
సభ్యత్వ నమోదు కోసం నియమితులైన ఇన్‌చార్జిలు వీరే
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు- తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు- జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు – పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి. మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు- గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు- గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు- నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు- రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు- సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలు- మహమూద్ అలీ, మాజీ మంత్రి, గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలు- మెట్టు శ్రీనివాస్, కార్యదర్శి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలు- పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, హైదరాబాద్ జిల్లా- తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు- ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి.
——————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.