నర్సుల వృత్తిపరమైన అభివృద్ధికి నర్సింగ్ డైరెక్టరేట్

 – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
– 1919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అంద‌జేత‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : నర్సింగ్ అనేది వృత్తి కాదు.. మానవ సేవ చేసే గొప్ప అవకాశం. రోగులకు చికిత్స అందించడమే కాదు.. వారికి ధైర్యం, భరోసా, ఆశను కల్పించేది నర్సులే అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో దాదాపు లక్షా 80 వేల మంది రిజిస్టర్డ్ నర్సులు సేవలందిస్తున్నారని, వారి సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి కోసం ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రపంచ నర్సింగ్ రంగానికి మార్గదర్శకురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలంటూ నర్సింగ్ ఆఫీసర్లకు సూచించారు. ప్ర‌పంచ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా నర్సింగ్ ఆఫీసర్లుగా ఎంపికైన 1919మందికి కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం నియామకపు పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ నర్సులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నర్సులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన నర్సింగ్ ఆఫీసర్లకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు అంటూ ప్ర‌సంగం ప్రారంభించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రోజునే నియామక పత్రాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ సమయంలో కుటుంబ సభ్యులు కూడా రోగుల దగ్గర ఉండలేని పరిస్థితిలో నర్సులు సేవలు అందించారన్నారు. ప్రజలు ఆ సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. గతంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో భారీగా ఖాళీలు ఉండటం వల్ల వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఉండేదని, ఈ సమస్యను తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని భారీ స్థాయిలో నియామకాలు చేపట్టిందని తెలిపారు. రెండున్నరేళ్లలో ఆరోగ్య శాఖలో దాదాపు 13 వేల పోస్టులను భర్తీ చేశామంటూ ఇదే గ్రౌండ్‌లో ఇప్పటికే 1,257మంది ల్యాబ్ టెక్నీషియన్లకు, 623 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులకు, 132మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకపుపత్రాలు అందించామని, ఈరోజు ఇక్కడే 1919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందిస్తున్నామని వివరించారు. గతంలో 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేశామని, రెండున్నరేళ్లల్లో తొమ్మిది వేల నర్సింగ్ పోస్టులను భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. మరో ఐదు వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇందులో సుమారు రెండు వేల ఏఎన్‌ఎం పోస్టుల ఫలితాలు ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని, న్యాయపరమైన కారణాలతో ఆలస్యమైన 732 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీని కూడా త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ పూర్తిస్థాయిలో సిబ్బందితో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశీయ, అంతర్జాతీయ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నర్సింగ్ విద్యను విస్తరిస్తున్నామని, ఈ రెండేళ్లలో కొత్తగా 16 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేశామని, వాటిలో 960 బీఎస్సీ నర్సింగ్ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. విద్య అనంతరం విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్‌ను ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు నేర్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా జర్మన్, జపాన్ దేశాల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఆ రెండు భాషలతోపాటు, ఇంగ్లీష్ నేర్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అర్హులైన నర్సులకు ప్రమోషన్లు కల్పించామన్నారు. ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం ట్రైనింగ్, స్కిల్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు మిడ్‌వైఫరీ ట్రైనింగ్ కళాశాలలు మాత్రమే ఉండగా 90 సీట్లు మాత్రమే ఉన్నాయని, దశలవారీగా అన్ని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు మిడ్‌వైఫరీ ట్రైనింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి దామోదర్ చెప్పారు. దీనివల్ల మాతా-శిశు ఆరోగ్య సేవలు మెరుగుపడతాయని, ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ప్రతి పౌరునికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మీర్జా రహ్మత్ బేగ్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీపీహెచ్ రవింద్ర నాయక్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *