అప్పుడు సిరులు.. ఇప్పుడు స్కాంలు

– కాంగ్రెస్ హయాంలో సింగరేణి పరిస్థితి ఆందోళనకరం
– బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : సింగరేణిలో అందిన కాడికి కాంగ్రెస్ దోచుకుంటున్నదని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో సింగరేణి స్కాంలకు గనిలా మారిందన్నారు. బొగ్గు గనుల్లో అవినీతి జరుగుతున్నదని బీఆర్ఎస్ లేవనెత్తితే కేంద్రం ఒక కమిటీ వేసిందని, ఆ కమిటీ ఏం తేల్చిందో పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హఠావో -సింగరేణి బచావో అనేది బొగ్గు గని కార్మికుల నినాదం కావాలన్నారు. నైనీ బ్లాక్ బొగ్గు గనుల టెండర్ అంశం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టిందని, ఈ విషయంలో కొందరు జర్నలిస్టులు జైలుకు వెళ్లారని తెలిపారు. పరిస్థితి ఇట్లనే ఉంటే సింగరేణిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణికి కేటాయించాల్సిన డ్యూస్ అడ్డగోలుగా పెరిగిపోతున్నాయంటూ 2014లో డ్యూస్ కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఉండగా ఆ తర్వాత టీఎస్ జెన్‌కో నుంచి సింగరేణికి రూ.7 వేల కోట్ల డ్యూస్ మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ రెండున్నర ఏండ్ల పాలనలో సింగరేణికి రూ.14 వేల కోట్ల డ్యూస్ ఉందని, మొత్తం రూ.21వేల కోట్లు డ్యూస్ ఉందని చెప్పారు. కరెంట్ విషయంలో సింగరేణికి కేటాయించాల్సిన రూ.20 వేల కోట్ల డ్యూస్ పెండింగ్‌లో ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఓడీ కేవలం రూ.3,200 కోట్లు.. రాష్ట్ర ప్రభుత్వ ఓడీ కంటే సింగరేణి  ఓడీ రూ.4 వేల కోట్లు అని తెలిపారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణి ఈరోజు ఓడీకి పోయిందన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని సింగరేణి అఫిషియల్ వెబ్‌సైట్‌లో చూపుతోందని, ఆ బొగ్గుపై ఆదాయం వచ్చిందని ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టారని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు విలువ రూ.1600 కోట్లు అయితే అంత విలువైన బొగ్గు ఎక్కడుందో చూపించాలని టీబీజీకేఎస్ ప్రశ్నించాలన్నారు. రాజస్థాన్‌తో కలిసి పాకిస్థాన్ సరిహద్దులో జైషల్మీర్‌లో సింగరేణితో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమయ్యారని, ఎన్టీపీఎస్ అత్యంత చౌకగా విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధమైతే ఈ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు. పీపీఏ, డీపీఆర్ అప్రూవల్ కాకకుండానే సివిల్ వర్క్ మొదలైందని హరీష్‌రావు తెలిపారు. ధర్మల్ పవర్ ప్లాంట్ ఆలస్యం అవుతున్నకొద్దీ కోట్లల్లో నష్టం వస్తుందని, కమీషన్‌ల కోసం ఆర్డర్లు ఇచ్చి పేమెంట్‌లు తీసుకున్నారని ఆరోపించారు. సోలార్ పవర్ ప్లాంట్ టెండర్‌లో మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టి కమీషన్లు దండుకుంటున్నారన్నారు. ఫుట్‌బాల్ సోకుల కోసం సింగరేణి డబ్బులు రేవంత్ రెడ్డి వాడుకున్నాడని, బంగారు బాతులాంటి సింగరేణిని అప్పులకుప్పగా ఈ ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి మంత్రి కిషన్ రెడ్డికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నామని, తెలంగాణలో 40 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎక్కడుందో ఆధారాలు చూపించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే ఈ విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు మరిన్నిటిని త్వరలో బయటపెడతానని మాజీ హరీష్ రావు హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *