చేవెళ్ల డిక్లరేషన్‌తో దగా చేసిన కాంగ్రెస్

– పోడు భూములకు పట్టాలిస్తామని ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిండు
– 50వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను గుంజుకున్న ప్రభుత్వం
– తిరగబడిన లంబాడీ బిడ్డలకు బేడీలు వేసి రేవంత్ జైళ్లకు పంపిండు
– బీఆర్ఎస్ లీడర్ హరీష్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలు చేవెళ్ల డిక్లరేషన్ అంటూ అనేక హామీలు గుప్పించారని, ఇవాళ అదే పామై కాంగ్రెస్‌ను కాటేస్తున్నదని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తామని ఎన్నికలపుడు చేతులు జోడించారు.. అధికారంలోకి వచ్చాక లంబాడీల చేతులకు బేడీలు వేశారని ఆరోపించారు. ఇందిరాపార్కు వద్ద మంగళవారం నిర్వహించిన లంబాడీ హక్కుల పోరాట సమితి ధర్నాలో ఆయన ప్రసంగించారు. భూములు గుంజుకోవద్దు అంటే ఆడవాళ్లు, గర్బిణులు అని కూడా చూడకుండా పోలీసులతో దాడులు చేయించి 45మంది లంబాడి బిడ్డలను జైల్లో పెట్టారన్నారు. కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభం అయ్యిందే ఎస్సీలు, ఎస్టీల కోసం.. తర్వాత అందరికీ పథకాన్ని కేసీఆర్ విస్తరించారన్నారు. కేసీఆర్ లక్ష ఇచ్చిండు..మేం గెలిస్తే తులం బంగారం అన్నరు.. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కల్యాణ లక్ష్మి రావడం లేదు అని ఎద్దేవా చేశారు. చేవెళ్ల డిక్లరేషన్‌లోని ఒక్కటీ అమలు కాలేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు.. పట్టాలు ఇవ్వలేదు గానీ 50వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను పరిశ్రమల పేరిట బడా కంపెనీల కోసం లాక్కున్నడు అని ఆయన ఆరోపించారు. అడ్డుపడిన చేతులకు బేడీలు వేసిన రేవంత్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిధులు లేక ఐటీడీఏలు నీరసించిపోతున్నయి.. కాంట్రాక్టుల్లో 12శాతం రిజర్వేషన్లు అన్నడు.. ఒక్క కాంట్రాక్టు ఇవ్వలేదు అని విమర్శించారు. బ్యాక్‌లాగ్ పోస్టులు ఇస్తం అన్నడు.. అదీ దిక్కు లేదు.. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని 16వేల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నడు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చావా రేవంత్.. ఇండ్లు కట్టుకుంటే ఎస్సీలకు, ఎస్టీలకు రూ.లక్ష ఎక్కువ ఇస్తా అని మాట తప్పినవ్. ఈ ప్రభుత్వంలో లంబాడీలకు మంత్రి పదవి లేదు.. వారిని చిన్న చూపు చూస్తున్నడు అని విమర్శించారు. ఖర్గే.. నువ్వే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించావు.. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పి ఆ డిక్లరేషన్ వెంటనే అమలు చేయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పోడు భూములు ఇస్తమని చెప్పిన కాంగ్రెస్ పొడించిందేం లేదన్నారు. ఏడాదికి రూ.2 కోట్లT ఇచ్చి సేవాలాల్ జయంతిని రాష్ట్ర పండుగగా బీఆర్ఎస్ నిర్వహించిందని, వ్యాపారాలు చేసుకునేందుకు టీఎస్ ప్రైడ్ పెట్టి 13,200 మందికి రూ.800 కోట్లు ఇచ్చిందని, మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ పెట్టించామని వివరించారు. సేవాలాల్ మహరాజ్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ పెట్టి రూపాయి ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. కుమ్రం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్‌కు రూపాయి ఇవ్వలేదు.. ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.2730 కోట్లు బడ్జెట్‌లో పెట్టి చేసిన ఖర్చు రూ.50 కోట్లు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రూపాయి కూడా సాయం చేయలేదని అన్నారు. ఇది ఆరంభం.. రేపు తండా తండాలో నగారా మోగాలి.. తండాల నుంచి దిల్లీ పోయి ఖర్గే ఇంటి ముందు ధర్నా చేద్దాం అని హరీష్‌రావు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *