గాన కోకిల జానకమ్మ కన్నుమూత

– దిగ్భ్రాంతిలో సినీ పరిశ్రమ, అభిమానులు
– కేంద్ర మంత్రులు, ప్రముఖుల సంతాపం

బెంగళూరు, జూలై 11 : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో మరో తార ఈ లోకాన్ని వీడారు. తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాలపాటు కోట్లమంది ప్రేక్షకులను మైమరపించిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఎస్. జానకి(88) మైసూర్‌లో శనివారం రాత్రి మరణించారు. ఈ విషయాన్ని జానకి మనవరాలు అప్సర వైద్యుల సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ‘నా ప్రియమైన అమ్మమ్మ, లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూశారని తీవ్ర విచారంతో పంచుకుంటున్నాను. మా హృదయాలు భారంగా ఉన్నప్పటికీ ఆమె జీవించిన అసాధారణమైన జీవితానికి, తన అమర సంగీతం ద్వారా కోట్లమందికి అందించిన అపరిమితమైన ఆనందానికి మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము. ప్రపంచానికి ఆమె ఎన్నో జ్ఞాపకాలలో భాగమైన ఒక ఐకానిక్ వాయిస్ కావచ్చు, కానీ మాకు మాత్రం ఎంతో ఆప్యాయత, వినయం, దయ, హుందాతనం కలిగిన ఒక ప్రియమైన అమ్మమ్మ. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి. మేము ఈ పెద్ద లోటును తట్టుకుని, తీవ్ర బాధలో ఉన్న ఈ కష్టసమయంలో మా కుటుంబానికి కావలసిన ప్రైవసీని గౌరవించాలని అందరినీ కోరుతున్నాను’ అని పోస్టు చేశారు.

సినీ పరిశ్రమ, సంగీత అభిమానుల దిగ్భ్రాంతి

ఈ వార్త తెలియగానే సినీ పరిశ్రమ, సంగీత అభిమానులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. జానకి మరణంతో టాలీవుడ్‌తోపాటు మొత్తం దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నెటిజన్లు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె పాటలు చిరస్మరణీయం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

భారతీయ సినీ సంగీత సామ్రాజ్యంలో తన అద్భుతమైన గాత్రంతో దశాబ్దాలపాటు శ్రోతలను అలరించిన ‘గాన కోకిల’ ఎస్.జానకి కన్నుమూశారనే వార్త ఎంతో విచారకరం. ఆమె పాడిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయం. ఆమె గాయని మాత్రమే కాదు, భారతీయ సంగీతానికి ఒక నిధి. ఆమె లేని లోటు సంగీత ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

జానకి లేరన్న వార్త కలచివేసింది : బీజేపీ చీఫ్ రామచందర్‌రావు

ప్రముఖ గాయని ఎస్.జానకి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. దక్షిణ భారత కోకిలగా అందరూ ప్రేమగా పిలుచుకునే ఆమె ఆరు దశాబ్దాలకుపైగా సాగిన తన అసాధారణ సంగీత ప్రస్థానంతో అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, అనేక ఇతర భారతీయ భాషలలో పదివేల పాటలతో, ఆమె గాత్రం భారతీయ సినిమా, సంగీత ప్రపంచంలో విడదీయరాని భాగంగా నిలిచింది. ఆమె అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞ, భావోద్వేగ లోతు, కాలాతీతమైన రాగాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూ, వారి మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి పూడ్చలేని నష్టం. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

ఆమె పాటకు మరణం లేదు : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

జానకి మరణం భారతీయ సంగీతానికి ప్రత్యేకించి దక్షిణాదికి తీరని లోటు. కోట్లాది హృదయాలను తన మధుర స్వరంతో పరవశింపజేసిన ప్రముఖ నేపథ్య గాయని జానకి. ఆమె స్వరం ఎన్నో తరాల మధుర జ్ఞాపకం. సంతోషం, బాధ, ప్రేమ సహా ప్రతి భావానికి తోడుగా జానకి పాట నిలిచింది. భాష ఏదైనా భావాన్ని హృదయానికి హత్తుకునేలా పాడే అద్భుతమైన స్వరం జానకి సొంతం. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాటకు మాత్రం మరణం లేదు. తరాలు మారినా, కాలం గడిచినా ఆమె స్వరం భారతీయుల హృదయాల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ మహా గాన సరస్వతికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నా. జానకి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. జానకమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *