బాసర సరస్వతీ ఆలయంలో చోరీ

– కాళీమాత ఆలయంలో వెండి కిరీటం చోరీ
– సిసి కెమెరాలపై బట్టలు కప్పి చోరీకి పాల్పడ్డట్లు గుర్తింపు
– పరిశీలించిన ఎస్పీ

నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌బాసరలో కొలువుదీరిన జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మొదటి అంతస్తులోని మహంకాళి అమ్మవారి ఆలయంలో తలుపు తాళాలు దొంగలు పగలకొట్టి అమ్మవారి వెండి కిరీటంతోపాటు హుండీని దొంగిలించారు. మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం చేసేందుకు దేవాలయంలోకి పురోహితులు వెళ్లారు. అమ్మవారి ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని వారు గుర్తించారు అనంతరం దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరస్వతి అమ్మవారి ఆలయంలోని పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. గర్భగుడి తాళాలు పగులగొట్టి మరీ ఈ దోపిడీకి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస్‌ ‌గుడికి వచ్చిన సందర్భంగా తాళాలు పగులగొట్టి ఉండటం గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని ఆలయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఆలయ భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ పూజారి చేత తలుపులు తెరిపించారు. ఆ సమయంలో అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటు హుండీని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.కాగా, సీసీ కెమెరాలపై వస్త్రాలు కప్పి దొంగలు ఆలయంలోకి ప్రవేశించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చోరీకి పాల్పడిన హుండీలో నుంచి డబ్బులు తీసుకుని, తర్వాత హుండీని వ్యాసగుడి సమీపంలో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బాసర ఆలయంలో చోరీ గురించి సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఘటనాస్థలిని పరిశీలించారు. చోరీ జరిగిన తీరు, సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన తదితర అంశాలపై అధికారులతో సమావేశమయ్యారు. కేసును అన్ని కోణాల్లో విచారించి నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *