ఇప్పటివరకు మనకు ‘వై-ఫై ‘ బాగా తెలుసు. వై-పై రేడియో వేవ్‌ల ఆధారంగా పనిచేస్తుంది. మనదేశంలో ఇప్పుడిప్పుడే ‘లై-ఫై ‘ పేరుతో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వొస్తోంది. ఎల్ ఈడీ బల్బ్ లలోని దృశ్య కాంతి ఆధారంగా పనిచేయడం దీని ప్రత్యేకత! ప్రస్తుతం దీన్ని ,మిలిటరీ హాస్పిటల్స్, హై సెక్యూరిటీ జోన్లలో వాడుతున్నారు. లై-ఫై టెక్నాలజీ ప్రధానంగా భారతదేశంలో ప్రయోగాత్మక దశలో ఉన్నదనే చెప్పాలి. దిల్లీకి చెందిన వెల్‌మెన్ని, విప్రో లైటింగ్ వంటి సంస్థలు మన దేశంలో లై-ఫై పరికరాలను తయారు చేసి, ప్రయోగాత్మకంగా ఆఫీసుల్లో అమలు చేశాయి.
సమాచారం గోప్యంగా ఉండటానికి, హ్యాకింగ్ జరగకుండా ఉండటానికి కాంతి ద్వారా పనిచేసే ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే దిల్లీ ఐఐటీలో దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రయోగాత్మక ప్రాజెక్టుల్లో భాగంగా గుజరాత్ లోని గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ సాయంతో లై-ఫై ని ఉపయోగించి ఇంటర్నెట్ అందించే ప్రయత్నాలు చేశారు. మన ఇళ్లలో ఉండే ఎల్ ఈడీ బల్బులను ఆన్, ఆఫ్ చేయడం ద్వారా సెకనుకు లక్షల సార్లు కాంతి పుంజాలు మారుతుంటాయి.ఈ కాంతి మార్పులను బైనరీ డేటాగా మార్చుకుని, మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో అమర్చిన రిసీవర్ ద్వారా ఇంటర్నెట్‌ను వేగంగా పొందే సదుపాయం లై-ఫై వల్ల సాధ్యం!
మనం ప్రస్తుతం ఉపయోగించే వై-ఫైకి, ఈ సరికొత్త లై-ఫైకి కొన్ని తేడాలున్నాయి. లై-ఫై వేగం చాలా ఎక్కువ. ఇది సెకనుకు 100 జీబీపీఎస్ పైగా వేగాన్ని అందుకోగలదు. వై-ఫై వేగం సాధారణంగా సెకనుకు 1 జీబీపీఎస్ వరకు ఉంటుంది. లై-ఫై కాంతి ఉన్నంత వరకే (దాదాపు 10 మీటర్లు) పనిచేస్తుంది. వై-ఫై గోడలను దాటి కూడా (దాదాపు 32 మీటర్లు) పనిచేస్తుంది. లై-ఫై కాంతి గోడలను దాటలేదు కాబట్టి దీన్ని హ్యాక్ చేయడం అసాధ్యం, చాలా సురక్షితం. వై-ఫై సిగ్నల్స్ గోడల అవతలికి కూడా వెళ్తాయి కాబట్టి హ్యాకింగ్ జరిగే అవకాశం ఉంది. లై-ఫై కి ప్రత్యేకమైన ఎల్ ఈడీ లైట్లు, రిసీవర్లు కావాలి కాబట్టి ప్రస్తుతానికి ఖర్చు ఎక్కువ. వై-ఫై రూటర్లు మరియు పరికరాలు మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తున్నాయి. లై-ఫై కి రేడియో సిగ్నల్స్ వల్ల ఎలాంటి అంతరాయం కలగదు. వై-ఫై సిగ్నల్స్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల నెమ్మదించే అవకాశం ఉంది.
వై-ఫై కి వాడే రేడియో తరంగాలు మెడికల్ పరికరాలకు (ఎమ్మారై, ఈసీజీవంటివి) అంతరాయం కలిగిస్తాయి.
కానీ లై-ఫై కాంతి తరంగాలను వాడుతుంది కాబట్టి, ఇది రోగుల ప్రాణాలకు రక్షణగా ఉండే వైద్య పరికరాలకు ఎటువంటి నష్టం చేయకుండా ఇంటర్నెట్ అందిస్తుంది. విమానాల్లో రేడియో సిగ్నల్స్ వాడకం వల్ల పైలట్ కమ్యూనికేషన్‌కు ఇబ్బంది కలగవొచ్చు. విమానం లోపల ప్రతి సీటు పైన ఉండే రీడింగ్ లైట్ ద్వారా లై-ఫై ని అమర్చితే, ప్రయాణికులు సురక్షితంగా, వేగవంతమైన ఇంటర్నెట్ వాడుకోవొచ్చు. నీటి లోపల వై-ఫై రేడియో సిగ్నల్స్ పనిచేయవు. కానీ కాంతి నీటిలో సులభంగా ప్రయాణిస్తుంది కాబట్టి, సముద్ర గర్భంలో పరిశోధనలు చేసే సబ్‌మెరైన్లు మరియు డైవర్లు లై-ఫై ద్వారా డేటాను పంచుకోవొచ్చు. రేడియో తరంగాల వల్ల చిన్న రవ్వలు వొచ్చే ప్రమాదం ఉంది. లై-ఫై కేవలం లైట్ బల్బుల ద్వారా పనిచేస్తుంది కాబట్టి, ఇలాంటి సున్నితమైన వాతావరణంలో ఇది అత్యంత సురక్షితం.
సాధారణ వై-ఫై రూటర్ల లాగా లై-ఫైపరికరాలు ఇంకా సాధారణ ఎలక్ట్రానిక్స్ షాపుల్లో లేదా అమెజాన్ వంటి సైట్లలో విరివిగా లభించడం లేదు. అయితే, వాణిజ్యపరంగా కొన్ని ప్రత్యేక సంస్థల ద్వారా ఇవి అందుబాటులోకి వొస్తున్నాయి. ప్రపంచంలో ప్రముఖ సంస్థ ‘ప్యూర్ లై-ఫై ‘, ‘ఓలెడ్‌కమ్ ‘ వంటి గ్లోబల్ కంపెనీలు ప్రస్తుతం లై-ఫై ఆధారిత పరికరాలను తయారు చేస్తున్నాయి. ఇండియాలో సాధారణ ప్రజల వాడకం కోసం ఇవి ఇంకా విక్రయానికి రాలేదు. ప్రస్తుతానికి ‘వెల్‌మెన్ని ‘, ‘విప్రో లైటింగ్ ‘ వంటి సంస్థలు కేవలం పెద్ద కంపెనీలు, హాస్పిటల్స్ లేదా ప్రభుత్వ ప్రాజెక్టుల ఆర్డర్ల పై మాత్రమే ఈ సిస్టమ్స్‌ను ఇన్‌స్టాల్ చేసి ఇస్తున్నాయి. మనదేశంలో రాబోయే కాలంలో లై-ఫై సాంకేతికతకు చాలా పెద్ద మార్కెట్ ఉండబోతున్నది.
ప్రపంచవ్యాప్తంగా లై-ఫై మార్కెట్ 2026 నుండి 2034 నాటికి విపరీతంగా పెరగనుందని అంచనా. మనదేశంలో భారతదేశం డిజిటల్ ఇండియాలో భాగంగా నిర్మిస్తున్నస్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో లై-ఫై కీలక పాత్ర పోషించనుంది. ఎల్ ఈడీ వీధి దీపాల ద్వారానే రోడ్లపై వెళ్లే వాహనాలకు, ప్రజలకు హై-స్పీడ్ డేటాను అందించే రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ పై ఒత్తిడి పెరిగి నెట్ స్లో అయినప్పుడు, దానికి ప్రత్యామ్నాయంగా లై-ఫైని ఒక ‘సపోర్టింగ్ నెట్‌వర్క్’ లాగా ఇళ్లలో, ఆఫీసుల్లో వాడవొచ్చు. అంతర్జాతీయంగా లై-ఫైకి గ్లోబల్ స్టాండర్డ్స్ (ఐఈఈఈ 802.11బీబీ) ఆమోదం లభించింది.
దీనివల్ల భవిష్యత్తులో రాబోయే మొబైల్స్, ల్యాప్‌టాప్‌లలో వై-ఫై చిప్‌తో పాటే లై-ఫై చిప్‌ను కూడా కంపెనీలు నేరుగా ఇన్-బిల్ట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తే, కేవలం మన ఇళ్లలో వెలిగే సాధారణ ఎల్ ఈడీ బల్బులనే ఇంటర్నెట్ రూటర్లుగా మార్చుకోవచ్చు కాబట్టి దీర్ఘకాలంలో ఇది చాలా చౌకధరలో అందుబాటులోకి వొస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇది వై-ఫై లాగే మన ఇళ్లలోకి కూడా సాధారణ పరికరంగా వొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది అందుబాటులోకి వొస్తే మనం మరో సరికొత్త సమాచార యుగంలోకి అడుగుపెట్టడం ఖాయం!





