ప్రజా సేవకు జీవిత కాలం త్యాగం.. వృద్ధాప్యంలో హక్కుల కోసం ఆర్తనాదాలు!

” ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశామని, కార్మికుల కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయాయని పాలకులు వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు పాలకుల మాటల్లోని నిజాయితీ లేమిని నగ్నంగా అద్దం పడుతుంది.”
bhumaiah
వెంక గారి భూమయ్య
సీనియర్ జర్నలిస్ట్
మొబైల్ :9848559863

మన సమాజ గమనంలో ప్రజల రవాణాకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎంతో కీలకమైనది. రాత్రింబవళ్లు, ఎండనక వాననక, పండుగలు పబ్బాలు వదిలేసి ప్రజలను సురక్షితంగా తమ ఊళ్లకు చేర్చిన శ్రమజీవులు ఈ సంస్థ కార్మికులు. తమ జీవిత కాలమంతా సంస్థ ఎదుగుదలకు, ప్రజల రవాణా అవసరాలకు రక్తాన్ని, చెమటను ధారపోసిన ఈ విశ్రాంత ఉద్యోగుల శేష జీవితం నేడు అత్యంత చీకటిగా, దయనీయంగా మారింది. ఒకప్పుడు ప్రజా సేవకే తమ సుఖాలను త్యాగం చేసిన ఈ శ్రమజీవులు, వృద్ధాప్యంలో ప్రశాంతంగా గడపాల్సిన సమయంలో తమ చట్టబద్ధమైన హక్కుల కోసం, నిలిచిపోయిన బకాయిల కోసం రోడ్లపైకి వచ్చి కన్నీరు కార్చాల్సి రావడం పాలకుల ఘోర నిర్లక్ష్యానికి, అమానవీయతకు పరాకాష్టగా నిలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశామని, కార్మికుల కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయాయని పాలకులు వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు పాలకుల మాటల్లోని నిజాయితీ లేమిని నగ్నంగా అద్దం పడుతుంది. తమ సొంత కష్టార్జితం కోసం వృద్ధాప్యంలో ఇతరులను యాచించాల్సిన దుస్థితి కల్పించడం ప్రజాస్వామ్యానికే అవమానకరం.

​నిబంధనల ప్రకారం తమకు దక్కాల్సిన కరువు భత్యం బకాయిలు, వేతన సవరణ నిధులు, సేవా నివృత్తి పారితోషికం, సెలవుల నగదు బదిలీ వంటి కనీస ఆర్థిక ప్రయోజనాలు నాలుగైదు ఏళ్లుగా అందకపోవడంతో వేలాది మంది వృద్ధులు తీవ్రమైన మానసిక, ఆర్థిక వేదనను అనుభవిస్తున్నారు. ఒక సామాన్య ఉద్యోగి తన జీవితంలో ముప్పై నలభై ఏళ్ల పాటు కష్టపడి విరమణ పొందేది శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి, పిల్లల పెళ్లిళ్లు లేదా చదువుల బాధ్యతలు పూర్తి చేయడానికో లేదా వృద్ధాప్యంలో సహజంగానే వచ్చే వివిధ రోగాలకు వైద్యం చేయించుకోవడానికో మాత్రమే. కానీ నేడు చాలా మంది విశ్రాంత ఉద్యోగులు గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం వంటి తీవ్ర వ్యాధులకు కనీసం మందులు కొనుక్కోవడానికి, హాస్పిటల్స్ ల్లో  చికిత్స చేయించుకోవడానికి చేతిలో పైసా లేక అల్లాడిపోతున్నారు. ఎంతో మంది కార్మికులు తమ సొంత కష్టార్జితం చేతికి అందకుండానే, వైద్యం అందక మానసిక క్షోభతో కన్నుమూస్తుండటం సమాజ వివేకాన్ని మరియు పాలకుల నైతికతను తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ​ఆర్టీసీ సంస్థ ఎప్పుడూ నష్టాల్లోనే ఉందనే పాత సాకును దశాబ్దాలుగా చూపిస్తూ ఉద్యోగుల పొట్టకొట్టడం అధికారులకు అలవాటుగా మారింది.
నిజానికి సంస్థ నష్టాలకు ప్రయాణికులు లేదా రాత్రింబవళ్లు కష్టపడే కార్మికులు ఏమాత్రం కారణం కాదు. ప్రభుత్వాల తప్పుడు విధానాలు, సకాలంలో రాయితీ నిధులు విడుదల చేయకపోవడం, పెరిగిన ఇంధన ధరల భారాన్ని సంస్థపైనే మోపడం వంటి బాధ్యతారాహిత్య కారణాల వల్లే ఆర్టీసీ ఆర్థిక సంక్షోభంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో కార్మికుల కష్టార్జితం నుండి మళ్లించిన నిధులను సైతం సకాలంలో తిరిగి చెల్లించకపోవడం ఏ రకమైన న్యాయమో పాలకులు సమాధానం చెప్పాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ‘ఉచిత బస్సు ప్రయాణం’ వంటి ప్రజాకర్షక పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, దానికి ప్రతిగా ఆర్టీసీ సంస్థకు తిరిగి చెల్లించాల్సిన వందల కోట్ల బకాయిలను సకాలంలో విడుదల చేయడం లేదు. దీనివల్ల సంస్థపై రోజువారీ నిర్వహణ భారం మరింత పెరిగి, పరోక్షంగా అది విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ పథకాలకు కార్మికుల హక్కులను బలిచేయడం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి.
​రాजకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, విశ్రాంతి వేతనాలు ప్రతి ఏటా సకాలంలో పెరుగుతుంటే, సమాజ గమనానికి రక్తాన్ని ధారపోసిన ఆర్టీసీ కార్మికుల నిధులు, బకాయిలు మాత్రం నిధుల కొరత సాకుతో నిలిపివేయడం పాలకుల ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఉన్నత న్యాయస్థానాలు సైతం ఈ వ్యవహారంపై స్పందించి విశ్రాంత ఉద్యోగుల విరమణ సొమ్మును తక్షణమే చెల్లించాలని, పెన్షన్ల విషయంలో ఆలస్యం చేయరాదని కఠినమైన తీర్పులు జారీ చేసినప్పటికీ, అధికారులు కాలయాపన చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. చట్టాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వాలే ఇలా ప్రవర్తిస్తే సామాన్యులకు దిక్కెవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది.
​ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం కాకుండా, మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ఒక ప్రత్యేక నిధిని లేదా బడ్జెట్‌ను కేటాయించాలి. పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బకాయిలను ఒకే విడతలో లేదా నిర్ణీత గడువులోగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాలి. వృద్ధాప్యంలో ఉన్న ఈ శ్రమజీవులను వీధుల పాలు చేయడం ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. తమ హక్కుల కోసం వారు చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటానికి సమాజంలోని అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. పాలకులు తమ మొండివైఖరిని వీడి, తక్షణమే ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లను నిబంధనల ప్రకారం నెరవేర్చి, వారి శేష జీవితానికి తగిన ఆర్థిక భరోసా కల్పించాలని, వారి కుటుంబాల్లో మళ్లీ ఆనందం నింపాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *