ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలి

– సీఎంఆర్ గడువునూ పొడిగించాలి
– రైతుల పక్షాన కేంద్ర మంత్రిని కలసిన రాష్ట్ర ప్రతినిధి బృందం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: తెలంగాణ రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రబీ 2025-26 సీజన్‌లో రికార్డు స్థాయిలో జరిగిన వరి కొనుగోళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సేకరణ లక్ష్యాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పెంచాలని, కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గడువులను పొడిగించాలని కోరుతూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ వినతిపత్రం అందజేశారు. సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంగళవారం ఉదయం దిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు ఒక్క గింజ కూడా నష్టపోకుండా కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 80.09 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించిందని, కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఖరీఫ్, రబీ కలిపి 2025-26 మార్కెటింగ్ సీజన్‌లో 152 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వరి సేకరణ జరిగి రిత్రాత్మక రికార్డు నమోదవగా రాష్ట్రం పంపిన ఉత్పత్తి అంచనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వరి సేకరణ లక్ష్యాలను తక్కువగా నిర్ధారించడం వల్ల రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని ఆయన వివరించారు. రబీ 2025-26 సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనాలు సమర్పించినప్పటికీ కేంద్రం 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (51.47 లక్షల మెట్రిక్ టన్నుల వరికి సమానం) మాత్రమే లక్ష్యంగా నిర్ణయించిందని మంత్రి తెలిపారు. అయితే రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర లక్ష్యాలను మించి కొనుగోళ్లు నిర్వహించిందన్నారు. గత మూడు సీజన్లలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి రాష్ట్రం 69.50 లక్షల మెట్రిక్ టన్నుల వరిని అదనంగా కొనుగోలు చేయాల్సి వచ్చిందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.16,446 కోట్ల అదనపు ఎంఎస్‌పీ భారం పడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తీవ్ర ఎండలు, హమాలీల కొరత, నిల్వ సామర్థ్య సమస్యలు, భారీగా వరి రాక, అకాల వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. రైతుల నుంచి వచ్చిన ప్రతీ గింజను కొనుగోలు చేసి వారి ఆదాయాన్ని కాపాడటంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. సీఎంఆర్ సరఫరా అంశంపై కూడా మంత్రి కేంద్ర దృష్టికి కీలక విషయాలను తీసుకెళ్లారు. రబీ 2024-25కు సంబంధించి ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, ఖరీఫ్ 2025-26కు సంబంధించి 14.24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్ర పూల్‌కు సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు. నిల్వ స్థలాల కొరత, ఒకేసారి పలు సీజన్ల కొనుగోళ్లు కొనసాగడం, మిల్లింగ్ సామర్థ్యాలపై ఒత్తిడి వంటి కారణాల వల్ల గడువులు పొడిగించాల్సిన అవసరం ఉందని కోరారు. రబీ 2024-25 సీఎంఆర్ సరఫరా గడువును మరో 60 రోజులు, ఖరీఫ్ 2025-26 గడువును 120 రోజులు పొడిగించాలని కేంద్రాన్ని మంత్రి కోరారు. అలాగే రబీ 2025-26 సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 54.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి పెంచాలని, అంటే ఇప్పటికే సేకరించిన 80.09 లక్షల మెట్రిక్ టన్నుల వరికి సమానమైన పరిమాణాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రబీ వరి ఎక్కువగా ఉప్పుడు బియ్యం తయారీకి అనుకూలంగా ఉండటంతో బాయిల్డ్ రైస్ రూపంలో సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. భవిష్యత్తులో ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయించే సేకరణ లక్ష్యాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే ఉత్పత్తి, కొనుగోలు అంచనాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి సూచించారు. పంటకు సకాలంలో మద్దతు ధర లభించాలంటే కేంద్ర లక్ష్యాలు, వాస్తవ ఉత్పత్తి పరిస్థితులు సమన్వయంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రైతు ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదని, రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర లభించేలా అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటాం అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *