నా బ‌ర్త్ ర‌ఫ్‌కు కార‌ణం ముఖ్య‌మంత్రే!

 – అధిష్టానానికి ఆ ఉద్దేశం లేదు
– ఉరితీసేవారికైనా చివరిమాట చెప్పుకునే అవకాశమిస్తారు
– నాకా అవ‌కాశం కూడా ఇవ్వ‌లేదు
– కొండా సురేఖ

        (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి)

తనను బర్త్ రఫ్ చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టుదలే కారణమ‌ని అధిష్టానానికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తాను రాజీనామా చేస్తానని అధిష్టానాన్ని బ్లాక్‌యిల్‌ చేశాడని రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ విరుచుకుపడ్డారు. మరణ శిక్ష విధించిన వారికైనా చివరి మాట చెప్పే అవకాశమిస్తారని, తన విషయంలో అలాంటి అవకాశాన్నికూడా అధిష్టానం ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు ఒకేచోట ఉన్నప్పటికీ తనను పిలిచి కూర్చోబెట్టి కనీసంగా మాట్లాడకపోవడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. ఇప్పటికీ తనను ఏ కారణంతో మంత్రిపదవినుండి బర్తరఫ్ చేశారన్నది అర్థం కావటంలేదన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రిని తాను ఒక్క మాటకూడా అనకున్నా షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో రెండు రోజులపాటు కాంగ్రెస్ అధిష్టానానికి తన బాధలు చెప్పుకున్న సురేఖ నిరాశతో వెనుతిరిగారు. ఢిల్లీ పరిణామాలపై ఆమె గురువారం వరంగల్‌లోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తనను మంత్రి వర్గంనుండి బహిష్కరించినట్లు వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. తనను బహిష్కరించినట్లు వైరల్ అవుతున్న లేఖలో ఎవరు, ఎవరికి రాసారన్న విషయం స్పష్టంగా లేదన్నారు. ఒక తెల్ల కాగితంపైన అయిదారు లైన్లు మాత్రమే ఉన్నాయన్నారు. అయితే తనతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కూడా బలి చేయడం సమంజసంకాదన్నారు. తనను తొలగించే క్రమంలో మరో ముగ్గురు మహిళలకు పదవులు కల్పించడంపైన స్పందిస్తూ తాను, తన భర్త సామాజిక వర్గానికి సంబందించిన వారికి పదవులుక ల్పించడంద్వారా కాంపెన్‌సేట్ చేయాలని ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా ఆమె పేర్కొన్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ తనపై వేటు వేయడాన్ని సవాల్‌ చేస్తూ అదే నిజమైతే అంతకు ముందు పార్టీని తూలనాడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సురేఖ ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటికి సారథ్యం వహిస్తున్న మల్లు రవి గతంలో కాంగ్రెస్‌ను తిట్టినవారేనన్నారు. జయపాల్‌రెడ్డి, రోశయ్యలు కూడా పార్టీపై కామెంట్ చేసినవారేనన్నారు. పిసీసీ అధ్యక్షుడిగా రూ50 కోట్లు ఇచ్చి రేవంత్‌రెడ్డి ఆ పదవి తెచ్చుకున్నాడన్న జగ్గారెడ్డి లాంటి వారిపైనా తీసుకోని చర్యలు కేవలం తనపైనే ఎందుకు చేపట్టినట్లని ఆమె నిలదీస్తున్నారు. పార్టీని గెలిపించుకునేందుకు తమ కాళ్ళు మొక్కి తమ జీపుల్లో ఎక్కినవారుకూడా తమను విమర్శించేవారైనారని కడిగిపారేశారు. ఈ సందర్భంగా తన కార్యాలయానికి సంబందించిన సుమంత్‌పై తప్పుడు కేసులు పెట్టిన విధానంపైన కూడా ఆమె స్పందించారు. ఎవరైతే డబ్బులు వసూలు చేసుకున్నారో వారే కేసు పెట్టారని, తమ మనషులను కావాలని ఇలానే ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ సుమంత్‌పై పెట్టిన కేసును వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

సీఎం నిర్ణయాలతో పార్టీలో ఎవరూ సంతోషంగా లేరు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న సొంత‌ నిర్ణయాలతో పార్టీలో ఎవరూ సంతోషంగా లేరన్నారు సురేఖ. మంత్రులు కూడా పాలనలో ఇబ్బందులకు గురవుతున్నారని, ఎవరూ నోరు తెరిచి చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. సంతోషంగాలేని మంత్రులు బయటికి వచ్చి తమ బాధలను చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రజల సమస్యలను వినడానికి వారికి సమయం లేదు. ప్రజలిచ్చే పిటీషన్ తీసుకునేవారుండరు. ఒక వేళ తీసుకున్నా అది ఎటు పోతుందో తెలియని పరిస్థితి. ఎదుటివారివైపు ఒక వేలెత్తి చూపితే నాలుగు వేళ్ళు మనవైపు చూపుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అందుకే ప్రభుత్వం తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నదన్నారు. ప్రజలు వ్యతిరేకించక ముందే వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి హితవు పలికారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగడం, పార్టీకి, శాసనసభ స‌భ్యత్వానికి రాజీనామా చేసే విషయంలో ఆమె స్పష్టత ఇవ్వలేదు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *