విలువ కోల్పోతున్న ప్రజా తీర్పు..!

“భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అసలు సవాలు ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది అనేది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వరకు మాత్రమే పరిమితమా? లేక ఆ ఐదేళ్ల కాలమంతా గౌరవించబడుతుందా? అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ కలిసి విశ్వసనీయమైన సమాధానం ఇవ్వగలిగితేనే ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది. లేకపోతే ఎన్నికలు ప్రజా సంకల్పానికి ప్రతీక కాకుండా, రాజకీయ సమీకరణాలకు ప్రారంభ ఘట్టంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.”

భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజల తీర్పును వెల్లడించే అత్యున్నత ప్రక్రియ. కానీ ఎన్నికలు ముగిసిన కొద్ది నెలల్లోనే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం ఒక కొత్త రాజకీయ సంస్కృతిగా మారుతోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు పార్టీని వీడిన తాజా పరిణామం ఈ చర్చను మరోసారి ముందుకు తెచ్చింది. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అలాంటి అవకాశాలను తోసిపుచ్చినప్పటికీ, రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలు చూస్తే కేవలం ఖండనలతో అనుమానాలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు.

గత కొన్నేళ్లుగా…ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో మొదటి సారి భారతీయ జనతా పార్టీ  అధికారం చేపట్టిన తరువాత   దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తోంది. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులకు అవకాశం ఇస్తే, ఎన్నికల అనంతరం ఆ శక్తులను క్రమంగా బలహీనపరచే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాంతీయ పార్టీల ను నిర్వీర్యం చేసే నియంతృత్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది . రాష్ట్ర ప్రభుత్వాల పతనం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల వరకు జరిగిన అనేక సంఘటనలు ఈ ప్రశ్నను మరింత బలంగా లేవనెత్తుతున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయమా? లేక అధికార సమీకరణాలను శాశ్వతంగా మార్చే విస్తృత వ్యూహమా? అనే సందేహాలు సహజంగానే తలెత్తుతున్నాయి.

రాజకీయ విశ్లేషకులలో కొందరు మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నారు. రాబోయే కాలంలో డిలిమిటేషన్, “ఒకే దేశం–ఒకే ఎన్నిక” వంటి కీలక చట్టాలను సాఫీగా ఆమోదింపజేసేందుకు పార్లమెంట్‌లో సంఖ్యాబలం మరింత బలోపేతం చేయాలనే రాజకీయ లక్ష్యం ఉండవొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది.

అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఫిరాయింపులు పెరిగిన ప్రతిసారి బలహీనపడేది ప్రతిపక్షం మాత్రమే కాదు—ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం కూడా. వోటరు ఒక పార్టీ సిద్ధాంతం, ఎన్నికల హామీలు, నాయకత్వాన్ని విశ్వసించి వోటు వేస్తాడు. ఎన్నికల తర్వాత అదే ప్రజాప్రతినిధి వేరే రాజకీయ శిబిరంలో కనిపిస్తే, అది ప్రజల తీర్పుకు గౌరవం ఇచ్చినట్టా? లేక వారి వోటును రాజకీయ లావాదేవీగా మార్చినట్టా? అనే ప్రశ్నకు ఇప్పటికీ సంతృప్తికర సమాధానం లేదు.

ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నప్పటికీ, దాని చుట్టూ ఏర్పడిన చట్టపరమైన మార్గాలు ప్రజా తీర్పును రక్షించడంలో పూర్తిస్థాయిలో విజయవంతం కాలేకపోతున్నాయి. రాజీనామాలు, విలీనాలు, శాసనసభాపక్షాల విభజనలు—ఇవన్నీ చట్టం ఉద్దేశాన్ని బలహీనపరుస్తున్నాయనే విమర్శలు తరచుగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఫిరాయింపు చేసిన ప్రజాప్రతినిధి తప్పనిసరిగా మళ్లీ ప్రజల తీర్పు కోరే విధంగా చట్టాలను మరింత కఠినతరం చేయాలన్న డిమాండ్‌కు బలం చేకూరుతోంది.

ప్రజాస్వామ్యంలో అధికార పక్షం బలంగా ఉండటం తప్పు కాదు. అలాగే బలమైన ప్రతిపక్షం ఉండటం కూడా ప్రజాస్వామ్యానికి అంతే అవసరం. ప్రతిపక్షాన్ని ఎన్నికల బరిలో ఓడించడం ప్రజాస్వామ్య విజయం; కానీ ఎన్నికల తర్వాత రాజకీయ వలసల ద్వారా బలహీనపరచడం ప్రజాస్వామ్య ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ప్రజల తీర్పును గౌరవించే రాజకీయ సంస్కృతి లేకపోతే ఎన్నికల ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోతుంది.

చివరికి భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అసలు సవాలు ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది అనేది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వరకు మాత్రమే పరిమితమా? లేక ఆ ఐదేళ్ల కాలమంతా గౌరవించబడుతుందా? అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ కలిసి విశ్వసనీయమైన సమాధానం ఇవ్వగలిగితేనే ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది. లేకపోతే ఎన్నికలు ప్రజా సంకల్పానికి ప్రతీక కాకుండా, రాజకీయ సమీకరణాలకు ప్రారంభ ఘట్టంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

-ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *