– అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
– మంత్రులు ఉత్తమ్, తుమ్మల, ఉన్నతాధికారులతో సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఇరిగేషన్ ఇంజనీర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ని ఎంత ఎత్తున నిర్మించాలి, ఎంత ఎత్తు నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుంది అనే అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీద ఇప్పటికే ప్రభుత్వం దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, కొన్నిచోట్ల కాల్వల నిర్మాణం కూడా జరిగిందని, ఇప్పటికే 71.5 కి.మీ కెనాల్ వర్క్ జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని సూచించారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలన్నిటినీ సద్వినియోగం చేసుకునేందుకు 150 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మించాలని నిపుణులు సూచించారు. గతంలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు అంగీకరించిందని, 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుందని మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తీసుకునే వీలుందని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు. ఈ బ్యారేజ్ నిర్మాణం చేపడితే ఆదిలాబాద్‌తోపాటు రాష్ట్రంలో మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగు నీరు అందుతుందని, తక్కువ ఖర్చుతో గ్రావిటీపై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తెచ్చుకునే వీలుంటుందని సీఎం చెప్పారు. ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌కు ìసూచించారు. సమీక్షా సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకుని నేరుగా కలిసి చర్చించే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్‌కు అప్పగించారు. కాగా, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, వర్షాలు పడేలోపు పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఈఎన్సీ శ్రీధర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




