తెలంగాణా హై కోర్ట్ 22-ఎ కింద నిషేధిత భూముల జాబితాలో వ్యవసాయ భూములను చేర్చడంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించడమే కాదు, పారదర్శకత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను నిలిపివేయడంపై వివరణ కోరడం తాజా పరిణామం. ఇదే సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికారుల తప్పుల వల్ల భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ అంశంపై సమీక్ష జరిపారు. తప్పుగా 22-ఏ జాబితాలో చేరిన ప్రైవేట్ భూములను కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో పరిశీలించి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బాధితులు రెవెన్యూ లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పాత పత్రాలు, కోర్టు ఆర్డర్లు సమర్పిస్తే వెంటనే రికార్డులు సవరిస్తామని తెలిపారు. “ప్రభుత్వ రికార్డులో ఒక్క తప్పుకు భూయజమాని శిక్ష అనుభవించాలా…?”. ధరణి నుంచి భూ భారతి వరకు పోర్టల్ పేరు మారడమే తప్ప భూయాజమాన్య సమస్యలుపరిష్కారం కాలేదు ; తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చిన భూమికి బాధ్యత ఎవరిది, బాధితుడికి నష్టపరిహారం/ ఆటోమేటిక్ కరెక్షన్ ఎందుకు ఉండకూడదు ? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు!
దశాబ్దాలుగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్లతో, మ్యుటేషన్లతో కొనుగోలు చేసి నివసిస్తున్న ఇళ్లు, ప్లాట్లు ఒకే ఒక్క ప్రభుత్వ ‘డిజిటల్’ పెన్ను పోటుతో రాత్రికి రాత్రే క్రయవిక్రయాలకు పనికిరాని నిషేధిత ఆస్తులుగా మారిపోతే ఆ యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం సహజం. ప్రస్తుతం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగర పరిసర ప్రాంతాల్లో ‘సెక్షన్ 22-ఏ’ చుట్టూ ముసురుకున్న వివాదం సరిగ్గా ఇలాంటి తీవ్ర ఆందోళననే రేకెత్తిస్తున్నది . ప్రభుత్వ భూములను, వక్ఫ్, ఎండోమెంట్ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ఉద్దేశించిన ఈ చట్ట నిబంధన, క్షేత్రస్థాయి అధికారుల ఏకపక్ష వైఖరి ,సాంకేతిక లోపాల వల్ల వేలాది మంది అమాయక ప్రైవేటు ఆస్తిపరుల పాలిట శాపంగా మారడం దురదృష్టకరం.
కూకట్‌పల్లి, మియాపూర్, బంజారాహిల్స్, మల్కాజ్గిరి వంటి కీలక ప్రాంతాల్లో అప్పటి హుడా , హెచ్ఎండీఏ లేదా హౌసింగ్ బోర్డుల ద్వారా పక్కా అనుమతులతో కొనుగోలు చేసిన భూములు, ఇళ్లు కూడా ఇప్పుడు 22-ఏ నిషిద్ధ జాబితాలోకి ఎక్కడం విస్మయం కలిగిస్తున్నది . మూల సర్వే నంబర్లలోని ప్రభుత్వ లేదా వివాదాస్పద భూములతో పాటు, అదే సర్వే నంబర్ల పరిధిలో దశాబ్దాల క్రితమే క్రమబద్ధీకరణ పొందిన ప్రైవేటు భూములను కూడా అధికారులు గుడ్డిగా ఒకే పట్టీలో చేర్చడం వల్లే ఈ అస్తవ్యస్త పరిస్థితి తలెత్తింది. ఈ నిర్వాకం వల్ల అత్యవసరాలకు ఇల్లు లేదా స్థలాన్ని అమ్ముకుందామ నుకున్న సగటు జీవికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిరాశే ఎదురవుతున్నది ; బ్యాంకులు కూడా రుణాలిచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఒక రకంగా ఇది పౌరుల ఆస్తి హక్కులను కాలరాయడమే.
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారుల పొరపాట్లను అంగీకరిస్తూ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పడం, క్లయిమ్‌ల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ (1800 599 4788) ఏర్పాటు చేయడం ప్రభుత్వం తీసుకున్న ఒక సానుకూల చర్యే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రైవేటు పట్టా భూములకు సంబంధించిన చిక్కులను రెండు రోజుల్లోనే పరిష్కరించాలని కఠిన ఆదేశాలు జారీ చేయడం కొద్దిగా ఊరటనిచ్చే అంశం. అయినప్పటికీ, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చిన తర్వాత 22-ఏ జాబితాలో కొత్తగా ఏయే సర్వే నంబర్లను చేర్చారో స్పష్టం చేస్తూ ఒక ‘శ్వేతపత్రం’ విడుదల చేస్తే పారదర్శకత పెరుగుతుంది.
ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ సాకుతో ‘తప్పుల తడక’ ఆన్‌లైన్ డేటాను నమ్ముకుని సామాన్యులను ఆఫీసుల చుట్టూ తిప్పడం సరికాదు. కేవలం ఉన్నతాధికారుల కమిటీల ఏర్పాటుకే పరిమితం కాకుండా, ప్రతి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు, ప్రభుత్వ సరిహద్దులను స్పష్టంగా విభజించే ‘డిజిటల్ మ్యాపింగ్’ వ్యవస్థను త్వరగా పూర్తి చేయాలి. పాలకులు, అధికారులు తాత్కాలిక ఉపశమనాలు కాకుండా.. 22-ఏ భూముల సమస్యకు ఒక శాశ్వత, పారదర్శక పరిష్కారాన్ని చూపి ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
ధరణి పోర్టల్ తప్పులను సరిదిద్దుతామని అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 22-ఏ వివాదంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టిందనే విమర్శలను మూటగట్టుకున్నది . రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వొచ్చే ఆదాయానికి గండి పడటమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిని కేవలం సాంకేతిక లోపంగా కొట్టిపారేయలేం; క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా, కేవలం వెబ్‌సైట్ అప్‌డేట్ల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో ఈ ఘటనే నిదర్శనం. కాబట్టి, ప్రభుత్వం రాజకీయ బుజ్జగింపులకే పరిమితం కాకుండా, బాధితులకు నష్టపరిహారం చెల్లింపు లేదా ఇబ్బంది కలగకుండా తక్షణమే ఈ లింక్‌ను పూర్తిగా తొలగించడమే ఏకైక మార్గం.
ఈ వివాదం కేవలం పరిపాలనా లోపంగానే కాకుండా, రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని కాంగ్రెస్ చెబుతుంటే, ప్రస్తుత ప్రభుత్వమే కావాలని కక్షసాధింపు చర్యల్లో భాగంగా కీలకమైన ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలోకి నెట్టిందంటూ బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది . ఈ రాజకీయ ప్రతీకారాల మధ్య సగటు ల్యాండ్ పూలింగ్ బాధితులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు నలిగిపోతున్నారు. భూ గందరగోళాల కారణంగా ఇప్పటికే మార్కెట్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం మందగించింది.
ఇలాంటి సున్నితమైన అంశాలలో ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రత్యేక అదాలత్లను నిర్వహించాల్సిన అవసరం ఉంది. తప్పుగా 22-ఏ లో చేర్చిన భూములను గుర్తించి, వాటిని తక్షణమే సాధారణ రిజిస్ట్రేషన్ల పరిధిలోకి తీసుకురావడానికి ఒక నిర్దిష్ట కాలపరిమితిని విధించుకోవాలి. అప్పుడే ప్రజల్లో పరిపాలనపై విశ్వసనీయత పెరుగుతుంది, అటు రియల్ ఎస్టేట్ రంగం కూడా తిరిగి కోలుకుంటది..





