-రిజర్వ్, నాన్ రిజర్వ్ కేటగిరీల నమోదు వుండదు
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, జూన్5: కేంద్ర ప్రభుత్వం 2027 లో జనగణనతో పాటు చేపట్టే కులగణనలో, కీలకాంశమేమంటే, కేవలం వ్యక్తుల కులం గురించి మాత్రమే తెలుసుకొని నమోదు చేస్తారు తప్ప, వారి సామాజిక వర్గం అంటే ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వివరాలు నమోదు చేయబోరని తెలుస్తోంది. దీనివల్ల దేశంలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారి జనసంఖ్య ఎంత అన్నదీ తెలియదు. కేంద్రం కులం నమోదుకు మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నదనడానికి కొన్ని కారణాలు చూపుతున్నారు. ముఖ్యంగా ఒక రాష్ట్రంలో ఓబీసీ కిందికి వచ్చేకులం మరో రాష్ట్రంలో జనరల్ కేటగిరీలో వుండటం వంటి వ్యత్యాసాలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం కులం నమోదుకు మాత్రమే పరిమితమవుతుందంటున్నారు.
కులగణన సందర్భంగా ప్రతి వ్యక్తి తన కులం, మతం వివరాలు చెప్పాల్సి వుంటుంది. అయితే ఈవిధంగా కులం వివరాలు నమోదు చేసే సమయంలో, వ్యక్తులు చెప్పే వివరాలు కచ్చితంగా వున్నాయా? లేదా అని నిర్ధారించుకునేందుకు ఒక స్పష్టమైన యంత్రాంగం ఏమీ లేదన్న వాస్తవాన్ని అధికార్లు అంగీకరిస్తున్నారు. అందువల్ల కులం ఆధారంగా కల్పించే రిజర్వేషన్లకు ప్రాతిపదికగా, ప్రభుత్వం జారీచేసే కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం కొనసాగుతుంది. కులగణనలో కులం మాత్రం నమోదు చేస్తారు.
తప్ప ఇవి రిజర్వ్ కేటగిరీ కిందికి వస్తాయా లేక నాన్ రిజర్వ్ కేటగిరీకిందికి వస్తాయా అనే అంశాలను నమోదు చేయబోరని ఇండియా టుడే పేర్కొంది. అంతేకాదు 2011 జనగణన ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ ప్రకియపై ఈ కులగణన ప్రభావం ఎంతమాత్రం వుండబోదని అధికారవర్గాలు స్పష్టం చేసాయి. జమ్ము-కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి శీతల రాష్ట్రాల్లో ఈ ప్రకియ 2026 అక్టోబర్ 1నుంచి ప్రారంభిస్తారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2027 మార్చి 1 నుంచి చేపట్టే కులగణన ప్రకియ రెండు దశల్లో కొనసాగుతుంది. ఈ గణాంకాలను డిజిటల్ మోడ్‌లోనే నమోదు చేస్తారు. ఈ ప్రకియ మూడేళ్లపాటు కొనసాగుతుంది.