న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 5: కర్బన ఉద్గారాలు మొదలు, ప్లాస్టిక్ వాడకం సహా అనేక కాలుష్య కారకాలను తగ్గించుకుంటూనే చెట్ల పెంపకానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, పర్యావరవరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన పలువురు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వారిని శాలువాలతో సన్మానించారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గురించి వారికి వివరించారు.అనంతరం విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకుని వాటిని సాధించే వరకు పట్టు విడవకుండా నిరంతరం కృషి చేయాలని కోరారు. పర్యావరాణాన్ని కాపాడుతూ.. క్షేత్రస్థాయిలో ఎంతో మంది పుడమి తల్లికి సేవ చేస్తున్నారని, వారందరి నుంచి మనమంతా స్ఫూర్తిని పొందవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.