– నగరాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్
– 30 ఏళ్లకే ప్రమాద సంకేతాలు
– ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల్లో అధిక ప్రభావం
– పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం భవిష్యత్తుకు హెచ్చరిక
– పూర్తి స్క్రీనింగ్, ఫైబ్రోస్కాన్‌తో ముందస్తు గుర్తింపు కీలకం
– కేర్ హాస్పిటల్స్ వైద్యుల వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: నగర జీవనశైలిలో వచ్చిన మార్పులు ఒక నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తున్నాయి. అంచనాల ప్రకారం నగరాల్లో నివసించే ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వృద్ధుల్లో కనిపించిన ఈ సమస్య, ఇప్పుడు 30 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు వారిలో వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ లివర్ డే సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైద్యులు ఈ అంశంపై పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇది కేవలం వైద్య సమస్య కాదు, జీవనశైలిలో వచ్చిన మార్పుల ప్రతిబింబం. రోజుకు గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు, అసమయ భోజనం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఇవి అన్నీ కలిసి లివర్‌పై మెల్లగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. షుగర్, అధిక బరువు, బీపీ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది,” అని కేర్ హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రామ్‌సాగర్ విద్యాసాగర్ తెలిపారు.
లివర్ వ్యాధుల అసలు ప్రమాదం వాటి ‘నిశ్శబ్ద స్వభావం’
లివర్ వ్యాధుల అసలు ప్రమాదం వాటి “నిశ్శబ్ద స్వభావం”. ప్రారంభ దశలో ఎలాంటి నొప్పి, ఇబ్బంది కనిపించదు. చాలా సందర్భాల్లో సాధారణ హెల్త్ చెక్‌ప్‌లో లేదా ఇతర సమస్యల కోసం చేసిన పరీక్షల్లోనే లివర్ డ్యామేజ్ బయటపడుతోంది. కొందరు చిన్న సమస్యతో ఆసుపత్రికి వచ్చి, పెద్ద లివర్ సమస్యతో బయటపడుతున్నారు. మరికొందరు పరిస్థితి తీవ్రమైన దశకు చేరిన తర్వాతే వస్తున్నారు, అప్పుడు సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్ వంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. చికిత్స క్లిష్టమవుతుంది, ఖర్చు పెరుగుతుంది. “మా దగ్గరకు వచ్చే చాలా మంది రోగులకు ముందుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ పరీక్షల్లో అడ్వాన్స్‌డ్ లివర్ డ్యామేజ్ బయటపడుతోంది. కేవలం లివర్ ఫంక్షన్ టెస్ట్ మాత్రమే సరిపోదు, పూర్తి స్థాయి పరీక్షలు అవసరం. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, అవసరమైతే ఫైబ్రోస్కాన్ ద్వారా లివర్‌లో కొవ్వు, గట్టితనం అంచనా వేయాలి. ప్రారంభ దశలో గుర్తిస్తే ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను నియంత్రించవచ్చు, కొన్ని సందర్భాల్లో పూర్తిగా తగ్గించవచ్చు. కానీ ఆలస్యమైతే పరిస్థితి తీవ్రమై ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కూడా రావచ్చు,” అని కేర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ – హెపటోబిలియరీ & లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ సోనల్ అస్తనా తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కేర్ హాస్పిటల్స్ సమగ్ర వైద్య విధానాన్ని అమలు చేస్తోంది. గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ, క్రిటికల్ కేర్, ట్రాన్స్‌ప్లాంట్ విభాగాలు కలిసి రోగిని ప్రారంభ దశ నుంచే గుర్తించి చికిత్స అందించే విధంగా వ్యవస్థను రూపొందించారు. ముందస్తు గుర్తింపు, సమయానికి చికిత్స, జీవనశైలి మార్పులు, ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వైద్యులు చెబుతున్నారు.
ఏటా లివర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి
“30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా షుగర్ లేదా కూర్చునే జీవనశైలి ఉన్నవారు ఏటా లివర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అలసట, ఆకలి లేకపోవడం, అనూహ్యంగా బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. చాలా మంది స్వయంగా మందులు తీసుకోవడం, సప్లిమెంట్స్ అధికంగా వాడటం కూడా లివర్‌పై ప్రభావం చూపుతోంది. వైద్యుల సలహా లేకుండా దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కూడా లివర్ డ్యామేజ్ వచ్చే ప్రమాదం ఉంది. ఊబకాయం ఉన్నవారు ప్రత్యేకంగా రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం,” అని సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కుమార స్వామి సూచించారు. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చిన్న మార్పులే చాలనేది వైద్యుల సూచన. సమయానికి ఆహారం తీసుకోవడం, తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకోవడం రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, అవసరం లేని మందులు వాడకపోవడం, మద్యం మితంగా తీసుకోవడం వంటి అలవాట్లు లివర్‌పై ఒత్తిడిని తగ్గిస్తాయి. కార్యాలయాల్లో పనిచేసే వారు ప్రతి గంటకోసారి లేచి కాస్త నడవడం, రోజువారీ జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం కూడా దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





