– లౌకికవాదం కోసం తమిళ ప్రజలు ముందుంటారు
– ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చెన్నై, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ నాయకత్వంలోని కూటమి తమిళనాడులో తిరిగి మంచి మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లా షోలింగేర్ సర్కిల్ సమీపంలోని పండియానల్లుర్ లో శనివారం ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ సభలో ఆయన పాల్గొన్నారు. సభకు ముందు రాణిపేట జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ప్రసంగించారు. లౌకిక వాదాన్ని బలోపేతం చేయడంలో, సంరక్షించడంలో తమిళనాడు ప్రజలు ముందుంటారని తెలిపారు. వీరగడ్డకు, ఆత్మగౌరవానికి తమిళనాడు మారుపేరు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని తపించే ఒక సామాన్య కార్యకర్తగా మీ అందరి ముందుకు వచ్చానని డిప్యూటీ సీఎం తెలిపారు. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు.. అదొక సిద్ధాంతం. పెరియార్, అన్నాదురై, కలైంజర్ కరుణానిధి వంటి గొప్ప నేతలు ఇక్కడ సామాజిక న్యాయానికి పునాది వేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం దిల్లీ పీఠంపై కూర్చున్న పెద్దలు తమిళనాడు సంస్కృతిని, భాషను, హక్కులను కాల రాయాలని చూస్తున్నారని, వారిని ఎదుర్కోవాలి అంటే సెక్యులర్ శక్తుల ఐక్యత అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు అభివృద్ధి పథంలోకి దూసుకుపోతోందని, రాహుల్ గాంధీ ప్రేమ సందేశం.. స్టాలిన్ అభివృద్ధి నినాదం ఒకటి అయ్యాయి.. డీఎంకే కూటమి గెలుపు కేవలం తమిళనాడుకే కాదు దేశానికి దిక్సూచిగా మారబోతోంది అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.2 లక్షల వరకు ఒకేసారి రైతులకు రుణ మాఫీ, తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం వంటి హామీలను అమలు చేసి చూపించామని వివరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమిళ ప్రజలు వేసే ఓటు కేవలం ఒక గుర్తుపై వేసే ముద్ర కాదు.. అది విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వేసే ఓటు.. అది నియంతృత్వానికి వ్యతిరేకంగా వినిపించే ప్రజాస్వామ్య గొంతుక అని అన్నారు. మరోసారి తమిళనాడు తన ఆత్మ గౌరవాన్ని చాటుకోవాలన్నారు. ఇక్కడ విద్వేషానికి చోటు లేదు.. కేవలం ప్రేమ, సమధర్మానికి మాత్రమే చోటు ఉందని నిరూపించాలి.. డీఎంకే కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని భట్టి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





