ఆవిర్భావ దిన సంబరాల వేళ‌ విరుద్ధ చిత్రాలు

ఒక తెలంగాణ ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కొత్త విశ్వవిద్యాలయాలను నిర్మిస్తోంది. అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించే యువతను తయారు చేస్తోంది. అభివృద్ది చేస్తాం రైతుల భూములు ఇవ్వాలంటుంది. మరో తెలంగాణ కనీస వేతనాల కోసం పోరాడుతోంది. రైతులు తమ భూములను కాపాడుకునేందుకు రోడ్లపైకి వస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుల ఖర్చులతో కృంగిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాల కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రధానోపాధ్యాయులు న్యాయం కోసం నిరసనలకు దిగుతున్నారు. ఆవిర్భావ దినోత్సవం కేవలం సంబరాల రోజు మాత్రమే కాదు. ఆత్మపరిశీలన చేసుకునే రోజు కూడా.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో రాష్ట్రం సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం సహజం. మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగం, పరిశ్రమలు, వ్యవసాయం ఉన్నత విద్య వంటి అనేక రంగాల్లో తెలంగాణ విశేష పురోగతి సాధించింది. అయితే, ఒకే రోజు మే నెల 30 న జరిగిన కొన్ని సంఘటనలను గమనిస్తే తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో ఉన్న కొన్ని గాఢమైన వైరుధ్యాలు కూడా మన ముందుకు వస్తాయి.

గురుకుల పాఠశాలల సపోర్ట్ స్టాఫ్ ఆందోళన

ఒకవైపు రెసిడెన్షియల్ మైనారిటీ గురుకుల పాఠశాలల సపోర్ట్ స్టాఫ్ కనీస వేతనాల కోసం ఆందోళన చేస్తున్నారు. వారిలో చాలామంది నెలకు కేవలం రూ.6,000 మాత్రమే పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది అట్టడుగు వర్గాలకు చెందినవారే. తాము చేస్తున్న పని పరిస్థితులు 1975లో రద్దు చేసిన వెట్టి చాకిరిని తలపిస్తున్నాయని వారు వాపోతున్నారు.

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం పొందిన యువత

మరోవైపు ముఖ్యమంత్రి, ఇటీవల స్థాపించబడిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చెందిన ఒక యువకిశోరాం  మైక్రోసాఫ్ట్‌లో సంవత్సరానికి రూ.7 లక్షల వేతనంతో ఉద్యోగం పొందిన విషయాన్ని గర్వంగా ప్రకటించారు. ఇది తెలంగాణ యువత సామర్థ్యానికి, అవకాశాలకు ప్రతీకగా నిలిచే విజయగాథ. అందరికీ అందాలనే ఆశ కూడా.

భూముల కోసం ధర్నా చౌక లో యాచారం రైతుల ఆందోళన

ఇందిరాపార్క్ ధర్నా  చౌక్ వద్ద రైతులు ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ పేరుతో తమ భూములను స్వాధీనం చేసుకోవద్దని ఆందోళన చేస్తున్నారు. ఎకరాకు లక్షల రూపాయల పరిహారం ప్రకటించినా, భూమి కోల్పోవడం అంటే జీవనాధారం, భవిష్యత్, భద్రత, మహిళలైతే   గౌరవం కోల్పోవడమేనని అంటున్నారు.

 ప్రభుత్వ భూములకు కోట్ల విలువ

అదే సమయంలో ప్రభుత్వం తన భూములను ఎకరాకు రూ.273 కోట్లకు వేలం వేస్తోంది. రైతు భూమికి ఒక విలువ, ప్రభుత్వ భూమికి మరో విలువ అనే ప్రశ్న సహజంగానే ప్రజల మనసుల్లో తలెత్తుతోంది.

ప్రైవేట్ పాఠశాలల ఫీజులతో తల్లిదండ్రుల ఆందోళన 

రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారంతో సతమతమవుతున్నారు. నర్సరీ ప్రవేశాలకే కొన్ని పాఠశాలలు రూ.1.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని ఈ రోజే పత్రికా సమాచారం. దీనికి అదనంగా వార్షిక ఫీజులు, ఇతర రుసుములు వేరు. ఫీజుల నియంత్రణ కోసం తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరి కోరి అలసిపోతున్న సమయంలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రైవేటు పాఠశాల ప్రారంభం. ఇదే రోజున తెలంగాణ గవర్నర్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మొకిలాలో 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన క్వాంటమ్ స్కూల్ ను ప్రారంభించారు. జాతీయ, అంతర్జాతీయ పాఠ్య ప్రణాళికలను అందించే ఈ పాఠశాల కొత్త విద్యా అవకాశాలకు ప్రతీక అని ప్రకటన. అయితే ప్రభుత్వ పాఠశాలలు కనీస సదుపాయాల కోసం పోరాడుతుండగా ఇలాంటి విలాసవంతమైన విద్యా సంస్థల విస్తరణ  అతిధులుగా మంత్రులు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నార‌నేది ప్రశ్న.

శిధిలావస్థలో ఉన్న  పాఠశాల భవనం కోసం కోర్టుకు వెళ్లిన తల్లిదండ్రులు

ఇంకో వైపు, తమ పిల్లల కోసం కొత్త పాఠశాల భవనం నిర్మించాలని కోరుతూ పది మంది తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల శిథిలావస్థలో ఉందని వారు వాదిస్తున్నారు. కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

21 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ప్రధానోపాధ్యాయులు

అదే రోజున ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా ధర్నా  చౌక్ వద్ద ఆందోళన చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నామని వారు చెబుతున్నారు. ఒకవైపు ప్రధానోపాధ్యాయులుగా, మరోవైపు విద్యాశాఖ పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆందోళన లో తెలంగాణ  పెద్ద పంతుళ్ళు పంతులమ్మలు.

తెలంగాణ ముందున్న ప్రశ్న

ఈ సంఘటనలు వేర్వేరు అంశాలు కావు. ఇవి రెండు తెలంగాణల చిత్రాన్ని చూపుతున్నాయి. ఒక తెలంగాణ ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కొత్త విశ్వవిద్యాలయాలను నిర్మిస్తోంది. అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించే యువతను తయారు చేస్తోంది. అభివృద్ది చేస్తాం రైతుల భూములు ఇవ్వాలంటుంది. మరో తెలంగాణ కనీస వేతనాల కోసం పోరాడుతోంది. రైతులు తమ భూములను కాపాడుకునేందుకు రోడ్లపైకి వస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుల ఖర్చులతో కృంగిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాల కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రధానోపాధ్యాయులు న్యాయం కోసం నిరసనలకు దిగుతున్నారు. ఆవిర్భావ దినోత్సవం కేవలం సంబరాల రోజు మాత్రమే కాదు. ఆత్మపరిశీలన చేసుకునే రోజు కూడా. తెలంగాణ అభివృద్ధి యొక్క అసలు కొలమానం ఎన్ని ఆకాశహర్మ్యాలు నిర్మించామన్నది కాదు; ఎన్ని పరిశ్రమలు తెచ్చామన్నది కాదు. ఆ అభివృద్ధి ఫలాలు నెలకు రూ.6,000 సంపాదించే కార్మికుడికి, తన భూమి కోసం పోరాడుతున్న రైతుకు, పిల్లల చదువు కోసం ఆందోళన చెందుతున్న తల్లిదండ్రికి, పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ప్రధానోపాధ్యాయులకు  చేరాయా లేదా అన్నదే అసలు ప్రశ్న. సంబరాలు నిజమే. విజయాలు కూడా నిజమే. అయితే ఈ వైరుధ్యాలు కూడా అంతే నిజం.

ఆర్. వెంకట్ రెడ్డి

జాతీయ కన్వీనర్ఎం.వి. ఫౌండేషన్


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *