- 18 బాధిత కుటుంబాలకు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సహాయం
- ప్రతి కుటుంబానికి జీవనోపాధి ఏర్పాటుకు రూ.40 వేల డిపాజిట్
- బాధితులు నిరాశకు లోను కావొద్దు
- రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్, కొండల్ రెడ్డి
తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సహాయం అందించి వారి జీవనోపాధికి తోడ్పడే కార్యక్రమం రూరల్ డెవలప్మెంట్ సర్విస్ సొసైటీ(ఆర్.డి.ఎస్.ఎస్.) సంస్థ చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం తార్నాకలోని సెయింట్ ఆన్స్ జెనరలేట్ లో ‘రైతు ఆత్మహత్య బాధితులతో సంఘీభావ కార్యక్రమం’ ఏర్పాటు చేసి 18 బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబ సభ్యులు పాల్గొని వ్యవసాయ సమస్యలతో ఏ విధంగా రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వొచ్చింది, ఆ తర్వాత వారి కుటుంబం ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో వివరించారు. వొచ్చిన వారందరూ కౌలుకు భూమి తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నవారే..
కౌలు రైతులకు ఏ ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో అప్పుల పాలవడం, ప్రకృతి అనుకూలించక పంట నష్టపోవడం, పంట బీమా లేకపోవడం తదితర కారణాలు తెలిపారు. అత్యంత విషాదకరమైన కథలతో పాటు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. 11 జిల్లాల నుంచి (జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, పెద్దపల్లి, కుమరం భీమ్ ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్) నుంచి కుటుంబాలు వొచ్చాయి. ప్రతి కుటుంబానికి జీవనోపాధి ఏర్పాటుకు రూ.40 వేలు వారి అకౌంట్ లో డిపాజిట్ చేశారు. ఈ సహాయంతో కొందరు మేకలు, గొర్రెలు కొనుక్కుంటామని, కొందరు బర్రెలు కొనుక్కొని పాలు అమ్ముకుంటామని, కొందరు కిరాణా షాప్ పెట్టుకుంటామని లేదా కుట్టు మిషన్ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు.
ఆర్థికసాయంతో ప్రగతిపథంలోకి..
ఈ కుటుంబాలకు స్ఫూర్తిగా గతంలో 2015లో రైతు ఆత్మహత్య బాధితురాలు మంజుల తనకు లభించిన రూ.30 వేల సహాయంతో తాను చిన్న దుకాణం పెట్టుకొని, కుట్టు మిషన్ కొనుక్కున్నాను అని తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు 40 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, ఒక జ్యూట్ సంచులు కుట్టే టైలరింగ్ యూనిట్ ను, ఒక కేటరింగ్ సర్వీస్ ను నడిపే స్థాయికి వొచ్చినట్లు వివరించారు. ఒంటరి మహిళగా ధైర్యంగా ఉండి, కృషి చేస్తే ఏదైనా సాధించుకోవచ్చని చెప్పారు.
ఈ సహాయానికి నిధులను అసోసియేషన్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్(ఎయిడ్) సంస్థ వారు అందించారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులతో ఏర్పాటు అయిన ఎయిడ్ సంస్థలో వలంటీర్లు థాంక్స్ గివింగ్ పండగ సందర్భంగా ‘రైతులకు కృతజ్ఞత తెలుపుదాం’ అని కాంపైన్ నిర్వహించి నిధులు సేకరించినట్లు నిర్వాహకులు వివరించారు.
నిరాశ నిస్పృహలకు లోను కావొద్దు..
రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు అందవలసిన ఆరులక్షల ఎక్స్ గ్రేషియా అందరికీ లభించే విధంగా తాము చేస్తున్న కృషిని వివరించి, ఇటీవల కోర్టు కేసు ద్వారా 141 బాధిత కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున నిధులు విడుదల కావడం వెనక జరిగిన ప్రయత్నం గురించి తెలిపారు. ఇక్కడికి వచ్చిన కుటుంబాలన్నీటికీ కూడా ప్రభుత్వ సహాయం అందే విధంగా తాము ప్రయత్నిస్తామని ధైర్యం చెప్పారు. రైతు ఆత్మహత్య బాధితులు నిరాశ, నిస్పృహలకు లోను కావద్దని అన్నారు. ఏ సమస్య వచ్చినా తమను కుటుంబ సభ్యులుగా భావించి పంచుకోవాలని వక్తలు సూచించి ధైర్యం చెప్పారు. కార్యక్రమాన్ని రైతు ఆత్మహత్యల అంశంపై 18 ఏళ్లుగా పని చేస్తున్న బి.కొండల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఎస్.ఎస్. సంస్థ సెక్రటరీ గాడి శ్రీను, ఎం.వి.ఫౌండేషన్ నుండి ఆర్.వెంకట్ రెడ్డి, ప్రముఖ టీవి పాత్రికేయులు ఉమా సుధీర్, పిలుపు సంస్థ నుండి ఎం.జనార్ధన్, అమరేందర్, గ్రామ్య సంస్థ నుండి సుమలత, రైతు స్వరాజ్య వేదిక నుండి కన్నెగంటి రవి, విస్సా కిరణ్ కుమార్, నవీన్ రామిశెట్టి, ఎన్.శృతి, కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ తరఫున శ్రీహర్ష, భార్గవి, రమాకాంత్, రాకేశ్, షారూఖ్ తదితరులు, ఆర్.డి.ఎస్.ఎస్. తరఫున కె.నాగార్జున, ఉమా, నవనీత తదితరులు పాల్గొన్నారు.




