– బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ వ్యాఖ్యలపై ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆగ్రహం
న్యూదిల్లీ,ఆగస్ట్12: రాజ్యసభలో ‘లుంగీవాలా వ్యాఖ్యలు’ కలకలానికి దారి తీశాయి. బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ తనను లుంగీవాలా అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సీపీఐ (ఎమ్) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దక్షిణాది వ్యక్తిగా తన ఆహార్యం తనకు ఎంతో గర్వకారణమని ఎంపీ జాన్ బ్రిట్టాస్ తెలిపారు. పార్లమెంటు వేదికగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నారు. ’ఇటీవల ఓ రోజు నేను సభలో మాట్లాడుతుంటే ఆమె లుంగీవాలా అంటూ నన్ను ఉద్దేశించి అమర్యాదకర వ్యాఖ్యలు చేశారు. నేను ధోతీతో ఉన్నా. మలయాళీని, దక్షిణాది వ్యక్తిని అయినందుకు గర్వపడుతున్నా. అయితే, అవమానకర వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంపై సభ దృష్టి సారించాలి. ఆమెకు వ్యతిరేకంగా ప్రివిలెజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాను’ అని తెలిపారు. తన బాధ్యతలు నిర్వర్తించనీయకుండా ఎంపీ దేవ్ పదే పదే అడ్డుపడ్డారని ఎంపీ బ్రిటాస్ ఆరోపించారు. పలు మార్లు లుంగీవాలా అని అన్నారని ఆరోపించారు. ఈ వార్తలపై రాజ్యసభలో జేపీ నడ్డా మాట్లాడుతూ లుంగీ కామెంట్స్‌ను తాము సమర్థించమని స్పష్టం చేశారు. బ్రిట్టాస్ అభ్యంతరాలు, వ్యాఖ్యలు అన్నీ రికార్డుల్లోకి చేరాయని అన్నారు. తమ దృష్టిలో అది ధోతీ అని కూడా చెప్పారు. సభ హుందాతనాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా అభిప్రాయపడ్డారు. ’సభ్యులందరూ సమానమే. ఒక ఎంపీపై ఆరోపణలు వచ్చాయి కాబట్టి వారికి తమ వివరణ ఇచ్చేందుకూ అవకాశం ఇస్తున్నాము’ అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




