– ప్రపంచ దేశాలకు దీటుగా నగర ప్రణాళిక
– 60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ
– ఓఆర్ఆర్ పెద్ద అసెట్ కానుంది
– అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్
– మెట్రో విస్తరణతో అద్భుత కనెక్టివిటీ
– గ్రామాల ప్రజలు సిటీలో భాగం కావాలి
– సిటీ కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలి
– మూడు బుల్లెట్ ట్రైన్స్ కేంద్రంగా శంషాబాద్
– ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాలకు వరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరి కృషితోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ నగర నిర్మాణం అంత సులభం కాదు.. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అని అన్నారు. పక్కా ప్రణాళికతో ప్రపంచ నగరాలకు దీటుగా నిర్మించబోతున్నామని చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసే నగరంలో తమనూ కలపాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయాలను ప్రారంభించారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో చాలామంది నేతలు హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు. ఇప్పుడు నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాల్లోని అత్యాధునిక నగరాల తరహాలో భారత్‌లోనే నాలుగో నగరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. మనకున్న అద్భుతమైన ఆరఆరఆర్, ఐటీ ఎగుమతులు, కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మన ఘనతలే ఈ నగరానికి స్ఫూర్తి అని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఈ నగర నిర్మాణానికి సహకరించే వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. వచ్చే జూన్‌లో ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. సిటీ నిర్మాణానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని.. ప్రపంచంతో పోటీపడేలా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2లోపు ఫ్యూచర్ సిటీ భవన నిర్మాణం జరుగుతుందన్నారు. గతంలో హైటెక్ సిటీ అంటే అవహేళన చేశారని, ఏ నగరానికీ లేని ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కు ఉందని అన్నారు. మూడు కొవిడ్ వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అయ్యాయని గుర్తు చేశారు. యుద్ధ విమాన సర్వీస్ సెంటర్లూ హైదరాబాద్‌లో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ కేవలం ఒక నగరం కాదు.. ఇది రాబోయే తరాల తలరాతను మార్చే అద్భుత నగరం అని అన్నారు. ఫ్యూచర్ సిటీలో కలవాలనుకునే గ్రామాలు గ్రామ సభల్లో తీర్మానం చేసి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారని, ఆయా గ్రామాల్లో సభలు పెట్టి తీర్మానాలు చేసి కలెక్టర్, మంత్రికి పంపితే ఆయా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో భాగం చేసే చర్యలు చేపడతామన్నారు. ఇక కేంద్రం దేశవ్యాప్తంగా ఏడు బులెట్ ట్రైన్లను ప్రకటిస్తే అందులో మూడు మన రాష్ట్రానికే రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ కేంద్రంగా ముంబై, బెంగళూరు, అమరావతి నగరాలను అనుసంధానిస్తూ బులెట్ రైళ్లు పరుగులు తీయబోతున్నాయని చెప్పారు. కేవలం రైళ్లే కాదు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ బస్సు టెర్మినల్‌ను కూడా మనం నిర్మించుకోబోతున్నామని రేవంత్ తెలిపారు. మెట్రో, బులెట్ ట్రైన్, అత్యాధునిక బస్ టెర్మినల్ ఇవన్నీ ఒకేచోట ఏర్పాటు కాబోతున్నాయన్నారు. త్వరలోనే రంగారెడ్డి జిల్లా ఒక మహా అద్భుతానికి సాక్ష్యం కాబోతోందని చెప్పారు. తాను కూడా ఈ గడ్డ నుండే ఊరికి వెళ్తాను.. అందుకే దీనిపై ఉన్న అభిమానంతో ఈ ప్రాంత భవిష్యత్తు కోసం అద్భుతమైన ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ లేనివాడు ఫ్యూచర్ సిటీ అంటున్నాడని కొందరు అంటున్నారు… నా మీద ఏడ్చే వారికి నేను చెప్పేది ఒక్కటే.. మీరు ఏడ్చుకుంటూనే ఉండండి, నేను నా పని చేసుకుంటూనే పోతా.. ఏడుపే నా చెవులకు వినిపించే మధుర సంగీతం అని రేవంత్ అన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎంపి వేం నరేందర్ రెడ్డి, డీజీపీ శిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీ సమస్య పరిష్కారానికి తమ మంత్రి శ్రీధర్‌బాబు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, పేదల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సూచిస్తున్నానని సీఎం అన్నారు. మీరు సహకరిస్తే దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అద్భుతమైన నగర నిర్మాణానికి వేగంగా అడుగులు పడతాయన్నారు. తాము అభివృద్ధి చేస్తామంటే కొందరు ఏడుపులు మొదలుపెట్టారంటూ మీరు ఏడుస్తూనే ఉండండి.. మేం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళతాం అని వ్యాఖ్యానించారు. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసుల కుల గురువు శుక్రాచార్యుడు మారీచుడు, సుబాహుడులను పంపి భగ్నం చేయాలని ప్రయత్నించే వారు. రాష్ట్రంలో కూడా ఫామ్ హౌస్‌లో ఉన్న శుక్రాచార్యుడు మన అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు మారీచుడు, సుబాహుడిని పంపాడు.. వాళ్ల మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు అని చెప్పారు. ఈ వేదికగా మావోయిస్టులకు పిలుపునిస్తున్నా.. ఇంకా ఎవరైనా మావోయిస్టులు అడవుల్లో మిగిలిపోతే వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి అన్నారు. మీ ఆరోగ్యం, మీకు భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని హామీ ఇచ్చారు.
గిరిదర్శక్‌లకు నియామక పత్రాలు 
గిరి దర్శక్ కార్యక్రమంలో భాగంగా 20మంది గిరిజన యువతకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందించారు. పర్యాటక అభివృద్ధితోపాటు గిరిజన యువతకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో గిరి దర్శక్ కార్యక్రమం చేపట్టామని, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో గిరిదర్శక్‌ల నియామకానికి యువతను ఎంపిక చేసి శిక్షణ అందించామని, గిరి దర్శక్‌లు పర్యాటకులకు స్థానిక సంస్కృతి, చరిత్రను వివరిస్తారని చెప్పారు. అటవీ నియమాలు పాటించేలా చూడటంతోపాటు పర్యాటకులకు భద్రత కల్పించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





