ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలో యూనిఫాంలు,షూస్, పాఠ్య సహాయక కిట్లు, చార్ట్స్, మ్యాప్స్ వంటి అవసరమైన వస్తువులు సమయానికి అందించడం ఒక ప్రాథమిక బాధ్యత. అయితే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకున్న వివాదాలు, ఆలస్యాలు, నిర్లక్ష్యాలు  ఈ బాధ్యతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ సమస్యను కేవలం టెండర్ ప్రక్రియలో ఉన్న లోపాలుగా కాకుండా, విద్యార్థుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశంగా చూడాల్సిన అవసరం ఉంది.

ప్రతి సంవత్సరం స్కూల్ ప్రారంభమయ్యే సమయానికి కొత్త యూనిఫాంలు, పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి అందకపోతే విద్యార్థులలో మొదటి నుంచే అసమానతలు ప్రారంభమవుతాయి. కొంతమంది విద్యార్థులు పాత యూనిఫాంలతోనే తరగతులకు హాజరవుతుంటే, మరికొందరు ప్రైవేట్‌గా కొనుగోలు చేసుకునే సామర్థ్యం లేక ఇబ్బందులు పడతారు . ఈ పరిస్థితి వారి మనోభావాలపై ప్రభావం చూపుతుంది. “ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాం కాబట్టి ఇలా జరుగుతోంది” అనే నిస్పృహ భావన చిన్నపిల్లల్లోనే పెరిగే ప్రమాదం ఉంది.

 ప్రధానంగా, విద్య హక్కు చట్టం  ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, తప్పనిసరి విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగా విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక వసతులు, సహాయక సామగ్రి కూడా అందించాల్సి ఉంటుంది. యూనిఫాంలు, పాఠ్య కిట్లు అందించడంలో ఆలస్యం జరగడం ఈ హక్కును పరోక్షంగా భంగపరిచే అంశంగా పరిగణించబడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ అంశంపై పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలు అయితే, ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

టెండర్ల ప్రక్రియలో ప్రధాన సమస్యగా కనిపిస్తున్నది సమయపాలన లోపం. విద్యా సంవత్సరం ప్రారంభానికి కొద్ది రోజుల ముందు టెండర్లు పిలవడం, కేవలం కొన్ని వారాల్లో భారీ పరిమాణంలో సరఫరా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేయడం వాస్తవానికి అసాధ్యమైన లక్ష్యమే. దీనివల్ల సరఫరా ఆలస్యమవడం తప్పదని ముందే అర్థమవుతుంది. అయినప్పటికీ, ఇలాంటి షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందించడం పరిపాలనా వైఫల్యంగా చెప్పక తప్పదు.

ఇక మరో ముఖ్య అంశం టెండర్ షరతుల స్పష్టత. కాంట్రాక్టర్లు ప్రీ-బిడ్ సమావేశాల్లో వ్యక్తం చేసిన అభ్యంతరాలు చూస్తే, షరతులు స్పష్టంగా గా లేవని తెలుస్తోంది. ఇది రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఒకవైపు నిజాయితీ గల సరఫరాదారులు వెనుకంజ వేస్తారు; మరోవైపు కొందరు మాత్రమే పోటీకి మిగిలి, పోటీ పారదర్శకత దెబ్బతింటుంది. చివరకు ప్రభుత్వం సరైన నాణ్యతతో, సరైన ధరకు సరఫరా పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఇది కేవలం పరిపాలనా లోపం మాత్రమే కాదు, సామాజిక ప్రభావం కలిగించే అంశం కూడా. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలవారు. వారికి ప్రభుత్వం అందించే యూనిఫాం, కిట్లు అనేవి లగ్జరీ కాదు—అవసరం. ఇవి లేకపోతే వారు స్కూల్‌కు రావడానికే ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కొందరు విద్యార్థులు యూనిఫాం లేకపోవడంతో స్కూల్‌కు రాకుండా ఉండే సందర్భాలు కూడా గతంలో నమోదయ్యాయి.

అదే విధంగా చార్ట్స్, మ్యాప్స్ వంటి విద్యా సాధనాలు లేకపోవడం బోధన నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సామగ్రి ఎంతో కీలకం. ఉపాధ్యాయులు సబ్జెక్ట్‌ను విజువల్‌గా వివరించేందుకు వీటి అవసరం ఎక్కువ. ఇవి లేకపోతే బోధన పరిమితమైపోతుంది, విద్యార్థుల అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.

ఇంకా ఈ వివాదంలో మరో కోణం—పాలసీ మార్పు. గతంలో చేనేత సహకార సంఘాల ద్వారా సరఫరా జరిగే విధానాన్ని మార్చి, పూర్తిగా టెండర్ విధానానికి మారడం జరిగింది. ఈ మార్పు వెనుక ఉద్దేశ్యం ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పారదర్శకత కోసం అయితే, ఆ పారదర్శకత ఎక్కడ కనిపిస్తోంది? టెండర్ ప్రక్రియలోనే వివాదాలు, ఆరోపణలు వొస్తే, ఆ లక్ష్యం సాధించబడిందా అనే ప్రశ్న తలెత్తుతుంది. చేనేత రంగానికి ఇది ఒక పెద్ద దెబ్బగా మారే అవకాశమూ ఉంది. గతంలో ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడి ఉన్న అనేక కుటుంబాలు ఇప్పుడు ఉపాధి కోల్పోయే పరిస్థితిలోకి వెళ్లవొచ్చు. అంటే ఒక పాలసీ మార్పు వల్ల విద్యార్థులకే కాకుండా కార్మిక వర్గాలకూ ఇబ్బందులు కలుగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రధానంగా మూడు ప్రశ్నలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది 1.సమయానికి టెండర్లు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 2. షరతులు ఎందుకు స్పష్టంగా రూపొందించలేదు? 3.విద్యార్థుల అవసరాలను ముందుగానే అంచనా వేయడంలో ఎందుకు విఫలమయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సమస్యను ముందుకు దాటవేయడం  సరైన విధానం కాదు. విద్యార్థుల భవిష్యత్తు, వారి విద్యా హక్కు వంటి కీలక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి.

ఇక ముందు తీసుకోవాల్సిన చర్యలు స్పష్టంగా ఉండాలి. మొదటగా, టెండర్ ప్రక్రియను కనీసం 3,4 నెలల ముందే ప్రారంభించాలి. రెండవది, షరతులను పూర్తిగా స్పష్టంగా గా, పారదర్శకంగా రూపొందించాలి. మూడవది, సరఫరా ఆలస్యమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలి—ఉదాహరణకు తాత్కాలిక యూనిఫాం లేదా నేరుగా నగదు సాయం. నాలుగవది, విద్యార్థులపై ప్రభావం పడకుండా ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

అంతేకాకుండా, ప్రతి జిల్లాలో ప్రత్యేక అధికారులను నియమించి, సరఫరా పురోగతిని రోజువారీగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. టెండర్ ప్రక్రియను కేవలం ఒక ఫైల్ పని లాగా కాకుండా, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అత్యవసర సేవగా చూడాలి. చివరగా, ఒక విషయం స్పష్టంగా చెప్పాలి…టెండర్ల వివాదం రాజకీయ వివాదాలకు  మాత్రమే పరిమితం కాకూడదు. ఇది విద్యార్థుల గౌరవం, సమానత్వం, విద్యా హక్కుతో సంబంధం ఉన్న అంశం. యూనిఫాం లేకపోవడం అనేది ఒక చిన్న విషయం కాదు; అది ఒక విద్యార్థి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అంశం.

ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకొని, తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రతి సంవత్సరం ఇదే సమస్య పునరావృతం అవుతూనే ఉంటుంది. చివరకు నష్టపోయేది ఎవరు?—సాధారణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే. వారి భవిష్యత్తును నిర్లక్ష్యం చేసే హక్కు ఎవరికి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *