సందర్భం ఒక్కటే,సమస్యలే వేర్వేరు!?

“ఇద్దరు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల చిత్రమైన రాజకీయం. ఒకరు ప్రతిపక్షం చీటికిమాటికి వీధుల్లో రచ్చేమిటని ప్రశ్నిస్తుంటే,మరో తెలుగు రాష్ట్రం తెలంగాణా లో ప్రతిపక్షనేత మౌనం వీడి వీధిలోకి రావాలని మరో అధికార కేంద్రం హడావిడి.సందర్భం ఒక్కటే సమస్యనే పరస్పరవిరుద్దం.వేర్వేరు.ఒకచోట ప్రతిపక్షనేత వీధికెక్కి రచ్చచేయోద్దు… మరోచోట ప్రతిపక్షనేత వీధి కెందుకు రావడంలేదు.రచ్చ ఎందుకు చేయడంలేదు?.ఇదికదా అసలు రాజకీయాలు రసకందాయం అంటే!” 
-ఎన్.తిర్మల్
(పొలిటికల్ ఎనలిస్ట్, రచయిత, సామాజిక కార్యకర్త)
సెల్:9441864514

భళారే చిత్రం!అయ్యారే విచిత్రం!? రాజకీయాలు రసపట్టుకు చేరినప్పుడు చిత్రం విచిత్రాలు కనిపిస్తాయి! దానవీరశూర కర్ణ సినిమా లో సీరియస్ ప్రతి పాత్ర అయినా దుర్యోనుడికి చిత్ర దర్శకుడు మరియు రికార్డు స్థాయిలో ఐదు పాత్రలు తానే అయి,అందులో డ్యూయోట్ పెడితే నిజంగానే అది సరదాకు పెట్టినా సినిమా కనుక హిట్టయింది.అదికూడా సినారే రాసిన “అయ్యారే చిత్రం,భళారే విచిత్రం,రాచనగరుకు రారాజును రప్పించుటయో చిత్రం! మదిలో మదనుడు సందడి చేయుటయో విచిత్రం” అని దుర్యోధనుడు డ్యూయోట్ పాడితే భారతం లో ఆఘట్టం లేక పోయినా సినిమా కనుక అందునా పాడింది సీనియర్ ఎన్టీఆర్ కనుక రక్తి కట్టింది. ఆధునిక రాజకీయ సినిమాలో కూడా అలాంటి చిత్రం విచిత్రాలే అలవోకగా జరిగిపోతుంటే!నోరెళ్ళ బెట్టి చూడడం తప్ప మరేమీ మాట్లాడలేక పోతున్నాం.

ఉభయతెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అలాంటి చిత్ర విచిత్రమే ఇప్పుడు కనిపిస్తున్న సాదృశ్యం!?అక్కడ కధానాయకుడు ఎన్టీఆర్ అయితే ఇక్కడ కథానాయకులు ఆయన అల్లుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఆయన శిష్యుడు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా చిత్రంగా ఉందికదా? ఏమిటా ఆధునిక బారతం!  ఏమా కొత్త రాజకీయ క్లైమాక్స్ కథ? తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికార  గధాదండం పైకెత్తి ఇంగరా! వీధి లోకి చూసుకుందాం!అంటూ కేసీఆర్ పై సవాలు విసురుతున్నా అటునుంచి ఉలుకూ పలుకు లేదు.నాయకుడు ప్రతినాయకుడి తో తలపడి తేనే గదా సినిమా రక్తి కట్టేది.అయినా కేసీఆర్ పాం హౌస్ లో ఎంచక్కా తన రాచకార్యాలు చక్కదిద్దేందు కుంటున్నాడు.కొన్నిసార్లు రాజకీయాల్లో మౌనం కూడా మహాప్రళయం సృష్టిస్తుంది. ఆటంబాంబుకంటే ఎక్కువ పోవాలని అంటుంటారు.ఎందుకో రేవంత్ కాలుదువ్వినా,కవ్వించినాకేసీఆర్ ఈశుమంత స్పందించడం లేదు. ఎందుకంటే ఆయన ఎన్నికల బహిరంగ సభలోనే ప్రజలకు అప్పుడే హెచ్చరిక ఒకటి చేసి పారేసిండు.తమ ఓటమిని ముందస్తు పసిగట్టే కాంగ్రేస్ వాళ్ళకు వోటేస్తే! మీరే గాయిగాయి అయిపోతారు.గాడినపడిన తెలంగాణా సంకలనానికి పోతుంది.నాదేం పోతుంది. ఓడిపోతే పాం హౌస్ లో ఎంచక్కా పడుకుంటా! కాకుంటే రెస్టు తీసుకుంటానని కుండబద్దలు కొట్టారు.జనంపై అలిగారు కూడాను.అట్లాగే ఓడిపోయారు. ఫార్మ్  హౌస్ లో సేద తీరారు.
ఇప్పుడు ఆయన వయస్సు కూడా వీధి కెక్కి రచ్చ రచ్చ చేసే స్థితి లేదు.ఆయన అట్లా మౌనంగా ఉండడమే కలిసివచ్చే అంశంగా తెలంగాణా లో మారిపోయింది.ఎందుకంటే తెలంగాణా లో కాంగ్రెస్ కు ప్రతిపక్షం అవసరం లేదు.ఆపార్టీని ఆపార్టీ నే విమర్శించుకుంటుంది.రచ్చ కెక్కి రంబోళా చేసుకుంటుంది.ఇకముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష సైడ్ యాక్టర్లయిన కేటీఆర్,హరీష్ రావులతో అరుసుకున్నా రాజకీయాల్లో మజా రావడంలేదట.అందుకే ఫార్మ్  హౌస్ లో ఓ మూల కూర్చున్న కేసీఆర్ బయటకురావాలని రంకెలేసి పిలిచినా రావడంలేదని,ఏకంగా తన క్యాడర్ , కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లో కొచ్చి కేసీఆర్ బయటకు రావాలని రచ్చ మోదలెట్టిండు. చిత్రంగా అధికారపార్టీ ఆందోళన కు పిలుపిచ్చింది.చాలా చిత్రం గా ఉంది కదా! ప్రతిపక్షం బయటకు రావాలని అధికారపక్షం వీధుల్లోకి రావడం.సమస్యలన్నీ సంకనాకి పోయి ఇప్పుడు ఇదో వీధి రచ్చకావాలని తెలంగాణా లో అధికారపక్షం ఆందోళన,పిలుపు రచ్చ చిత్రం గున్నదికదా! ఎక్కడైనా ప్రతిపక్షనేత మౌనం దాల్చితే అధికారపక్షం ఆనందంగా ఉండాలి.కానీ తెలంగాణా లో అదేం చిత్రమో,ప్రతిపక్షం ఇల్లొదిలి వీధిలోకి రావాలని అధికారపక్షం లొల్లి! భళారే రేవంత్ అన్నా?భళా!
 ఇక ఆంధ్రప్రదేశ్ లో నలబై ఏళ్ళ రాజకీయ ఇండస్ట్రీ.రేవంతన్న మాజీ గురువు చంద్రబాబు నాయుడు.రేవంత్కు పూర్తి ఆపోజిట్ లో ఆయన అధికార  గదా దండం ఎత్తి పట్టారు.అక్కడ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి పై చిర్రుబుర్రు లాడుతున్నారు.ఓడిపోయి మూల కూర్చోవాలి కానీ,ఈయనేంది.అధికారం  పోయినా వీధుల్లో రాచరికపు ఊరేగింపు లేమిటి. మండిపడుతుండు.అధికార  పక్షంనేత గిల్లడం ప్రతిపక్ష నేత మందీమార్భలంతో తమ పిక్కబలం,కాల్బలం చూపడం చంద్రబాబు కు ఎంత మాత్రం నచ్చడం లేదట! ఎవరినైనా,అరెస్టు చేసినా,జైళ్ళలో పెట్టినా పరామర్శలు పేరుతో జగన్మోహన్ రెడ్డి  చేస్తున్న రాజకీయ షోలు బాబుకు ఆయన ఏకైక బాబుకు అసలు నచ్చడంలేదుట ! అందుకే జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ లో పోలీసులు ఎక్కువ కొనసాగుతున్నారని, అసలు లేకుండా హుకుం జారీచేశారట! అధికారపక్షం ప్రతిపక్షాన్ని అధికార చతురంగ అంగాంగ బృందాలతో అడ్డుకున్నా,ఇబ్బంది పెట్టాలని చూసినా,ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కి ఇసుకేస్తే రాలని జనం వస్తున్నారట!
ఇదేం చోద్యం,అని చెప్పొచ్చు జర్నలిస్టు పరిశోధన చేసి జనం లేరు,గినం లేరు.జగన్ మోహన్ రెడ్డి బయలుదెరగానే బంగ్లాదేశ్ నుండి రోహింగ్యాలు, పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులు పరిగెత్తుకొచ్చి సభలు షో చేస్తున్నారట.. తేల్చిపారేశారు.ఏది ఎట్టాయితేమిగానీ,జనం సునామీ చేస్తున్న బలప్రదర్శనకు ఎన్నికలు గట్రా లేకుండా నే ఓడి పోయినట్లు అధికార  పక్షం ఫీలవుతున్నారట! జనంలో జగన్ రచ్చ,రంది అధికారపక్షం కు కునుకు లేని అదో పీకులాటగా మారింది.హర్డిల్స్ పెట్టినా, అడ్డంకులు పెట్టినా జనమేజనమట !జగన్ చుట్టూతా? ఇళ్ళు కదలొద్దని కోర్టులు ద్వారా ఉత్తర్వులు ఒప్పించినా ఈయనేంది.అయినదానికి, కాని దానికి వీధుల్లో జనంషోలని   తలపట్టుకొంటున్నారుట.
అసెంబ్లీకి రాకుండా అసలు జగన్ వీధుల్లోకి రావలసిన అవసరం ఏమిటి? అని ఆంధ్ర ప్రదేశ్ అధికారపక్షం చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రశ్నిస్తుండగా అసెంబ్లీ కి రాకుండా, వీధుల్లోకి రాకుండా సైలెంట్ గా వాయిలెంట్ చేయడం ఏమిటని ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను అరుసుకుంటున్నాడు.భలే చిత్రంగా ఉందికదా! ఇద్దరు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల చిత్రమైన రాజకీయం.ఒకరు ప్రతిపక్షం చీటికిమాటికి వీధుల్లో రచ్చేమిటని ప్రశ్నిస్తుంటే,మరో తెలుగు రాష్ట్రం తెలంగాణా లో ప్రతిపక్షనేత మౌనం వీడి వీధిలోకి రావాలని మరో అధికార  కేంద్రం హడావిడి.సందర్భం ఒక్కటే సమస్యనే పరస్పరవిరుద్దం.వేర్వేరు.ఒకచోట ప్రతిపక్షనేత వీధికెక్కి రచ్చచేయోద్దు…మరోచోట ప్రతిపక్షనేత వీధి కెందుకు రావడంలేదు.రచ్చ ఎందుకు చేయడంలేదు?. ఇదికదా అసలు రాజకీయాలు రసకందాయం అంటే!  అందుకే అంటారు, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యారే చిత్రం! భళారే విచిత్రం!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *