– రేవంత్ సొంత సర్వేలోనూ ఇదే తేలింది
– అందుకే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : కాంగ్రెస్ పార్టీ సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తన పాలనపైన, తన నాయకత్వంపైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విస్తృత సర్వే చేయించుకున్నారని, అందులో ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో పార్టీ హైదరాబాద్ నేతలతో గురువారం జరిగిన ప్రత్యక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆరఎస్ సుమారు 78 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో తేలిందన్నారు. రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైందన్నారు.కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని ప్రజలు స్పష్టంగా తమ అభిప్రాయం తెల్చిచెప్పారన్నారు. సొంత సర్వేతోపాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే మరోసారి ముఖ్యమంత్రి వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గురువారం నిర్వహించారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ అనేక అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నారని, అందులో భాగంగానే కాళేశ్వరం నుంచి రైతుబంధు వరకు అన్నింటిపైన అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైనందువల్లనే రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పాలనపై నమ్మకం కోల్పోయారన్నారు. దీంతో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ± ప్రజలు బీఆరఎస్ కావాలని కోరుకుంటున్నారని, బీజేపీ వంటి ఇతర పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జారుడు బండపైన నిలబడిందని, ఇక పుంజుకునే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినా కాంగ్రెస్ పార్టీ ప్రజామోదం పొందడం అత్యంత కష్టమన్నారు.
ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలి
జీహెచ్ఎంసీ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ నియమించిన బూత్ లెవెల్ ఆఫీసర్లకు సరైన శిక్షణ, తగిన ఏర్పాట్లు లేకపోవడంతో ఈ కార్యక్రమం అత్యంత మందకొడిగా కొనసాగుతున్నదని, దీనివల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫీడ్‌బ్యాక్ వస్తోందని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి అత్యధిక జనసాంద్రత ఉండే మహానగరంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫారాల పంపిణీ, వాటిలో ఓటర్ల నమోదు వంటి అంశాలపై సరైన అవగాహన లేకుండానే అధికారులను కేటాయించారంటూ పార్టీ వర్గాలు ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను ప్రస్తావించారు. అయితే ఎస్ఐఆర్ అత్యంత కీలకమైన అంశమని, ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా దొంగ ఓట్లు లేకుండా చూడాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా భారీగా బయటపడిన డబుల్ ఓట్లు, దొంగ ఓట్ల వ్యవహారాన్ని ప్రతి ఒక్క నాయకుడు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎసఐఆర్‌కు సంబంధించి పార్టీ నియమించుకున్న బూత్ లెవెల్ అసిస్టెంట్ల(బీఎల్ఏ) సహకారంతో ఏ ఒక్కరి ఓటు పోకుండా చూడాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్నందున డబుల్ ఓట్ల నమోదు లేదా ఇతర ప్రాంతాల వారిని ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేయించే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇలాంటి సందర్భంలో కార్యకర్తలు, మద్దతుదారుల ఓట్లు పోయేలా ప్రయత్నం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూడాలని, ఏ ఒక్కరి ఓటు అన్యాయంగా తొలగింపునకు గురికాకుండా చూడాలన్నారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న డబుల్ ఓట్లపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలన్నారు. మరోవైపు ఎసఐఆర్ కు సంబంధించిన అంశంలో ఎదురవుతున్న ఇబ్బందులను, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు పార్టీ తరఫున తీసుకుపోతున్నట్లు తెలిపారు. నగరంలో ఎసఐఆర్‌కు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు మరింత చురుగ్గా ముందుకు పోవాలన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, స్థానిక కార్యకర్తలు, పార్టీ బూత్ లెవెల్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. జీహెచఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





