– తాడిచర్ల-2, నైనీ కోల్ బ్లాక్‌లతో రూ.2.25 లక్షల కోట్ల టర్నోవర్
– వేలాదిమంది కార్మికులకు ఉపాధి
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9: రాష్ట్రానికే కాకుండా యావత్ దక్షిణ భారతదేశానికి ఇంధన ఊపిరిగా, ఇక్కడి ప్రజల గుండె చప్పుడుగా ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థను కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు సింగరేణి సంస్థ ద్వారా సుమారు 75 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, మరో 10 లక్షల మంది పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. గతంలో ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని దాదాపు ఆరు జిల్లాలు నేరుగా సింగరేణిపైనే ఆధారపడి వ్యాపారాలు, ఇతర జీవనోపాధిని సాగిస్తున్నాయని వివరించారు. దక్షిణ భారతదేశంలో విద్యుత్, సిమెంట్, స్టీల్ ఉత్పత్తికి బొగ్గు అత్యంత కీలకమని, ప్రస్తుత వర్షభావ పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున సకాలంలో బొగ్గు సరఫరా కాకపోతే తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఒకరోజు ఉపవాసమైనా ఉంటారు కానీ, విద్యుత్ లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేరని, భవిష్యత్తులో అలాంటి అంతరాయం రాకూడదనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చట్టపరమైన నిబంధనలను ఉపయోగించి తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేటాయిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కార్మిక కాంగ్రెస్, కమ్యూనిస్ట్ సంఘాలు, అధికారులు, ఇంజనీర్స్ అసోసియేషన్లు, జీఎంల ఆర్గనైజేషన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తులను తాను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతోనే ఈ సానుకూల నిర్ణయం జరిగిందన్నారు. ఒరిస్సాలో తెలంగాణ జెన్‌కోకు క్యాప్టివ్ మైన్‌గా కేటాయించిన ‘నైనీ కోల్ బ్లాక్’ అనుమతులను 2015 నుండి అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిలిపివేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇటీవల ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, తాను వ్యక్తిగతంగా అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని రకాల పర్యావరణ, ఇతర క్లియరెన్సులు ఇప్పించానని చెప్పారు. ప్రస్తుతం నైనీ బ్లాక్‌లో ఓవర్ బర్డన్ తొలగించి, విజయవంతంగా ట్రయల్ ప్రొడక్షన్ (బొగ్గు ఉత్పత్తి) ప్రారంభించడం సింగరేణి సాధించిన గొప్ప విజయమన్నారు. సింగరేణి పరిధిలో ప్రస్తుతం ఉన్న బ్లాక్‌లన్నింటిలో కెల్లా అత్యంత భారీ నిల్వలు ఉన్న గని తాడిచర్ల-II అని ఆయన వివరించారు. గతంలో సత్తుపల్లిలోని జీవీఆర్ ఓపెన్ కాస్ట్ 227 మిలియన్ టన్నులతో పెద్ద బ్లాక్‌గా ఉండేదని, కానీ ఇప్పుడు వచ్చిన తాడిచర్ల-II లో 434 మిలియన్ టన్నుల అత్యంత నాణ్యమైన గ్రేడ్-8, గ్రేడ్-9 రకానికి చెందిన బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. నైనీ బ్లాక్‌లో ఉన్న 455 మిలియన్ టన్నులతో కలిపి మొత్తం 795 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వకానికి సింగరేణికి అవకాశం లభించిందని చెప్పారు. తాడిచర్ల గని ద్వారా ఏటా సగటున 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినా రాబోయే 45 సంవత్సరాల పాటు సింగరేణికి, తెలంగాణ ఇంధన భద్రతకు లాంగ్ టర్మ్ భరోసా లభిస్తుందని, రాబోయే 40 ఏళ్లలో ఈ రెండు బ్లాక్‌ల ద్వారా సింగరేణికి సుమారు రూ. 2,25,000 కోట్ల భారీ టర్నోవర్ సమకూరుతుందని వెల్లడించారు. ఇందులో తాడిచర్ల ద్వారా రూ. 1.50 లక్షల కోట్లు, నైనీ బ్లాక్ ద్వారా రూ. 75 వేల కోట్ల టర్నోవర్ లభిస్తుందన్నారు. నైనీ బ్లాక్‌ను ఒరిస్సాలో కాంట్రాక్టర్ల (వీణO) ద్వారా డెవలప్ చేస్తున్నామని, అక్కడికి వెళ్లడానికి కార్మికులు ఇష్టపడరని.. కానీ తాడిచర్ల గనిలో 100% సింగరేణి కార్మికుల శ్రమనే వినియోగిస్తూ, 2,000 మందికి పైగా కార్మికులకు 45 ఏళ్ల పాటు శాశ్వత ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఈ రెండు బ్లాకుల ద్వారా కొత్తగా 3,500 మందికి నూతన ఉద్యోగాలు లభిస్తాయని, రైల్వే నెట్‌వర్క్, నూతన రహదారులు వంటి మౌలిక వసతులు పెరుగుతాయని స్పష్టం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి సింగరేణి ఆర్థిక సంక్షోభంపై దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కార్మికులు ప్రాణాలకు తెగించి రాత్రింబగళ్లు కష్టపడి తీసిన బొగ్గుకు సంబంధించిన రూ. 54,148 కోట్ల భారీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో సింగరేణి సొంత థర్మల్ పవర్ ప్లాంట్ నుండి తీసుకున్న విద్యుత్‌కు గాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ. 28,876 కోట్లు కాగా, తెలంగాణ జెన్‌కో సంస్థలు సింగరేణి నుండి తీసుకున్న బొగ్గుకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 25,272 కోట్లుగా ఉన్నాయని వివరించారు. గత బీఆరఎస్ ప్రభుత్వం సింగరేణిని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా వాడుకుని రూ. 30,000 కోట్ల బకాయిలు పెట్టి ఫార్మ్‌హౌస్‌కు వెళ్లిపోయిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో మరో రూ. 24,000 కోట్ల బకాయిలను పెంచిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇంత భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్‌లో ఉంటే సంస్థ ఎలా మనుగడ సాగిస్తుందని, కార్మికులకు ఏ రకంగా ధైర్యం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కిషన్ రెడ్డిని ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్‌ఎస్ పార్టీకి లేదన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా ఎంతో కష్టపడి, లీగల్ ఓపీనియన్లు తీసుకొని బొగ్గు బ్లాక్ తెస్తే అభినందించాల్సింది పోయి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తనను విమర్శించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణలో రెండు బొగ్గు బ్లాకులు వస్తే వాటిని సింగరేణి కార్మిక సంస్థకు ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్టుకు కట్టబెట్టారని విమర్శించారు. గత యూపీఏ (కాంగ్రెస్) ప్రభుత్వ హయాంలో జరిగిన ‘కోల్’ కుంభకోణం వల్లే సుప్రీంకోర్టు దేశంలోని అన్ని బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేసి, పారదర్శక వేలం విధానాన్ని అమల్లోకి తెచ్చిందని, ఈ నిబంధనలు మోదీ ప్రభుత్వం తెచ్చినవి కావని గుర్తుచేశారు. సింగరేణి కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు.. అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల్లో లేని ఈ గొప్ప సంపదను కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసికట్టుగా ముందుకు రావాలని, సింగరేణి కష్టకాలంలో ఉన్నప్పుడు రాజకీయాలు పక్కనపెట్టి సంస్థ హితం కోసమే ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. బొగ్గు గనిని సింగరేణి సంస్థకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మొదటిసారిగా హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బిజెపి కార్యకర్తలు జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ ఆయనపై పూల వర్షం కురిపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





