– కాళేశ్వరం కూలితే గోదావరి జలాలు ఎలా వచ్చాయి?
– బీఆర్ఎస్‌పై బురద చల్లడమే లక్ష్యం
– సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 9: కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలాలు ప్రజలందరికీ కనిపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. గురువారం సిద్దిపేటలోని పటేల్ గార్డెన్‌లో సిద్దిపేట లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యుల కోసం ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాళేశ్వరం కూలిపోయిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయంగా బీఆర్ఎస్‌ను దెబ్బతీయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని హరీశ్ రావు విమర్శించారు.సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం జలాలతోనే విస్తారంగా సాగు జరిగి, ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు. గోదాములు నిండిపోయి ధాన్యం తరలించేందుకు లారీలు కూడా దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు.గురుకులాల్లో కోడిగుడ్లు, బూట్లు, యూనిఫాంల నుంచి రవాణా శాఖలో రేడియం స్టిక్కర్ల వరకు ప్రతి అంశంలో కమిషన్లే నడుస్తున్నాయని ఆరోపించారు. గతంలో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రేడియం స్టిక్కర్లకు ఇప్పుడు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న హరీశ్ రావు, లారీ యజమానులు, డ్రైవర్లు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవసరమైన వారికి తన సొంత ఖర్చుతో కళ్లద్దాలు, కంటి శస్త్రచికిత్సలు చేయిస్తానని, వ్యక్తిగత బీమా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సిద్దిపేట లారీ అసోసియేషన్‌కు ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయించేలా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





