తెలంగాణ ప్రజారోగ్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రతిపాదించిన ₹4,500 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ (టీజీ ఎస్వీఏఎస్టీహెచ్) రాష్ట్ర వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్రంలో వైద్య సేవల నాణ్యతను పెంచడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం లక్ష్యంగా ‘తెలంగాణ స్ట్రాటజిక్ విజన్ ఫర్ అటైనింగ్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ హెల్త్ కేర్’ (టీజీ ఎస్వీఏఎస్టీహెచ్) కార్యక్రమానికి ఈ నిధులు వెన్నుదన్నుగా నిలవనున్నాయి. సుమారు 3.1 కోట్ల మంది ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువత, వృద్ధులకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుందని అంచనా వేయడం రాష్ట్ర వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. అయితే, ఈ భారీ నిధులు కేవలం కాగితపు ప్రణాళికలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ దవాఖానల ఆధునీకరణకు, మారుమూల పల్లెల్లో వైద్య సదుపాయాల మెరుగుదలకు ఎలా ఉపయోగపడతాయనే అంశంపై విస్తృత విశ్లేషణ అవసరం. అదే సమయంలో, గతంలో అంతర్జాతీయ నిధులు రాజకీయ ప్రాధాన్యతలు, పరిపాలనా లోపాల వల్ల పక్కదారి పట్టిన ఉదాహరణలను దృష్టిలో ఉంచుకుని, ఈ నిధులు అవినీతికి తావులేకుండా నేరుగా రోగులకు అందేలా ప్రభుత్వం పటిష్టమైన పారదర్శక విధానాలను అవలంబించాల్సి ఉంది.
ఈ నిధుల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్సీలు) స్థాయిలోనే మౌలిక వసతులను బలోపేతం చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రసవాలు, అత్యవసర వైద్య సేవల కోసం రోగులు నగరాలకు పరుగులు తీసే పరిస్థితిని మార్చడానికి ఇది ఒక మంచి అవకాశం . ప్రతి రోగి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా మారుమూల గ్రామం నుండి జిల్లా హాస్పిటల్ వరకు అనుసంధానం చేయవొచ్చు. దీనివల్ల నిరంతర చికిత్స పర్యవేక్షణ సులువవుతుంది. ఉస్మానియా, నిమ్స్, గాంధీ వంటి చారిత్రాత్మక బోధనా హాస్పిటల్స్ లలో అత్యాధునిక వైద్య పరికరాల (ఎంఆర్ఐ, సి.టి.స్కాన్, ల్యాబ్) కొనుగోలుకు , మౌలిక సదుపాయాల విస్తరణకు ఈ నిధులు ఊతాన్నిస్తాయి.మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులను గ్రామీణ స్థాయిలోనే ముందస్తుగా గుర్తించే స్క్రీనింగ్ కేంద్రాల ఏర్పాటుకు నిధులు ఉపయోగపడతాయి. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో అతలాకుతలమవుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ప్రాథమిక, ద్వితీయ శ్రేణి వైద్య సేవలను పటిష్టం చేయడం అత్యవసరం. మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, వృద్ధులకు ప్రత్యేక వైద్య సంరక్షణ అందించడం వంటి అంశాలకు ఈ నిధుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, భారీగా అందుతున్న అంతర్జాతీయ రుణాలు కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు సకాలంలో అందేలా చూడటంలోనే అసలైన సవాలు దాగి ఉంది.
గతంలో అనేక ప్రభుత్వాలు ఇటువంటి అంతర్జాతీయ నిధులను పొందినప్పటికీ, పరిపాలనాపరమైన ఆలస్యం , సరైన పర్యవేక్షణ లోపించడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. పరిపాలనా పరమైన సమస్యలు , ఐఏఎస్ అధికారుల తరచుగా బదిలీలు, మరియు నిధులను ఇతర రాజకీయ ప్రాధాన్యత గల పథకాలకు మళ్లించడం వంటి కారణాల వల్ల వైద్య రంగానికి కేటాయించిన సొమ్ము మౌలిక వసతులుగా మారలేకపోయింది. కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవినీతి, కాలం చెల్లిన మందుల కొనుగోలు, హాస్పిటల్స్ లలో పరికరాలు కొన్నా అవి పనిచేయకపోవడం వంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఈ ₹4,500 కోట్ల నిధుల విషయంలోనూ అటువంటి లోపాలు పునరావృతమైతే, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడమే తప్ప సామాన్యుడికి ఒరిగేదేమీ ఉండదు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే, ప్రపంచ బ్యాంక్ నిర్దేశించిన ‘ఫలితాల ఆధారిత నిధుల విడుదల’ విధానాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి. అంటే, పనులు పూర్తయి క్షేత్రస్థాయిలో రోగులకు సేవలు అందినప్పుడే ప్రపంచ బ్యాంక్ తదుపరి విడత నిధులను విడుదల చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం క్రింది సూచనలను పాటించాలి. ఈ ₹4,500 కోట్ల నిధులు ఏ హాస్పిటల్ కు , ఏ పని కోసం ఎంత కేటాయించారో ప్రజలందరికీ తెలిసేలా ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి. ప్రతి రూపాయీ ఎక్కడ ఖర్చవుతుందో లైవ్ డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శించాలి.
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే భవనాలు, కొనుగోలు చేసే వైద్య పరికరాలకు జియో-ట్యాగింగ్ తప్పనిసరి చేయాలి. వైద్యుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పర్యవేక్షిస్తూ రోగులకు సేవలు అందుతున్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి. గ్రామీణ హాస్పిటల్స్ లలో మందుల కొరత ఉన్నా, అవినీతి జరిగినా రోగులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్-ఫ్రీ నంబర్, వాట్సాప్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల విజయం వారు తెచ్చే నిధుల పరిమాణంలో లేదు, ఆ నిధులు క్షేత్రస్థాయి నిరుపేద రోగి ముఖంలో తెచ్చే చిరునవ్వులోనే ఉంది. వైద్య విభాగానికి అందుతున్న ఈ అరుదైన అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక బాధ్యతగా స్వీకరించాలి. రాజకీయ జోక్యానికి తావులేకుండా, పారదర్శకమైన విధానాలతో ఈ నిధులను సద్వినియోగం చేసుకున్నప్పుడే ‘ఆరోగ్య తెలంగాణ’ కల సాకారమవుతుంది.





