మహిళా శక్తిని ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యం

  • మ‌హిళ‌ల కోసం 15 ర‌కాల వ్యాపారాల‌కు వ‌డ్డీలేని రుణాలు
  • ఉచిత బస్సు ఇస్తే విప‌క్షాల కళ్ల‌లో నిప్పులు
  • పంచాయతీరాజ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

మహిళలు ఇంటిని చక్కదిద్దడమే కాదు.. అవకాశమిస్తే దేశాన్ని కూడా చక్కగాదిద్దుతారు. అందుకే మహిళా శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అధిక‌ ప్రాధాన్యమిస్తూ పాలనను ముందుకు నడుపుతున్నారని పంచాయతీరాజ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఫరూక్ నగర్ మండలం మదరాపురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో కమ్మదనం – మధురాపూర్, శేరిగూడ వరకు గ్రామాల మధ్య రూ . 8 కోట్లతో రెండు లైన్ల బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆమె, అనంతరం నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనం, మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాలకు రూ.50 కోట్ల చెక్కును అందించారు. అనంతరం సీత‌క్క‌ మాట్లాడుతూ.. సమాజాన్ని బాగు చేసే శక్తి మహిళలకే ఉందని పేర్కొన్నారు.

అందుకే మహిళల కోసం ఉచిత బస్సు ఏర్పాటు చేయడమే కాకుండా రూ.500ల‌కే గ్యాస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను తీసుకువచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు సౌక‌ర్యం క‌ల్పిస్తే బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకోవడమే కాకుండా మహిళల పట్ల చులకనగా మాట్లాడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గత ప్రభుత్వం 200 ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా రైతు భరోసా, ఉచిత కరెంట్ ఇచ్చింది తప్ప నిరుపేదల కోసం ఒక యూనిట్ కరెంటు కూడా ఉచితంగా ఇవ్వలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వొచ్చాకే నిరుపేదలను గుర్తించి వారి కోసం 200 యూనిట్ల కరెంట్‌ ఉచితంగా అందజేస్తుందన్నారు.

ఇది మాత్రమే కాకుండా త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని, సంక్రాంతికి సన్న బియ్యం, రేషన్ షాపుల ద్వారా ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. సావిత్రిబాయి పూలే మహిళల కోసం, వారి విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కానీ ఏనాడు గత ప్రభుత్వం ఆమెను గుర్తించలేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా, ఆరోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారని అన్నారు. త్వరలోనే వ్యవసాయ కూలీలుగా పని చేసే నిరుపేదలకు ఏడాదికి 12,000 అందజేస్తామని వెల్లడించారు. రేషన్ కార్డుల పంపిణీ కూడా త్వరలోనే జరుగుతుందని స్పష్టం చేశారు.

మహిళల కోసం 15 వ్యాపారాలు..
మహిళాశక్తిని వెలికితీయడంలో భాగంగా 15 రకాల వ్యాపారాలను ప్రభుత్వం రూపొందించిందని, దీనికి వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా క్యాంటిన్లు, మహిళా కుట్టుమిషన్లు, మహిళా ఈవెంట్లు, పిల్లల స్కూల్ యూనిఫామ్ లు తయారు చేసే బాధ్యత, 32 జిల్లాలలో చేపల వృత్తిలో ఉన్నవారికి పది లక్షల రుణం ఆరు లక్షల మాఫీతో అందించడం వంటివి మాత్రమే కాకుండా 32 జిల్లాలలో 150 బస్సులు మహిళలు నడుపుకునేందుకు వీలుగా ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా చేపల వృత్తిలో ఉన్న వారికి చేపలను సరఫరా చేసేందుకు వాహనాలను కూడా అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకొని మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇంటింటికి పేపర్లు వేయడం, ఇంటింటికి పాలు అమ్మడం తో మొదలుపెట్టి పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారని మహిళలు అవకాశం ఇస్తే వారికి ఏమాత్రం తీసి పోరని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేకు ప్రశంసలు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై మంత్రి సీతక్క ప్రశంసల జ‌ల్లు కురిపించారు. నియోజకవర్గ ప్రగతి కోసం శంకరన్న నిరంతరం శ్రమిస్తున్నారని, ఏ అవసరం ఉన్నా తన వ‌ద్ద‌కు వొచ్చి వినతి పత్రాలు ఇచ్చి నిధులు అడుగుతాడని గుర్తు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *