– యూజర్ నేమ్ ఉన్నా ఫోన్ నంబర్ తప్పనిసరి
– కేంద్రం అభ్యంతరాలకు వాట్సాప్ సమాధానం
న్యూఢిల్లీ, జూలై 2: వాట్సాప్‌లో ప్రవేశపెట్టబోతున్న యూజర్‌నేమ్ ఫీచర్‌తో నకిలీ గుర్తింపులు, డిజిటల్ అరెస్టు మోసాలు, ఆర్థిక మోసాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఫీచర్‌ను ఇంకా అందుబాటులోకి తేలేదని, వినియోగదారులు తమకు నచ్చిన యÖజర్ నేమ్‌ను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని మెటా సంస్థకు చెందిన వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులు, ఆర్థిక సంస్థలు, ప్రజాప్రతినిధుల పేర్లతో పోలిన యూజర్‌నేమ్‌లను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందంటూ తమతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఈ ఫీచర్‌ను అమలు చేయొద్దని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. అలాగే ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, భద్రతా చర్యలపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని నోటీసు జారీ చేసింది. కేంద్రం ఆందోళనల నేపథ్యంలో వాట్సాప్ కీలక వివరణ ఇచ్చింది. యూజర్‌నేమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తేలేదని, ఈ ఏడాది చివర్లో దశలవారీగా అమలు చేస్తామని వెల్లడించింది. కొత్త ఫీచర్‌తో వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను వెల్లడించకుండా కొత్త వ్యక్తులు, గ్రూపులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ ఫీచర్‌తో గోప్యత, భద్రత, నకిలీ ఖాతాలు, మోసాలు వంటి అంశాలపై వస్తున్న సందేహాలకు ‘ఎక్స’ వేదికగా వివరణ ఇచ్చింది. యూజర్‌నేమ్‌ను తప్పనిసరిగా సృష్టించాల్సిన అవసరం లేదని, ఇది వారి ఇష్టమని వాట్సాప్ పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఇప్పటికే ఉన్న యూజర్‌నేమ్‌లు ఆయా ఖాతాదారుల కోసం రిజర్వ్ అవుతాయని తెలిపింది. అలాగే ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు, మెటా వెరిఫైడ్ ఖాతాలకు సంబంధించిన పేర్లు, వాటి వేరియేషన్లు కూడా దుర్వినియోగానికి గురికాకుండా రక్షిస్తామన్నది. ఒకవేళ సాధారణ పేరు ఇప్పటికే మరొకరు తీసుకున్నట్లయితే ప్రత్యామ్నాయ యూజర్‌నేమ్‌లను సూచించే జనరేటర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. తన యÖజర్‌నేమ్‌కు దగ్గరగా మరో వ్యక్తి పేరు సృష్టించి మోసాలకు పాల్పడితే ఎలా అనే ప్రశ్నకు వాట్సాప్ స్పందించింది. యూజర్‌నేమ్‌లను సెర్చ్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. కొత్త వ్యక్తి నుంచి మెసేజ్ వస్తే అతని దేశం, ఖాతా వివరాలు, భద్రతా హెచ్చరికలు చూపిస్తామని తెలిపింది. ఇప్పటికే ఉన్న బ్లాక్, రిపోర్ట్ వంటి భద్రతా చర్యలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. యూజర్‌నేమ్‌తోపాటు ’యూజర్‌నేమ్ కీ’ అనే అదనపు భద్రతా వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే అవతలి వ్యక్తికి యూజర్‌నేమ్‌తోపాటు కీ కూడా తెలిసి ఉండాల్సి ఉంటుందని, అవసరమైతే ఈ కీని ఎప్ప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న అదే యూజర్‌నేమ్‌ను వాట్సాప్‌లో కూడా ఉపయోగించాలనుకునే వారు ముందుగా ఆ ఖాతాలను లింక్ చేసి యాజమాన్యాన్ని నిర్దారించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కావాలంటే ఆ ఖాతాలను అన్-లింక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించింది. ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు, మెటా వెరిఫైడ్ ఖాతాలకు సంబంధించిన యూజర్‌నేమ్‌లను వారి అసలు యజమానుల కోసమే రిజర్వ్ చేసినట్లు తెలిపారు. వాట్సాప్‌ను ఉపయోగించడానికి మొబైల్ నంబర్ తప్పనిసరిగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




