బీఆర్‌ఎస్ గూండాగిరికి భయపడేది లేదు

– భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
– చర్చలకు మంత్రులు వస్తే పారిపోయింది వారే
– రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : బీఆర్‌ఎస్ పార్టీ గూండాగిరికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడేది లేదని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన బీఆర్‌ఎస్ నాయకులు ఇంకా అధికారంలోనే ఉన్నాం.. లేదా మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమతో మాట్లాడుతున్నారన్నారు. వారి అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని, అయినా ఇంకా అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటూ ఈ ప్రభుత్వంపై గుడ్డకాల్చి వేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో వారు అంటించుకున్న బురదను ఇప్పటి ప్రభుత్వానికి లేదా మంత్రులకు అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనకు ప్రజలు కాంగ్రెస్‌కు అధికారమిస్తే మతి భ్రవించి రెండున్నరేళ్లకే గద్దె దిగమని డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ రెండున్నరేళ్లలో ఏం జరిగిందో ఎలాంటి తీర్పులు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు, దేశానికి తెలుసునని అన్నారు. ఏశాఖ అయినా సరే పిలిచిన టెండర్ మొత్తం కంటే మూడు నాలుగు రెట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం వారి అవివేకానికి నిదర్శనం అంటూ ఇలాగే వారి ప్రవర్తన కొనసాగితే రానున్న కాలంలో వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. మీ సవాల్‌ను స్వీకరించి తమ మంత్రులు వస్తే మీరు రాకుండా పరారయ్యారని, మా మంత్రులు అక్కడే గంట వరకూ వేచి చూసి మీడియాతో మాట్లాడి వచ్చారని తెలిపారు. అసెంబ్లీలో కూడా మీరు ఏం మాట్లాడతారో మాకు తెలుసు. దానికి కూడా తేదీని ఖరారు చేస్తాం.. అని పొంగులేటి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *