- రణరంగమైన గంగుల క్యాంప్ ఆఫీస్!
- కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల ఆగ్రహం
- ఎమ్మెల్యే గంగుల కార్యాలయంపై దాడి.. కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం
- పరస్పరం కర్రలతో దాడి చేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు
- రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసిన పోలీసులు
- కరీంనగర్, హుజూరాబాద్‌లో హైటెన్షన్
కరీంనగర్, ప్రజాతంత్ర, మే 7: కరీంనగర్ లో ఉద్రిక్తత (Karimnagar Tension) చోటుచేసుకుంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్దాలు పగులగొట్టారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ ట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిపై సైతం దాడికి యత్నించారు. దీంతో హుజురాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంలోకి బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్లారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై బీఆర్‌ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను క్యాంప్ కార్యాలయానికి తరలించి, గేట్లు మూసేశారు.
భారీ బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని కరీంనగర్ నుంచి హుజురాబాద్‌కు తరలించారు. హుజురాబాద్ క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై దాడికి యత్నించారు. దీంతో వారిని బీఆర్‌ఎస్ కార్యకర్తలు, కౌశిక్ రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఉండగానే బీజేపీ శ్రేణులు చొచ్చుకురావడంతో కౌశిక్ రెడ్డి అనుచరులు వారిపై కర్రలతో దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

బండి సంజయ్‌కి అన్ని కోట్ల ఆస్తులెక్కడివి? కౌశిక్ రెడ్డి ప్రశ్న
బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ ఏది మాట్లాడితే.. బండి సంజయ్ అదే మాట్లాడుతున్నారని తెలిపారు. బండి సంజయ్ తిట్టాల్సింది కేటీఆర్‌నా .. రేవంత్ రెడ్డినా అని ప్రశ్నించారు. బంగారం షాపులో దొంగతనం జరిగితే ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నిలదీశారు. రేవంత్‌ను సంజయ్ ఒక్క మాట కూడా ఎందుకు అనడం లేదని అన్నారు. భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కు కోట్ల రూపాయలు ఎక్కడివని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బండి సంజయ్‌కు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్‌కు దమ్ముంటే కేటీఆర్‌తో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్‌ను ఇష్టం వచ్చినట్టు తిడితే ఊరుకునేది లేదన్నారు. బండి సంజయ్‌ను కూడా తాము తిట్టగలమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బీజేపీ కార్యకర్తల దాడులపై కెటిఆర్, హరీష్ రావు ఫైర్..
కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. దాడులను తీవ్రంగా ఖండించారు. పట్టపగలు గూండాల్లా వచ్చి వాహనాలు, ఆఫీసుపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ పిరికిపంద చర్యలకు ఉసిగొల్పుతున్నారంటూ బండి సంజయ్‌పై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ’ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల హేయమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో మాట్లాడాం. పట్టపగలు గుండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలను, ఆఫీసును ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. కళ్లముందే ఇంత అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూడటం సిగ్గుచేటు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి తన అనుచరులతోనే శాంతి భద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
బండి సంజయ్ అనుచరుల దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ ట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





