కౌలు రైతుల‌ను గుర్తించాలి

– జాతీయ రైతు ఉద్య‌మ నాయ‌కుడు యోగేంద్ర‌యాద‌వ్ డిమాండ్‌
– సీఎం దృష్టికి తీసుకెళ‌తాన‌ని డిప్యూటీ సీఎం హామీ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 24:  తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు డిమాండ్‌ను ప్రముఖ రాజకీయవేత్త, జాతీయ రైతు ఉద్యమ నాయకుడు, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొఫెస‌ర్‌ యోగేంద్ర యాదవ్ గ‌ట్టిగా స‌మ‌ర్థించారు. ఈమేర‌కు ఆయ‌న డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ను క‌లిసి ఈ గుర్తింపు ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణం అమ‌లు చేయాల‌ని కోరారు. ఆయ‌నతోపాటు ప్రొఫెస‌ర్‌కోదండరామ్, కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ప్రతినిధులు విస్సా కిరణ్ కుమార్, బి.కొండల్, కన్నెగంటి రవి బృందంతో ఈనెల‌ 22న డిప్యూటీ సీఎంతో స‌మావేశ‌మ‌య్యారు. తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కౌలు
రైతుల ఇబ్బందులను తాను స్వయంగా తెలుసుకున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 2023లో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి రైతు స్వరాజ్య వేదిక నిర్వహించిన బహిరంగ విచారణలో జూరీ సభ్యుడిగా తాను ఉన్నప్పుడు కౌలు రైతుల గుర్తింపు తక్షణం జరగాలని 2011 సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేసినట్టు యోగేంద్ర యాదవ్ గుర్తు చేశారు. ఆ తరువాత అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి  కౌలు రైతులకు హామీ ఇస్తూ ఒక బహిరంగ లేఖ రాయడం గురించి అప్పుడు సంతోషించామ‌న్నారు. అయితే ప్రభుత్వం  ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిన ఇంకా కౌలు రైతులకు గుర్తింపు కానీ, అప్పటి
కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిన 2011 చట్టాన్ని అమలు చేయడం కానీ ప్రారంభించకపోవడం నిరాశను కలిగించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడైనా తక్షణం కౌలు రైతులకు గుర్తింపు మొదలుపెట్టి కనీసం వాళ్లకు సబ్సిడీ మీద ఎరువులు కానీ, పంట రుణాలు గానీ,
పంట అమ్ముకునే వ్యవస్థ కానీ పంట నష్టపరిహారం కానీ అందేవిధంగా చూడాలని కోరారు. కౌలు రైతులలో 90% పైగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నందున‌ వారిని గుర్తించి న్యాయం చేయడం ద్వారా ప్రభుత్వం తన సామాజిక న్యాయం అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన భాగంగా ఈ విషయాన్ని చూడాలని యోగేంద్ర యాదవ్ అన్నారు. తెలంగాణ రైతు కమిషన్ నుంచి కూడా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు 2011 చట్టం ప్రకారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కి లేఖ రాసింది, కాబట్టి దీనిని త్వరగా అమలు చేయడం అవసరం అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సాధన కమిటీ తరఫున డిప్యూటీ సీఎంతో మాట్లాడుతూ విస్సా కిరణ్ కుమార్, కన్నెగంటి రవి మాట్లాడుతూ కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వ్యవసాయ, రెవెన్యూ శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యున్నత అధికారులతో వివరంగా చర్చించిన తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చినట్లు, దాని ప్రకారం గుర్తింపు ప్రక్రియపై తాము ఒక నోట్ తయారు చేసినట్టు తెలిపారు. నోట్ కాపీని డిప్యూటీ సీఎంకు ఇచ్చారు. అలాగే తాము రాష్ట్రవ్యాప్తంగా చేసిన సర్వే రిపోర్ట్ ను కూడా సమర్పిస్తూ తాము సర్వే చేసిన 55 గ్రామాలలో కూడా కౌలు రైతులు ప్రభుత్వ గుర్తింపు లేక అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చ‌నందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భ‌ట్టి స్పందిస్తూ వారు చెప్పిన విషయాలన్నీ న్యాయమైనవని, కౌలు రైతులకు గుర్తింపు విషయంపై తాను కూడా పూర్తిగా సమర్థిస్తున్నట్లు చెప్పారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాగుదారుల చట్టం తెచ్చినప్పుడు తాను కూడా అసెంబ్లీలో ఉన్నట్లు, ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరరం, కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియపై తనకు మంచి అవగాహన ఉన్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ విషయంపై త్వరలో కేబినెట్ నిర్ణయం దిశగా చర్యలు తీసుకుంటామని, కౌలు రైతులకు గుర్తింపు త్వరలోనే మొదలయ్యేలా ప్రయ త్నిస్తామ‌ని హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *