అధిష్ఠానం పరిశీలనలో సుష్మిత వ్యవహారం

– కాంగ్రెస్ పెద్దలు తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం
– సోషల్ మీడియాతో బతికేస్తున్న కేటీఆర్
– మెదక్ లో కాంగ్రెస్ సమావేశంలో టీపీసీసీ చీఫ్

మెదక్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన‌ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించిన తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సురేఖపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు పట్టుబడుతున్న పరిస్థితి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మెదక్ హౌసింగ్ బోర్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. ఇప్పటికే ప్రాథ‌మిక నివేదిక‌ను ఏఐసీసీకి అందజేశామని, స‌మ‌గ్ర నివేదిక‌ వచ్చాక పెద్దలు ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. కాంగ్రెస్ పెద్ద పార్టీ కాబట్టి చెప్పుకునే స్వేచ్చ ఎక్కువ ఉంటుందని మహేశ్ తెలిపారు. స్వేచ్ఛ హద్దులు దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని, తనతో సహా అందరూ హద్దుల్లో ఉంటే మంచిదని అన్నారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నట్టుగానే కాంగ్రెస్ కుటుంబంలో కూడా ఉంటాయన్నారు. కష్టపడ్డ కార్యకర్తకు న్యాయం జరుగుతుంది.. ఇది సీఎం మాట, నా మాట, మీనాక్షి నటరాజన్ మాట. ఎవ్వరికీ కూడా 100 శాతం న్యాయం చేయలేం.. నేను వాస్తవాలు మాట్లాడతా. 70 శాతం పదవులు పాత కాంగ్రెస్ నాయకులకే దక్కేలా అధిష్ఠానం హామీ ఇచ్చింది. ములుగులో మంత్రి సీతక్క పాత నాయకులకే పదవులు ఇచ్చారని తెలిపారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నాయని మహేశ్ మండిపడ్డారు. సోషల్ మీడియాపై కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారని, కత్తి దూసినోడు కత్తికే చనిపోతాడు అన్నట్టు కేటీఆర్ ను సోషల్ మీడియానే ఖతం చేస్తుందని వ్యాఖ్యానించారు. పదేళ్లు బీఆర్ఎస్ చేసిన దోపిడీ, భూ దందా, అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. మల్లన్నసాగర్ కట్టేటప్పుడు ఎంతమందిపై కేసులు పెట్టి జైలుకి పంపారో జనాలు మర్చిపోలేదని తెలిపారు. ప్రధాని మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మెదక్ ఎంపీ రఘునందన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్న ఉద్యోగాలు తీసేసిన ఘనత ప్రధాని మోదీది అంటూ విరుచుకుపడ్డారు. మోదీ హవా తగ్గిందని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన ఇంటికి పోక తప్పదని అన్నారు. ప్రజలు 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లలో ప్రజాస్వామ్యం తక్కువన్నారు. దళితుడు రాజయ్య డిప్యూటీ సీఎంగా ఉంటే రాత్రికి రాత్రే పదవి నుంచి తొలగించారని, ఈటల రాజేందర్‌ను మెడ పట్టి గెంటేశారని మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *