– బడి పేరుతో 800 ఏళ్ల నాటి కాకతీయ శివాలయం విధ్వంసం
– ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో రూ.500 కోట్ల కుంభకోణం
– బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ధ్వజం
నర్సంపేట/ఖానాపురం, ప్రజాతంత్ర, మే 11 : గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి కాకతీయుల నాటి చారిత్రక శివాలయాన్ని కూల్చివేశారని బీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో రూ.500 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని, అన్నీ ఎక్సెస్ టెండర్లేనని ఆరోపించారు. నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని ఆయన పరిశీలించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరీష్‌రావు వెంట ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. శివాలయం సందర్శన అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో బడులు ఆగమే కాదు.. ఏకంగా గుడుల విధ్వంసం కూడా జరుగుతోందన్నారు. ఆనాడు కేసీఆర్ మన ఊరు-మన బడి పెడితే రేవంత్ రెడ్డి దాన్ని అర్ధాంతరంగా నిలిపేశారని, రేవంత్ రెడ్డి పుణ్యమా అని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని తెలిపారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి వంద శాతం రుణ మాఫీ చేయకుండా మాట తప్పిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆయనకు దేవుడంటే భయం లేదు.. భక్తీ లేదు.. కేసీఆర్ యాదాద్రి లాంటి మహా పుణ్యక్షేత్రాలను నిర్మిస్తే రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, మసీదులు, చర్చిలు, ఇప్పుడు ఏకంగా గుడులు కూలగొడుతున్నాడని విమర్శించారు. విశాఖ పీఠం కూలుస్తా అని మొన్న అధికారులను పంపాడు.. సీఎం అయిన కొత్తలో సెక్రటేరియట్‌కు పోతే లంకే బిందెలు దొరుకుతాయనుకున్నా అని అన్నాడు.. ఆయన అనుయాయులతో కలిసి నిజాం భవనాల చుట్టూ గుప్త నిధుల కోసం బాగానే వెతికాడు. అక్కడ దొరకకపోయేసరికి ఇప్పుడు కాకతీయుల గుడుల మీద పడ్డాడు.. అని వ్యాఖ్యానించారు. అశోక్ నగర్‌లో కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన 800 ఏళ్ల నాటి అద్భుతమైన శివాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని ఆరోపించారు. ఆలయ రక్షణ కోసం ఉన్న అతిపెద్ద మట్టి ఆనకట్టను తొలుచుకుంటూ వెళ్లి మరీ గర్భగుడిని ధ్వంసం చేశారని తెలిపారు. రాత్రి 12 నుంచి 1 గంట మధ్య గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల లోతు భారీ గుంత తవ్వారన్నారు. స్కూల్ కట్టే పనైతే పగలు చేయొచ్చు కదా.. అర్ధరాత్రి ఎందుకు తవ్వారు అని ప్రశ్నించారు. గుప్త నిధుల వేటలో రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇది గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకమే అని పురావస్తు శాఖ జిల్లా అధికారి బుజ్జి ఈ నెల 7న కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, ఆ అధికారి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫఐఆర్ కాలేదని, మిషనరీ సీజ్ చేయలేదని, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. అంటే దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నది స్పష్టం అని అన్నారు. బీఆరఎస్ హయాంలో ధరణిలో ఇది దేవాలయ భూమిగా ఉంటే కాంగ్రెస్ రాగానే భూభారతిలో రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది అని నిలదీశారు. స్కూల్ కట్టడానికి చుట్టూ కావలసినంత స్థలం ఉంది. అసలు ఈ నియోజకవర్గంలో వేరేచోట జీవో వచ్చిన స్కూల్‌ను ఇక్కడికి ఎందుకు మార్చారు అని ప్రశ్నించారు. గుడి ఉన్నకాడ బడి కట్టొచ్చు.. కానీ గుడిని కూలగొట్టడం ఎందుకు అని నిలదీశారు. పురావస్తు శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తక్షణమే ఎఫఐఆర్ నమోదు చేసి, బాధ్యులను అరెస్టు చేసి మిషనరీని సీజ్ చేయాలని, యుద్ధప్రాతిపదికన ఈ శివాలయాన్ని పునరుద్ధరించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. 1958 చట్టం ప్రకారం వందేళ్లు దాటిన కట్టడాలు ఆర్కియాలజీ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పగించాలన్నారు. అర్ధరాత్రి తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు, లంకె బిందెలు ఏ ప్రభుత్వ పెద్దల ఇళ్లకు పోయాయో సమగ్ర విచారణ జరగాలన్నారు. సీవీసీకి, విజిలెన్స్‌కు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పిలిస్తే అన్నీ 4.86%, 4.96%, 4.99% ఎక్సెస్‌కే ఇచ్చారని ఆరోపించారు. ఒక్కటి కూడా మైనస్‌కు పోకుండా అన్నీ ఎక్సెస్‌కే ఎట్లా పోయాయన్నారు. ఈ టెండర్లలో ఏకంగా రూ.494 కోట్ల లక్ష ఎక్సెస్ ద్వారా ప్రజాధనం లూటీ అయ్యిందన్నారు. నర్సంపేట ప్యాకేజ్-8 కింద రూ.136 కోట్లకు టెండర్ ఉంటే అది రూ.142 కోట్లకు (4.86% ఎక్సెస్) ఇచ్చారు. తమకు అనుకూలంగా ఉండేందుకు ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్ గా పెట్టుకుని ఈ రూ.500 కోట్ల దోపిడీకి తెరతీశారని కూడా ఆరోపించారు. టెండర్లు దక్కించుకున్న వాళ్లు హరీశ్ రావు మనుషులే అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు.. వాళ్లు నా మనుషులే అయితే వెంటనే ఆ టెండర్లను రద్దు చేయి.. నేనే కదా రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నది.. మొన్న హామ్ రోడ్ల పేరుతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో 25% ఎక్సెస్‌తో జరిగిన రూ.5000 కోట్ల కుంభకోణాన్ని అసెంబ్లీలో బయటపెట్టి పోరాడింది నేనే. నీ మనుషులా.. నా మనుషులా.. అన్నది కాదు. అది రాష్ట్ర ప్రజల చెమట చుక్కల ఆదాయం. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 5% కి మించి ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసి,వెంటనే ఈ ప్రజాధనం లూటీని ఆపాలి అని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





