– రవాణా శాఖ మంత్రి పొన్నం విమర్శ
– బండి కుమారుడి కేసులో న్యాయం జరుగుతుంది
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఎమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు తెలంగాణకు కావలసిన అభివృద్ధి అంశాలపై ఒక్క వినతి పత్రం అయినా ఇచ్చారా.. ట్రిపుల్ ఆర్ నిధులు, మెట్రో నిధులు కావాలి, రేడియల్ రోడ్లు కావాలని ఏమైనా అడిగారా అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఒకవైపు తమ సమర్థవంతమైన పాలనను ప్రజలు హర్షిస్తున్నారు అని చెప్పుకుంటూనే పెట్రోల్డీ, జిల్ వాడొద్దు..బంగారం కొనవద్దు.. వంట నూనె వాడవద్దు.. విదేశాలకు వెళ్ళవద్దు అని దేశ ప్రధాని మాట్లాడడం సరైంది కాదని అన్నారు. ప్రధాన మంత్రిస్థాయి వ్యక్తి అలా మాట్లాడడం సరైంది కాదు.. ఆదర్శంగా ఉండాలి అన్నారు. గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా లాంటి పరిస్థితి వచ్చేలా ఉందని ఇటీవల ప్రధాన మంత్రి ప్రకటన చేయగానే ప్రజలు భయపడి పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్‌లలో ఉన్నారన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారు.. అలాంటి గాంధీ కుటుంబ సభ్యుడిని మావోవాది, ముస్లిం లీగ్ అని మాట్లాడడం సరైంది కాదన్నారు. అందరికీ జీవించే హక్కు సమానమన్నారు. విభజించు పాలించు లాగా మాట్లాడుతున్నారు.. శ్రీరామ్ పేరు చెప్పి బీజేపీ నాయకత్వం ఓట్లు అడుగుతున్నది.. భద్రాచలం, కొండగట్టు, వేములవాడ, బాసర ఆలయాల అభివృద్ధి తామే చేస్తున్నామని, ప్రసాద్ స్కీమ్ కింద ఏ ఆలయాలకు బీజేపీ తెలంగాణ నాయకత్వం నిధులు తెచ్చింది అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు గోదావరి పుష్కరాలకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని ఎందుకు అడగలేదు అని నిలదీశారు. బీసీ హక్కుల గురించి అడగరు.. దేవాలయాల అభివృద్ధి అడగరు.. క్యూర్ ఏరియా అభివృద్ధి గురించి అడగరు.. అబ్కీ బార్ సర్కార్ అంటున్నారు.. అభివృద్ధి గురించి మాట్లాడరు అని విమర్శించారు. ప్రధానమంత్రిగా తెలంగాణకు వస్తె రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటే పెద్ద కోడి గుడ్డు సున్నా ఇచ్చిపోయారని వ్యాఖ్యానించారు.
రాహుల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కుల గణన
రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని తాము ప్రధానికి చెప్పామన్నారు. జన గణనలో కాలం 13లో ఎస్సీ, ఎస్టీ మాత్రమే ఉంది.. బీసీల ఇళ్ల లెక్క చేయాలని మోడీకి చెప్పామన్నారు. జన గణనలో బీసీ కుల గణన చేర్చáకపోవడాన్ని తెలంగాణ బలహీనవర్గాలు గమనించాలన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది.. బీఆరఎస్ దానిని ఏటీఎంగా వాడుకుంటోంది.. సీబీఐ విచారణ జరిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా, బండి సంజయ్, కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.. మరి తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు 12 ఏళ్లలో ఏం చేశారో చెప్పి కొట్లాడండన్నారు. .తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడిన సికింద్రాబాద్ టవర్ సర్కిల్‌లో మీరు ఇచ్చిన నిధులకు కేంద్ర ప్రభుత్వ వాటా..రాష్ట్ర వాటా ఎంత అనేది చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరనారు. 29 రాష్ట్రాలకు ఎలా ఇస్తున్నారో మాకూ అలాగే ఇచ్చారన్నారు.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చారు.. మౌలిక సదుపాయాలు కావాలి.. కేంద్రీయ సంస్థలు కావాలి.. పక్క రాష్ట్రం వాళ్ళు ఎన్ని నిధులు అడిగితే అన్ని తీసుకుపోతున్నారు.. తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణకు ఏం నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను తమకు కావాల్సిన అంశాలు అడుగుతుంటే వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు.. 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్లు ఇలా అనేక హామీలు ఉన్నాయి.. ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
కేంద్ర మంత్రిగా విచారణను అడ్డుకోవద్దు
పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగారు.. కుమారుడిపై ఆరోపణలు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన చెప్పాల్సింది.. కేంద్ర మంత్రి పదవి ఉపయోగించుకొని విచారణను అడ్డుకోవడం చేయద్దు.. విచారణకు సహకరించాలి అని పొన్నం ప్రభాకర్ సూచించారు. కేంద్ర మంత్రి హోదాలో ఒత్తిడి తెస్తే ఉపేక్షించేది లేదన్నారు. తాను సైబరాబాద్ కమిషనర్‌తో మాట్లాడానని, దోషులకు శిక్ష పడాలి.. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ఇందులో కుల ప్రస్తావన అవసరం లేదు.. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలి.. ప్రభుత్వానికి ఎవరి పట్ల ప్రేమ.. వివక్ష ఉండదు.. మహిళల పట్ల ఎవరు నిరక్ష్యంగా వ్యవహరించినా బాధ్యత వహించాల్సిందే.. పోలీసులు బాధ్యత విస్మరిస్తే వారిపై చర్యలు తప్పవు… బండి సంజయ్ కుమారుడిపై ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదు.. కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను విచారణ చేయాలని కోరాల్సింది.. మీ మీద కుట్ర చేస్తున్నారని సానుభూతి పొందే ప్రయత్నం ఆపాలి.. అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా..? అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా.. వాటిని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి.. ముందు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి.. పొరపాటు జరిగినా మీరు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. తెలంగాణ బిడ్డలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.. తప్పకుండా ఆడబిడ్డలకు విశ్వాసం కలిగిస్తున్నాం.. ఇలాంటి చర్యల్లో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు. ముఖ్యమంత్రి డీజీపీతో మాట్లాడి విచారణకు ఆదేశించారన్నారు. మహిళా డీసీపీతో విచారణ జరుగుతుంది.. దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరు అని మంత్రి పొన్నం తెలిపారు. ఈ కేసులో బీసీల అంశం తెరమీదకు తేవడం సరికాదు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు మన వ్యక్తిత్వానికి ఇబ్బంది అయినప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మనమే విచారణకు ఆదేశించాలి.. అని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





