Take a fresh look at your lifestyle.

పాతవారికే టికెట్‌…‌ మరి ఎర్ర గులాబీల సంగతేంటి

రానున్న శాసనసభ ఎన్నికలపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో అతికష్టంగా విజయం సాధించడంతో ఇక కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతాడని రాజకీయ పార్టీలు ఊహాగానాలు ప్రారంభించాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా పార్టీ ఎల్‌పి సమావేశంలో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అందరూ ఊహిస్తున్నట్లు ముందస్తు ఎన్నికలు జరుగవని, నిర్ణీత కాలం ప్రకారమే ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పడంతో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. అయితే కెసిఆర్‌ ఎప్పుడూ చెప్పింది చేయడని, అందుకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని మరికొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ కార్యకర్తలకు హితబోధ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే టిఆర్‌ఎస్‌లో చేరికల పర్వం కొనసాగుతున్నది. వివిధ పార్టీల నుండి చోటా, బడా నాయకులు గులాబి కండువ కప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో టికెట్‌పై ఆశపెట్టుకున్నవారి ఆశలు ఆవిరి అయిపోతున్నాయి.

ఇప్పటికే పార్టీ టికెట్‌ ‌కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్న నాయకులు అనేకులున్నారు. తాజాగా జరిగిన మునుగోడు ఎన్నికలోనే పార్టీ టికెట్‌ ఆశించి భంగ పడినవారున్నారు. పార్టీ అధినేతలు కెసిఆర్‌, ‌కెటిఆర్‌లు ఏదో విధంగా వారిని బుజ్జగించిన విషయం బహిరంగ రహస్యమే. వీరంతా వొచ్చే ఎన్నికల్లో తమకు టికెట్‌ ‌వొస్తుందన్న నమ్మకంతో కొనసాగుతున్నారు. అయితే తాజాగా పార్టీ సమావేశంలో కెసిఆర్‌ ‌పాత వారికే తిరిగి టికెట్‌ ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడంతో వారి గుండెలు గుబేల్‌ ‌మంటున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో తక్కువలో తక్కువగా ముగ్గురు నలుగురు నాయకులు పార్టీ టికెట్‌ ‌కోసం ఆశపెట్టుకున్నవారున్నారు. కెసిఆర్‌ ‌ప్రకటనతో వీరి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటన్న మీమాంసంలో వారున్నారు. అయితే దీనికి రాజకీయ పరిశీలకులు మరో విధంగా భాష్యం చెబుతున్నారు. మునుగోడు ఎన్నిక సందర్భంగా జరిగిన ఎంఎల్‌ఏల కొనుగోలు ఎపిసోడ్‌తో కెసిఆర్‌ ‌జాగ్రత్త పడుతున్నాడన్నది వారు ఇస్తున్న వివరణ. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్‌ఏలు తమ నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగి రానున్న ఎన్నికల్లోగా అక్కడి ప్రజల డిమాండ్లను తీర్చే అవకాశం ఉంటుందన్నది ఒకటికాగా, వొచ్చే ఎన్నికల్లో తమకు టికెట్‌ ‌లభిస్తుందో లేదో అన్న అనుమానం లేకుండా మరింత శ్రద్ధగా పనిచేసుకునే అవకాశం దీనివల్ల ఏర్పడుతుంది. పార్టీ ఫిరాయింపు ఆలోచన చేసే అవకాశం కూడా ఉండదన్న ఉద్దేశ్యంగానే కెసిఆర్‌ ఈ ‌ముందస్తు ప్రకటన చేసినట్లు ఆ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే వొచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు టిఆర్‌ఎస్‌తో కలిసిపనిచేసే నిర్ణయం తీసుకోవడం కూడా టిఆర్‌ఎస్‌ ‌వర్గాలకు ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. మునుగోడు ఎన్నికల్లో లెఫ్ట్ ‌పార్టీల మద్దతుతోనే బతికి బయటపడ్డట్లు వోట్ల లెక్కలు చెబుతున్నాయి. మునుగోడు మొదటి నుండి కమ్యూనిస్టుల ఇలాఖా కావడంతో దూరపు ఆలోచనతో టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఆ ‌పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీలు కూడా తమ లక్ష్యం మతతత్వ పార్టీ అయిన భారతీయ జనతాపార్టీని ఓడించడమన్న ఏకైక సిద్ధాంతంగానే టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పక్షాన ప్రచారం చేశాయి, గెలిపించాయి. ఇదే పోబడి వొచ్చే శాసనసభ ఎన్నికల్లో ఉంటుందని ఆ పార్టీలు ముందు నుండే చెబుతున్నాయి. ఖమ్మం, నల్లగొండ తదితర ప్రాంతాల్లో కమ్యూనిస్టులకు బలముండడంతో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే మేలన్నది టిఆర్‌ఎస్‌ ‌యోచిస్తున్నది. రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని ఖమ్మం, నల్లగొండలోని ఒక్క సీటును కూడా వదలకుండా గెలువాలని ఇప్పటికే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఖమ్మంలోని ముత్తగూడెం సభలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరుపై ఎర్రజండా ఎగురాల్సిందేనని, అందుకు కార్యకర్తలంతా ఇప్పటి నుండే సన్నద్ధం కావాలన్నారు. దానితోపాటు మరిన్ని నియోజకవర్గాలను ఆ పార్టీ డిమాండ్‌ ‌చేసే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. అలాగే నల్లగొండ జిల్లాలో సిపిఐ పోటీకి సిద్ధమవుతున్నది. ముందుగానే చెప్పుకున్నట్లు మునుగోడులో లెఫ్ట్ ‌పార్టీలకు బలముందన్న విషయం తెలిసిందే. అయితే రానున్న ఎన్నికల్లో అదే మునుగోడుతోపాటు మరో రెండు మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ పరిస్థితిలో ఆయా నియోజకవర్గాల్లో ఆశపెట్టుకున్న టిఆర్‌ఎస్‌ ‌నాయకులకు ఇది పెద్ద ఎదురు దెబ్బగా మారనుంది. ఈ పార్టీలు ఏ మేరకు విజయం సాధిస్తాయోగాని, ఇరు కమ్యూనిస్టులకు కలిపి సుమారు పది నుండి పదిహేను స్థానాల వరకు టిఆర్‌ఎస్‌ ‌వారికి కేటాయించాల్సి రావచ్చు. ఈ పది పదిహేను స్థానాలకు సంబంధించి టిఆర్‌ఎస్‌ ఆశావహుల పరిస్థితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వీరిలో మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఏలున్నారు. వీరిని కెసిఆర్‌ ఏ ‌విధంగా అనునయించనున్నారన్నది ముందు ముందుగాని తెలియదు.

Leave a Reply