– వైషమ్యాలు సృష్టించిన ఇండి కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారు
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
– 10న జరిగే బహిరంగ సభా వేదిక వద్ద భూమి పూజ
– ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ వేదిక వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆధ్వర్యంలో సోమవారం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రామచందర్ రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పులను, బీజేపీ విధానాలను, నరేంద్ర మోదీ సుపరిపాలన, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూడా ప్రజలు బీజేపీ వైపు నిలుస్తారని బలంగా విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తరాది, దక్షిణాది వైషమ్యాలు సృష్టించిన ఇండి కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. తమిళనాడులో అధికార డీఏంకే తుడిచి పెట్టుకుపోతుందన్నారు. కూకట్‌పల్లి నుంచి మైనార్టీలు భాజపాలో చేరారని, ముస్లిం మహిళలు మోదీని పెద్దన్నగా భావిస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి మోదీ బహిరంగ సభా వేదిక వద్ద భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. కేంద్ర ప్రభుత్వ పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ అంకితం చేయనున్నందున ప్రధానికి ఘన స్వాగతం పలకాలని, ప్రతి ఒక్కరూ పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభకు రెండు లక్షల మందికిపైగా కార్యకర్తలు, ప్రజలు హాజరవుతారని భావిస్తున్నామని, ఇప్పటికే పార్టీ నాయకులు జిల్లాల వారీగా పర్యటిస్తూ సభకు భారీ స్పందన తీసుకురావడానికి కృషి చేస్తున్నారని చెప్పారు
ప్రధాని రాక పట్ల ప్రజల్లో ఆసక్తి, ఉత్సాహం
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని తెలంగాణలో అడుగుపెడుతుండటంతో రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి, ఉత్సాహం కనిపిస్తోందని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మోదీ అజెండా ఎప్పుడూ అభివృద్ధి, పేదల సంక్షేమం, పారదర్శక పాలన అనే అంశాలపైనే ఉంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీ, ఎన్డీయే పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ గెలిపిస్తున్నారని తాజా ఎన్నికల ఫలితాలు మరొకసారి నిరూపించాయని చెప్పారు. అస్సాం మినహా నాలుగు రాష్ట్రాల్లో అవినీతి, కుటుంబ పాలన, ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా అక్కడి ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. మోదీ ఉన్నచోటే అభివృద్ధి ఉంటుంది అనే విశ్వాసం ప్రజల్లో పెరుగుతోందని, అభివృద్ధి అజెండాతో మోదీ దేశ ప్రజల మన్ననలు పొందుతున్నారని వివరించారు. తెలంగాణలో కూడా ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పాలనపై విసుగుతో ఉన్నారన్నారు. ఈ రెండు పార్టీలూ రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేశాయని, ఒకటి కుటుంబ పాలనతో, మరొకటి దిల్లీలోని కుటుంబ రాజకీయాలే ప్రాధాన్యంగా పనిచేస్తున్నాయని ప్రజలు గ్రహిస్తున్నారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయించిందంటూ ఏ పార్టీ అధికారంలో ఉందనేది కాదు.. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే మోదీ ప్రాధాన్యం అని అన్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక భావన స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రధాన మంత్రి మోదీకి కానుక అందిస్తామని లక్ష్మణ్ చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



