విద్యుత్‌ రంగంలో దేశానికి దిక్సూచి కావాలి

భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి
విద్యుత్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం డీఏ పెంపు
పెంచిన డిఎ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి
డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: విద్యుత్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవాలని, ఇందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా భవన్‌లో విద్యుత్‌ ఉద్యోగులకు శనివారం ఆయన డిఎ ప్రకటించి ప్రసంగించారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందులో భాగంగా విద్యుత్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు 1.944శాతానికి డీఏ పెంచి ఇవ్వాలని నిర్ణయించినట్టు, ఈ నిర్ణయం ఫలితంగా రాష్ట్రంలోని 71,417 ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పెంచిన ఈ డీఏ విద్యుత్‌ ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఆర్టిజన్స్‌కు వర్తిస్తుందన్నారు. గతంలో 14.074శాతంగా ఉన్న డీఏను 16.018 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. పెంచిన డీఏతో విద్యుత్‌ సంస్థపై ప్రతి నెలా రూ.11.193 కోట్ల భారం పడుతుందని తెలిపారు. మనిషి జీవించడానికి గాలి ఎంత అవసరమో అలాగే పోటీ ప్రపంచంలో ప్రతి ఉత్పత్తికీ విద్యుత్తు అనివార్యం అయిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో 2023 మార్చిలో 15 వేల మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ రాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 2025 మార్చిలో 17,162 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ వచ్చిందని, గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే అదనంగా 2000 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ వచ్చిందని, అయినప్పటికీ ప్రభుత్వం, విద్యుత్‌ ఉద్యోగులు ఓ కుటుంబం మాదిరిగా శ్రమించి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను చేశామని మంత్రి భట్టి తెలిపారు. భవిష్యత్తు డిమాండ్‌కు రెట్టింపు విద్యుత్‌ ఉత్పత్తికి ఇప్పటినుంచే ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసుకుని ముందుకు పోతోందని తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌, పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ నాయకులు రత్నాకర్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ నాయకులు శివాజీ, 1104 యూనియన్‌ నేత సాయిబాబా, 327 యూనియన్‌ నాయకులు శ్రీధర్‌ , పవర్‌ డిప్లమా ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు బేసిరెడ్డి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్‌ నాయకుడు శ్యామ్‌ మనోహర్‌, 1535 యూనియన్‌ నాయకులు వజీర్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు సత్యనారాయణ, ుRపఖూ యూనియన్‌ నాయకులు కరెంటు రావుతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page